ఓపెన్ చేయగానే.. హుషారెత్తించే సంగీతం. ఆ మరుసటి క్షణాల్లోనే.. ఒక గ్రామీణ ప్రాంతం. ఫోన్ కెమెరాలు ఓ మహిళ వైపు వెళ్తుంటాయి. కనీసం తలుపు కూడా లేని గుడిసె అది. అందులో గోడకు కట్టిన గొలుసు.. ఆమె మెడకు వేలాడదీసి ఉంది. పేదల కోసం డబ్బు సేకరించే ఓ వ్లోగర్ సరదాగా తీసిన ఆ వీడియోను 1.92 బిలియన్ల మంది చూశారంటే.. నమ్మగలరా?
జియాన్‌గ్సు ప్రావిన్స్‌లో రికార్డైన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తొలుత జనవరి 28వ తేదీన వీడియో షేరింగ్ యాప్ డౌయిన్(చైనా వెర్షన్ టిక్‌టాక్).. ద్వారా వైరల్ అయ్యింది. విడుదల కావడమే విపరీతమైన చర్చకు దారితీసింది కూడా. కుక్కల కంటే హీనంగా ఒక నిస్సహాయురాలిని కట్టేసి.. ఆమెపై లైంగిక వాంఛలు తీర్చుకుంటున్న ఈ కథనంతో ఒక్కసారిగా సోషల్ మీడియా ఉలిక్కిపడింది. చైనాలో పేరుకుపోయిన హ్యూమన్ ట్రాఫికింగ్ వ్యవస్థ ఎంత దారుణంగా ఉంటుందో చెప్పడానికి ఉదాహరణగా ఈ ఘటన దొరికిందంటూ పలువురు చర్చించారు. అయితే పరిస్థితి చెయ్యి దాటిపోతుండడంతో.. అదే రోజు సాయంత్రం ఆ వీడియోపైన ఫెంగ్ కౌంటీ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆమెకు మతిస్థిమితం లేదు!
యంగ్ కుటుంబానికి చెందిన ఆ మహిళకు మతిస్థిమితం లేదని, దాడులకు పాల్పడుతుండడంతో అలా కట్టేశారని, భర్త ఎనిమిది మంది పిల్లలతో ఆమె జీవిస్తోందని అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. ఇక్కడే అధికారులు అడ్డంగా నెటిజన్స్‌కు దొరికిపోయారు. పిల్లల్ని కనే విషయంలో కఠినమైన చట్టాల్ని పాటించే(2016 వరకు ఒకే బిడ్డ అనే నినాదం ఉండేది) చైనాలో.. ఎనిమిది మంది పిల్లల్ని కనేందుకు ఒక మహిళకు ఎలా అవకాశం ఉంటుందని నిలదీశారు. దీంతో అదంతా కట్టుకథగా తేలింది.
ఆ ఇద్దరితో మొదలై..
జియాంగ్సు, అన్‌హుయి ప్రావిన్స్‌లోని ఇద్దరు స్నేహితురాళ్ల జోక్యంతో ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ‘ఈ ప్రపంచం నిన్ను ఒంటరిని చెయ్యనివ్వదు. నీ కోసం నీ అక్కాచెల్లెళ్లం వస్తున్నాం’ అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు వీళ్లిద్దరూ. అంతేకాదు ఫెంగ్ కౌంటీ మొత్తం తిరుగుతూ.. యాంగ్‌కు సంబంధించిన కథనాలను ప్రచురిస్తూ జనాలకు ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇస్తూ పోయారు. దీంతో ఈ వ్యవహారం ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యింది. యాంగ్‌కు మద్దుతగా లక్షల మంది సైన్ పిటిషన్ చేపట్టారు.
అధికారుల అంతరిక్ష పల్టీలు
ఈ వ్యవహారంలో చైనా ప్రభుత్వం ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసబెట్టి స్టేట్‌మెంట్లు రిలీజ్ చేస్తూ పోతోంది. ఆమె పేరు, ఆ వ్యక్తితో సంబంధం, ఆమె మానసిక స్థితి.. ఇలా ఒకదానికి మరొకటి పొంతన లేకుండా పోతోంది. అయినప్పటికీ ఆ ప్రతీ ప్రకటనను జనాలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎందుకంటే ప్రతీదాంట్లోనూ ఆమె, ఆమె నిస్సహాయ స్థితి కనిపిస్తోంది కాబట్టి. అయితే ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు. నిస్సహాయస్థితిలో ఉన్న ఆడవాళ్లను, ఆఖరికి మానసిక స్థితి బాగోలేని.. వాళ్ల పరిస్థితులను ఆసరాగా తీసుకుని సైతం గ్రామీణ ప్రాంతాలు అక్రమంగా తరలిస్తున్న ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దీంతో చచ్చినట్లు నిజాన్ని సగం ఒప్పేసుకుంది అక్కడి ప్రభుత్వం. కానీ, అసలు ఆమె ఎవరు? ఏంటనే వివరాల్ని మాత్రం వెల్లడించడం లేదు. అదే టైంలో ఆమెను వీడియో తీసిన వ్లోగర్, ఆమె గొలుసులు విప్పాలని ప్రయత్నించిన ఇద్దరు అమ్మాయిలు జాడ లేకుండా పోయారు. దీంతో మీడియా హౌజ్‌లు వణికిపోతుండగా.. కేవలం సోషల్ మీడియాకే ఈ క్యాంపెయిన్ అంకితమవుతోంది. అదే సమయంలో యంగ్ ఫొటోను సెన్సార్‌షిప్ చేసింది చైనా ప్రభుత్వం. ఎవరైనా ఆమె ముఖం ప్రచురిస్తే.. కఠినంగా శిక్షిస్తామని హెచ్చరిస్తోంది.
బంగారు రాణులు మాకెందుకు?
చైనా స్నో క్వీన్ ఎయిలీన్ గూ వింటర్ ఒలింపిక్స్‌లో హాఫ్ పైప్ స్కయింగ్ విభాగంలో స్వర్ణాలతో మెరిసిన 18 ఏళ్ల చిన్నది. అమెరికాలో శిక్షణ పొంది.. చైనా తరపున వింటర్ ఒలింపిక్స్‌లో చైనా తరపున పాల్గొంటోంది. దీని వెనుక చైనా ఒత్తిడి ఉందనుకోండి.. అది వేరే విషయం అనుకోండి. బంగారు పతకాలు వేసుకున్న ఎయిలీన్ గూ లాంటి వాళ్లు తమకు అక్కర్లేదని, మెడలో ఇనుప గొలుసులతో ఉన్న యాంగ్ లాంటి వాళ్ల గాథలే తమకు చెప్పాలంటూ చైనా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు పలువురు.
చైనాలో ఒకే బిడ్డను కనాలనే నిబంధన చాలామంది మగవాళ్లకు ఒక సమస్యగా మారింది. దీంతో హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా ఆడవాళ్లను ఎత్తుకెళ్లి.. మారుమూల పల్లెల్లో దాచేవి కొన్ని ముఠాలు. వాళ్ల ద్వారా పిల్లల్ని కని.. తమ కోరికలను తీర్చుకునేవాళ్లు కొందరు. ఆ తర్వాత ఒక్క బిడ్డ నిబంధన మాయమైపోవడంతో.. ఆ మహిళలు పూర్థిస్తాయి సె* బానిసలుగా మారిపోయారు. గొలుసులతో బంధించి మృగాలకంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఈ పైశాచికత్వం ఏళ్ల తరబడి కొనసాగుతున్నా.. ప్రభుత్వాలకు తెలిసి కూడా చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గం. అంతర్జాతీయ సమాజం నిలదీస్తే.. ఇంకెన్ని అబద్ధాలు పుట్టుకొస్తాయో చూడాలి మరి.
Comments
Please login to add a commentAdd a comment