
ఫైల్ ఫోటో
కాలిఫోర్నియా: ప్రముఖ టెక్ సంస్థ ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ (59) బిలియనీర్ల జాబితాలో చోటు దక్కించు కున్నారు. ఆగస్టు 2011లో ఆపిల్ బాస్ గా బాధ్యతలను చేపట్టిన తొమ్మిది సంవత్సరాల తరువాత ఆయన ఈ ఘనతను సాధించారు. తాజాగా ఆపిల్ సంస్థ కీలక మైలురాయిని అధిగమించి అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. మార్కెట్ విలువ దాదాపు 2 ట్రిలియన్ డాలర్లకు చేరింది. దీంతో టిమ్ కుక్ అధికారికంగా బిలియనీర్‌గా మారారని బ్లూమ్‌బెర్గ్ తాజా నివేదిక తెలిపింది.
బిలియనీర్స్ ఇండెక్స్ లెక్కల ప్రకారం, టిమ్ కుక్ నికర సంపద 1 బిలియన్ డాలర్లను మించింది. ఆపిల్ షేర్ ధర గత వారం దాదాపు 5 శాతం పెరిగింది. దీంతో ఎలైట్ క్లబ్‌లో టిమ్ చేరారు. అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ 187 బిలియన్ డాలర్లతో ఈ జాబితో టాప్లో ఉండగా, మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ బిల్ గేట్స్ 121 బిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో ఉన్నారు. ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ 102 బిలియన్ డాలర్లు, టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ ఆ తరువాతి స్థానాల్లో నిలిచారు.
బిలియనీర్ల జాబితాలో టిమ్ కుక్ చేరడం అసాధారణమైందని మార్కెట్ పండితులు విశ్లేషించారు. ఒక వ్యవస్థకు చెందిన ఫౌండర్ కాని సీఈఓ బిలియనీర్ గా అవతరించడం చాలా అరుదు అని పేర్కొన్నారు. గత నెల జూలైలో సౌదీ అరేబియా ప్రభుత్వ చమురు కంపెనీని వెనక్కి నెట్టి మరీ, ఆపిల్‌ను ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థల్లో ఒకటిగా నిలిపిన ఘనత కుక్ దే అని ప్రశంసించారు. ఆయన సారధ్యంలో ఆపిల్ ఆదాయం, లాభాలు రెట్టింపు అయ్యాయని గుర్తు చేశారు. కాగా 44 సంవత్సరాల కితం స్టీవ్ జాబ్స్ ఆపిల్ సంస్థను స్థాపించిన సంగతి తెలిసిందే. జాబ్స్ మరణించినప్పుడు ఆపిల్ నికర విలువ సుమారు 350 బిలియన్ డాలర్లు.