లాస్‌ఏంజెలెస్: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ చాట్‌బాట్ చాట్‌జీపీటీ మరో ఘనత సాధించింది. అత్యంత కఠినమైన యూఎస్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జాం (యూఎస్‌ఎంఎల్‌ఈ) పాసైంది. 1, 2సీకే, 3 అనే మూడు సిరీస్‌లుగా ఉండే ఈ పరీక్షల్లో దాదాపుగా 60 శాతం మార్కులు స్కోరు చేసి ఔరా అనిపించింది. వైద్య విద్యార్థులు, శిక్షణలో ఉన్న వైద్యులు రాసే యూఎస్‌ఎంఎల్‌ఈలో బయోకెమిస్ట్రీ, డయాగ్నస్టిక్ రీజనింగ్, బయోఎథిక్స్ వంటి పలు అంశాలపై లోతుగా ప్రశ్నలుంటాయి. కాలిఫోర్నియాలోని అన్సిబుల్‌హెల్త్ సంస్థ ఈ అధ్యయనం జరిపింది. ఇందులో భాగంగా 2022 జూన్ నాటి పరీక్షలో ఇమేజ్ ఆధారిత ప్రశ్నలు మినహా మిగతా 350 ప్రశ్నలను చాట్‌జీపీటీకి సంధించారు.
మూడు పరీక్షల్లో అది 52.4 నుంచి 75 శాతం మధ్యలో స్కోరు చేసిందట. పాసయ్యేందుకు సగటున 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఈ అధ్యయన వివరాలను పీఎల్‌ఓఎస్ డిజిటల్ హెల్త్ జర్నల్లో ప్రచురించారు. ‘‘అత్యంత కఠినమైన ఈ పరీక్షను మానవ ప్రమేయం అసలే లేకుండా పాసవడం చాలా గొప్ప విషయం. ఈ ఘనత సాధించడం ద్వారా చాట్‌జీపీటీ కీలక మైలురాయిని అధిగమించింది’’ అని పేర్కొన్నారు. అన్సిబుల్‌హెల్త్ సంస్థ ఇప్పటికే సంక్లిష్టమైన వైద్య పరిభాషతో కూడిన రిపోర్టులను రోగులు సులువుగా అర్థం చేసుకునేందుకు వీలైన భాషలో రాసేందుకు చాట్‌జీపీటీని ఉపయోగించుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment