వాషింగ్టన్: కృత్రిమ మేథ అందుబాటులోకి వచ్చాక ఎన్నో పనులు అత్యంత వేగంగా, ఖచ్చితత్వంతో జరిగిపోతున్నాయి. చాట్‌బాట్‌లలో దూసుకుపోతున్న చాట్‌జీపీటీ కొత్త మరో ఘనత సాధించింది. ఒక డిజైనింగ్ సంస్థకు క్లయింట్ నుంచి రావాల్సిన దాదాపు రూ.90లక్షల(1,09,500 డాలర్లు) మొండి బకాయిని రాబట్టింది. అమెరికాకు చెందిన ఒక డిజైనింగ్ సంస్థకు సీఈవో అయిన గ్రెన్ ఐసన్‌బర్గ్ అనే వ్యక్తి తనకు చాట్‌జీపీటీ ఎలా సాయపడిందనే విషయాన్ని సంతోషంతో ట్విట్టర్‌లో షేర్‌చేశారు.
‘‘ గత ఏడాది ఒక ప్రముఖ బ్రాండ్‌కు డిజైన్లు చేసి ఇచ్చాం. అవి వారికి నచ్చాయి. అంతా సవ్యంగా సాగుతోందనే సమయానికి హఠాత్తుగా అటు నుంచి సంప్రదింపులు ఆగిపోయాయి. ఏం జరిగిందని కనుక్కుందామని సమాధానం లేదు. చేసిన డిజైనింగ్ పనికి డబ్బులు అడిగితే రిప్లై లేదు. ఐదుసార్లు మెయిల్ పెట్టినా ఇలుకూపలుకూ లేదు. ఐదు నెలలు గడిచిపోయాయి. ‘ఇక లాభం లేదు. లాయర్ల ద్వారా చట్టప్రకారం ముందుకెళ్దాం’ అని నా కింది ఉద్యోగులు నాకు సలహా ఇచ్చారు. చాట్‌బాట్‌ల హవా కొనసాగుతోంది.
ఒకసారి చాట్‌జీపీటీతో ప్రయత్నిద్దామని నిర్ణయించుకుని వివరాలను పొందుపరిచా. క్లయింట్‌ను బెదిరిస్తూనే చక్కని దౌత్యం నెరిపేలా ఒక మెయిల్‌ను సిద్ధంచేసి ఇచ్చింది. దానికి చిన్నపాటి నా సొంత మార్పులు చేసి క్లయింట్‌కు పంపించాను. అద్భుతం. కేవలం రెండు నిమిషాల్లోనే అటు నుంచి స్పందన వచ్చింది. ‘బాకీ పడిన సొమ్మును చెల్లిస్తున్నాం. చూసుకోండి’’ అంటూ సమాధానమొచ్చింది. నా డబ్బూ వచ్చింది’’ అని ట్విట్టర్‌లో ఐసన్‌బర్గ్ తెగ సంబరపడ్డాడు. భవిష్యత్తులో సంస్థల వ్యాపార లావాదేవీలు ఇలా ఆటోమేషన్ అవుతాయని అభిప్రాయపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment