ఉక్రెయిన్‌పై రెండు నెలలుగా భీకరమైన దాడులకు పాల్పడుతున్నా ఆ చిన్న దేశాన్ని స్వాధీనం చేసుకోలేక అసహనంతో ఊగిపోతున్న రష్యా బహిరంగంగానే మూడో ప్రపంచ యుద్ధం గురించి మాట్లాడుతోంది. అణు దాడులకు కూడా వెనుకాడబోమని హెచ్చరిస్తోంది. అణు దాడులకు పాల్పడే సాహసం రష్యా చేస్తుందా? అలాంటి దాడులు జరిగితే ప్రపంచం సర్వనాశనమైపోతుందని తెలిసినా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఎందుకీ హెచ్చరికలు చేస్తున్నారన్న చర్చ మొదలైంది. ప్రపంచంలోనే అత్యధికంగా అణ్వాయుధ సంపత్తి ఉన్న దేశమైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యవహార శైలి, దూకుడు మనస్తత్వంతో ఎంతకైనా తెగిస్తారన్న అనుమానాలున్నాయి.
టాక్టికల్ అణ్వాయుధాలు ప్రయోగిస్తారా ?
రష్యా అధ్యక్షుడు పుతిన్ టాక్టికల్ అణ్వాయుధాలు (తక్కువ ప్రాంతంలో విధ్వంసం సృష్టించే అణు బాంబులు) ప్రయోగించడానికి ఆదేశాలిస్తారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. రష్యా దగ్గరున్న క్షిపణి వ్యవస్థల్లో రెండు స్వల్ప దూరంలో లక్ష్యాలను ఛేదించే అణ్వాయుధాలను మోసుకుపోగలవు.
1. కల్బీర్ క్షిపణి (ఎస్‌ఎస్–ఎన్–30)
దీనిని ఉపరితలం నుంచి, సముద్రం నుంచి ప్రయోగించవచ్చు. 1500 నుంచి 2500 కి.మీ. దూరంలో లక్ష్యాలను ఛేదిస్తుంది.
2. ఇస్కందర్ ఎం క్షిపణి లాంఛర్
ఇది ఉపరితలం నుంచి ఉపరితలానికి 400 నుంచి 500 కి.మీ.దూరంలో లక్ష్యాలను ఛేదిస్తుంది.
చిన్న అణుబాంబునైనా ప్రయోగిస్తే ఉక్రెయిన్‌పై యుద్ధంలో గేమ్ ఛేంజర్‌గా మారి ఓడిపోయే దుస్థితి రాదని పుతిన్ భావిస్తున్నట్టుగా వాషింగ్టన్‌లోని కార్నెజీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పేస్‌లో అణు నిపుణుడు జేమ్స్ యాక్టన్ అభిప్రాయపడ్డారు.
ఇవి ఎంత శక్తిమంతమైనవి ?
ఈ టాక్టికల్ అణుబాంబుల్లో అతి చిన్నది ఒక కిలో టన్ను పేలుడు పదార్థంతో సమానం. అదే పెద్దదైతే 100 కిలోటన్నుల పేలుడు పదార్థంతో సమానమైన శక్తి కలిగి ఉంటుంది. దీని వల్ల జరిగే విధ్వంసం అణువార్ హెడ్, అది వేసే ప్రాంతాలపై ఆధారపడి ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా జపాన్‌లోని హిరోషిమాపై ప్రయోగించిన అణుబాంబు 15 కిలోటన్నుల శక్తి కలిగినది. ఈ బాంబు లక్ష 46 వేల మంది ప్రాణాలను తీసింది. ప్రస్తుతం రష్యా దగ్గరున్న అతి పెద్ద అణుబాంబు 800 కిలోటన్నుల శక్తి కలిగి ఉంది.
అణుదాడి స్వీయ ఓటమా ?
ఒకవైపు ఉక్రెయిన్ రష్యాలో భాగమని చెబుతున్న పుతిన్ ఆ భూభాగంపైనే అణు దాడులకు దిగడం ఎంతవరకు సమంజసం అన్న చర్చ సాగుతోంది. ఎప్పటికైనా ఉక్రెయిన్‌ని రష్యాలో కలిపేయాలనుకుంటూ ఆ భూభాగాన్ని నాశనం చేయడమేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఉత్తుత్తి బెదిరింపులేనని చైనా మద్దతు లేని రష్యా ఒక్క అడుగు కూడా ముందుకు వేసే అవకాశం లేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. అణుబాంబుల విషయంలో చైనా ‘‘నో ఫస్ట్ యూజ్’’ విధానానికి కట్టుబడి ఉంది. రష్యా అణుదాడులకు మొదట దిగితే చైనా స్నేహం కూడా కోల్పోవచ్చునని, అందుకే రష్యా అంత సాహసం చేయదని కింగ్స్ కాలేజీ లండన్‌లోని అణు నిపుణుడు డాక్టర్ హెదర్ విలియమ్స్ అభిప్రాయపడ్డారు. ఓ రకంగా అణు బాంబుని ప్రయోగిస్తే రష్యా స్వయంగా ఓటమిని అంగీకరించినట్టేనన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
– నేషనల్ డెస్క్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment