Colossal Outbreak: China May Report Daily 630,000 Coronavirus Cases - Sakshi
Sakshi News home page

China Covid Cases: కరోనా ఆంక్షలు ఎత్తివేయడం అసాధ్యం!..హెచ్చరిస్తున్న అధ్యయనాలు

Published Sun, Nov 28 2021 5:51 PM | Last Updated on Sun, Nov 28 2021 6:33 PM

Colossal Outbreak: In China May Record Daily 630,000 Coronavirus Cases - Sakshi

బీజింగ్‌:  ఇతర దేశాల మాదిరిగా కాకుండా ఇప్పటికీ  కోవిడ్‌ ఆంక్షలు కొనసాగిస్తూ కోవిడ్‌ రహిత దేశంగా చైనా తగు జాగ్రత్తలతో ఉందని ప్రపంచవ్యాప్తంగా భావించారు. కానీ వాస్తవానికి అక్కడ పరిస్థితి రోజు రోజుకి దిగజారుతోందనే చెప్పాలి. అంతేకాదు తాజా అధ్యయనాలు సైతం చైనాలో కరోనా వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, పైగా రోజుకి సుమారు ఆరు లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందంటూ హెచ్చరిస్తున్నాయి.

(చదవండి: ఆ దేశంలో అట్టహాసంగా కోతుల పండగ!)

పెకింగ్ యూనివర్శిటీ గణిత శాస్త్రవేత్తల నివేదిక ప్రకారం జీరో కరోనా కేసుల లక్ష్యాన్ని వదిలేసి ఇతర దేశాల మాదిరి కరోనా ఆంక్షలను ఎత్తివేస్తే  చైనాలో రోజుకి సుమారు ఆరు లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. పరిస్థితి ఇలానే కొనసాగితే అక్కడి వైద్యావ్యవస్థకు భరించలేని భారంగా తయారవుతోందని నివేదికలో పేర్కొంది. అంతేకాదు ప్రస్తుతం చైనాలో 23 కొత్త కరోనా కేసుల నమోదయ్యాయని నివేదిక తెలిపింది. అయితే చైనా ఈ మహమ్మారి బారిన పడటానికి ముందు 2019 చివరిలో వ్యూహాన్‌లో కరోనాకి సంబంధించిన తొలి కేసు నమోదైన సంగతి తెలిసిందే. 

ఈ మేరకు ఇప్పటివరకు చైనాలో సుమారు లక్ష కేసులు నమోదవ్వగా, 4వేల మందికి పైనే మరణించినట్లు నివేదిక తెలిపింది. అయితే ఇందులో 785 మంది రోగులు ఇంకా చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చెప్పినట్లుగా  దక్షిణాఫ్రికా నివేదించిన ఈ  కొత్త  కరోనా వైరస్ వేరియంట్ ఒమిక్రాన్ పెద్ద సంఖ్యలో ఉత్పరివర్తనాలను కలిగి ఉండటంవల్ల ప్రపంచదేశాలకు ఈ వైరస్‌ని ఎదుర్కోవడం పెద్ద సవాలుగా మారుతుందంటూ చైనా ప్రముఖ శ్వాసకోశ నిపుణుడు జాంగ్ నాన్షాన్ హెచ్చరించారు. అయితే చైనాలో ఇప్పటివరకు 76% వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తైయిందని, ఈ ఏడాది చివరి కల్లా 80% లక్ష్యాన్ని చేరుకోగలందంటూ జాంగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. పైగా చైనాలో ప్రధానంగా వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేసే కంపెనీ అయిన సినోవాక్ బయోటెక్ కంపెనీ ఒమిక్రాన్‌ వైరస్‌పై ప్రత్యేక దృష్టి సారించడమేకాక ఆ వైరస్‌ ఉత్పరివర్తనలకు సంబంధించిన నమూనాలను సేకరించి పరిశోధలను చేస్తోందని అన్నారు.

ఈ మేరకు భారత్‌తో సహా మిగతా దేశాలకు సైతం విమాన రాకపోకలను చైనా నిషేధించిందన్నారు. అంతేకాదు చైనా 23 వేలమంది భారత్‌ విద్యార్థులతో సహా వేలాదిమంది విదేశీ విద్యార్థులను సైతం చైనా విశ్వవిద్యాలయాలలో చదవడానికి అనుమతించలేదని చెప్పారు. పైగా చైనాకు జీరో కరోనా ఇన్‌ఫెక్షన్‌లను లక్ష్యంగా చేసుకోవడం తప్ప మరోమార్గం లేదని కూడా జాంగ్ అన్నారు. అయితే  ఏది ఏమైన చైనా సమర్థవంతమైన వ్యాక్సిన్‌లు ఉత్పత్తి చేయడం లేదా నిర్దిష్ట చికిత్స లేకుండా ఇప్పట్లో ఎటువంటి ఎంట్రీ-ఎగ్జిట్ క్వారంటైన్ చర్యలను ఎత్తివేయడం సాధ్యం కాదని పెకింగ్ యూనివర్శిటీకి చెందిన నలుగురు గణిత శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు చైనా ఈ సరికొత్త కరోనా వేరియంట్‌ నుంచి మరింత సురక్షితంగా బయటపడాలి అంటే అన్ని రకాలు చర్యలు తీసుకోక తప్పదంటూ పరిశోధకులు వక్కాణించారు.

(చదవండి: దగ్గు మందు అక్రమ రవాణ.. వైద్యుడితో సహా ఆరుగురు అరెస్ట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement