లాస్ ఏంజెల్స్: సాధారణంగా పండగలకు ఆఫర్లు ప్రకటించడం మనకు తెలిసిందే. ప్రస్తుతం కరోనా దెబ్బకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ఆయా ప్రభుత్వాలు ప్రైజ్‌మనీలతో ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా వ్యాక్సిన్ వేయించుకోండి.. 116 మిలియన్ డాలర్ల (సుమారు రూ.840 కోట్ల) నగదును గెలుచుకోండంటూ.. తమ రాష్ట్ర ప్రజలకు అమెరికాలోని కాలిఫోర్నియా సర్కారు ప్రైజ్‌మనీ ప్రకటించింది. ఎందుకంత భారీగా బహుమతిని ప్రకటించడం అనుకుంటున్నారా? వివరాల్లోకి వెళితే.. కాలిఫోర్నియా వచ్చే నెల 15న కోవిడ్ ఆంక్షలు ఎత్తివేయనున్న నేఫథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ఈ భారీ బహుమతిని ఇవ్వనున్నట్లు రాష్ట్ర గవర్నర్ గవిన్ ప్రకటించారు. అక్కడ 12 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని నెలల తరబడి ప్రచారం చేసినా, ఇప్పటివరకూ 3.4 కోట్ల మంది జనాభాలో 63% మందే వ్యాక్సిన్ వేయించుకున్నారు.
మిగిలినవారికి వీలైనంత త్వరగా తొలి డోసు అందించేందుకు ఈ ప్రైజ్‌మనీ ఆఫర్‌ను ప్రకటించారు. దీనికి కనీస అర్హతగా తొలిడోసు టీకా వేసుకుని ఉండాలని షరతు పెట్టారు. ఈ లక్కీ డ్రాకు ఇప్పటికే టీకాలు వేయించుకున్న వ్యక్తులు కూడా అర్హులని స్పష్టం చేశారు. జూన్ 4తో లక్కీ డ్రా ప్రారంభమవుతుంది. మొత్తం 10 మందికి 1.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.10.86 కోట్లు), 30 మందికి 50,000 డాలర్లు (రూ.36.21 లక్షలు) నగదు బహుమతులతో పాటు 20 లక్షల మందికి 50 డాలర్ల (రూ.3,600) విలువైన బహుమతి కూపన్లు ఇస్తారట. ఇదే తరహాలో ఒహాయో, కొలరాడో, ఒరెగాన్ రాష్ట్రాలు ఇలాంటి ఆఫర్‌నే ప్రకటించాయి.
Comments
Please login to add a commentAdd a comment