
బ్రెజీలియా: బ్రెజిల్‌లోని ఆదివాసీ తెగకి చెందిన ఒక ఒంటరి మనిషి తుది శ్వాస విడిచాడు. ప్రపంచంలోనే ఒంటరి వ్యక్తిగా పిలిచే ఆ మనిషి ఇటీవల మరణించినట్టు బ్రెజిల్ అధికారులు వెల్లడించారు. అతని పేరేంటో తెలీదు. బాహ్య ప్రపంచంతో అతనికి సంబంధాలు లేవు. వయసు 60 ఏళ్ల వరకు ఉంటుంది. గత 26 ఏళ్లుగా అడవిలో ఒంటరిగా జీవిస్తున్నాడు. అడవి జంతువుల్ని బంధించడంతో పాటు ఆత్మ రక్షణ కోసం అడవిలో ఎక్కడికక్కడ గోతులు తవ్వుకుంటూ వెళతాడని అతనిని ‘‘మ్యాన్ ఆఫ్ ది హోల్’’ అని పిలుస్తారు. దూరం నుంచే అతని బాగోగుల్ని పర్యవేక్షిస్తున్న బ్రెజిల్ ఆదివాసీ వ్యవహారాల సంస్థ అధికారికి ఆగస్టు 23న ఒక గుడిసెలో అతని మృతదేహం కనిపించింది. అతని మీద దాడి చేసి ప్రాణాలు తీసినట్టుగా ఆధారాలేవీ కనిపించలేదు.
అప్పటికే ఆ వ్యక్తి మరణించి 40 నుంచి 50 రోజులై ఉంటుందని అతని మృతదేహం పడి ఉన్న తీరుని బట్టి అంచనా వేశారు. అతని మృతదేహంపైన రంగు రంగుల పక్షి ఈకలు ఉన్నాయి. దీంతో అతను తన మరణాన్ని ముందుగానే ఊహించి ఈకలు కప్పుకొని ఉంటాడని ఆదివాసీ నిపుణుడు మార్కెల్ డోస్ శాంటో తెలిపారు. రోండానియా రాష్ట్రంలోని టనూరు ఆదివాసీ ప్రాంతంలో నివసించే ఒకానొక ఆదివాసీ తెగలో ఇతను చివరి వాడు కావడంతో మానవజాతిలో ఒక తెగ అంతరించినట్టయింది. నాలుగేళ్ల క్రితం అతను బ్రెజిల్ అధికారుల కెమెరాలకు చిక్కాడు. పదునైన ఆయుధంతో చెట్లు నరికే దృశ్యాలు అందులో ఉన్నాయి.
ఆ వ్యక్తి అధికారులకి కనిపించడం అదే చివరిసారి. టనూరులో ఆదివాసీ తెగపై కొందరు భూ ఆక్రమణదారులు 1970 నుంచి దాడులు చేస్తూ ఈ తెగకి చెందిన వారిని చాలా మందిని బలి తీసుకున్నారని ఆదివాసీల సంక్షేమం కోసం పని చేసే స్వచ్ఛంద సంస్థ సర్వైవల్ ఇంటర్నేషనల్ వెల్లడించింది. ఆ తెగలో మిగిలిన ఆరుగురిని 1995లో అక్రమ గనుల తవ్వకదారులు దాడులు చేసి చంపేశారు. అతనొక్కడే ప్రాణాలతో మిగిలిపోవడంతో ఒంటరివాడైపోయాడు. అప్పట్నుంచి అతని రక్షణని ఎప్పటికప్పుడు బ్రెజిల్ సంస్థ పర్యవేక్షిస్తోంది. ఆ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా నిషేధం విధించింది. ఇప్పుడు ఈ మిస్టరీ మ్యాన్ మరణించడంతో ఆ తెగకు చెందిన వివరాలన్నీ ఒక మిస్టరీగానే మిగిలిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment