టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన ‘చాట్‌జీపీటీ’ ఇంటర్నెట్ ప్రపంచంలో ఇప్పటికే సంచలనాలు నమోదు చేస్తోంది. కృత్రిమ మేధ(ఏఐ) ఆధారంగా పనిచేసే ఈ చాట్‌బాట్‌పై ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆసక్తి కనిపిస్తోంది. అమెరికాలో ‘ఓపెన్‌ఏఐ’ అనే స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసిన చాట్‌జీపీటీని మైక్రోసాఫ్ట్ కంపెనీ 2022 నవంబర్ 30న ప్రారంభించగా, అతి తక్కువ కాలంలోనే నెటిజన్ల ఆదరణ పొందింది. చాట్‌జీపీటీకి పోటీగా ప్రఖ్యాత గూగుల్ సంస్థ ‘బార్డ్’ పేరిట సొంత ఏఐ ఆధారిత చాట్‌బాట్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్, గూగుల్ చాట్‌బాట్‌లు అందించే సేవల మధ్య వ్యత్యాసాలు ఏమైనా ఉన్నాయా? ఏది ఉత్తమం? అనేది తెలుసుకుందాం.
గూగుల్‌కు అదనపు బలం
గూగుల్ చాట్‌బాట్ ‘బార్డ్’కి గూగుల్ సెర్చ్ ఇంజిన్ అదనపు బలమనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది గూగుల్ సెర్చ్ ఇంజిన్‌ను విస్తృతంగా ఉపయోగించుకుంటున్నారు. కావాల్సిన సమాచారాన్ని పొందుతున్నారు. ఈ సెర్చ్ ఇంజిన్‌ను గూగుల్ సంస్థ తన ‘బార్డ్’తో అనుసంధానించనుంది. దీనివల్ల బార్డ్ ద్వారా మరింత మెరుగైన సేవలను యూజర్లకు అందించేందుకు వీలవుతుంది. మైక్రోసాఫ్ట్ కూడా తన సెర్చ్ ఇంజిన్ ‘బింగ్’తో చాట్‌జీపీటీని అనుసంధానించింది. బింగ్ యూజర్ల సంఖ్య తక్కువగా ఉండటం, గూగుల్ కన్నా మెరుగైన సెర్చ్ ఇంజిన్ సేవలు అందించలేకపోవడం వంటివి చాట్‌జీపీటీకి ప్రతికూలాంశాలుగా మారాయి.
ఏది బెటర్?
మైక్రోసాఫ్ట్ చాట్‌జీపీటీలో 2021 సంవత్సరం వరకు మాత్రమే నాలెడ్జ్ లాక్ చేశారు. అంటే 2021 తర్వాత జరిగిన సంఘటనలకు సంబంధించిన సమాచారం వివరంగా అందించలేదు. గూగుల్ బార్డ్‌లో ఈ సమస్య లేదు. ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకోవచ్చు. బార్డ్ ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు. ప్రస్తుతం నమ్మకమైన కొందరు యూజర్లకు మాత్రమే ఈ సేవలు అందుతున్నాయి. త్వరలో అందరికీ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
గూగుల్ ఉపయోగిస్తున్న ‘లామ్డా’ సమర్థతపై అనుమానాలు ఉండగా, మైక్రోసాఫ్ట్ చాట్‌జీపీటీపై ఇప్పటిదాకా ఎలాంటి ఆరోపణలు రాలేదు. చాట్‌జీపీటీ, బార్డ్‌ల మధ్య ఏది బెటర్ అంటే ఇప్పుడే చెప్పలేమని టెక్నాలజీ నిపుణులు పేర్కొంటున్నారు. ‘బార్డ్’ కూడా అందరికీ అందుబాటులోకి వచ్చాకే రెండింటిలో ఏది ఉత్తమం అనేది నిర్ధారించగలమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కొన్ని స్టార్టప్ కంపెనీలు చాట్‌సోనిక్, జాస్పర్ ఏఐ, ఓపెన్ అసిస్టెంట్, వర్డ్‌ట్యూన్ పేరిట ఏఐ చాట్‌బాట్‌లను తీసుకొచ్చే పనిలో నిమగ్నమయ్యాయి. చైనా సెర్చ్ ఇంజిన్ ‘బైదూ’ కూడా ఎర్నీబాట్ పేరుతో సొంత ఏఐ అప్లికేషన్‌ను తీసుకురావాలని నిర్ణయించింది.
చాట్‌బాట్ అంటే?
మెషీన్ లెర్నింగ్ మోడల్‌లోని డేటాను ఉపయోగించుకొని కృత్రిమ మేధ సాయంతో యూజర్ల ప్రశ్నలకు సంభాషణల రూపంలో సమాధానం ఇవ్వడాన్ని చాట్‌బాట్ అంటారు. ప్రశ్న అడగ్గానే సమాధానాలు స్వయంచాలితంగా(అటోమేటిక్)గా జనరేట్ అవుతాయి. ఏఐ చాట్‌బాట్‌లు మనిషి స్పందించినట్లుగానే స్పందిస్తాయి. వ్యాపారం, విద్య, వైద్యంతోపాటు దాదాపు అన్ని రంగాలకు సంబంధించిన వివరాలు పొందవచ్చు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. కథలు, కవితలు, సినిమా స్క్రిప్ట్‌లు కూడా ఏఐ చాట్‌బాట్ రాసి ఇస్తుంది.
పరీక్షల్లో రాయడానికి వ్యాసాలను సైతం విద్యార్థులు పొందవచ్చు. దీనిపై ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాసాలు సొంతంగా బుర్రకు పదునుపెట్టి రాయాలని, చాట్‌బాట్ నుంచి తీసుకుంటే విద్యార్థుల్లో ఆలోచనాశక్తి నశించిపోతుందని అంటున్నారు. చాట్‌బాట్‌లోనూ లోపాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కచ్చితత్వం లేని, తప్పుల తడకలుగా ఉన్న డేటా వనరుల నుంచి కూడా సమాచారం వస్తుందని, యూజర్లు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment