ప్రతీకాత్మకచిత్రం
టెహ్రాన్: ఇరాన్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఉరికంబం ఎక్కే క్రమంలో గుండెపోటుకు గురై ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అయినప్పటికీ ఆమె మృతదేహాన్ని ఉరికి వేలాడదీసి శిక్ష అమలు చేశారు. స్థానిక మీడియా వివరాల ప్రకారం.. జరా ఇస్మాయిలీ అనే మహిళ భర్త అలీరెజా జమానీ, తమ ఇద్దరు పిల్లలతో కలిసి జీవించేది. అయితే కొన్నాళ్ల క్రితం భర్తతో విభేదాలు తలెత్తాయి. రోజూ తనను, కూతురిని అసభ్యంగా దూషిస్తూ దిగజారి ప్రవర్తించడంతో భర్తపై కోపం పెంచుకున్న ఆమె, అతడిని హతమార్చింది. ఈ క్రమంలో స్థానిక కోర్టు జరాను దోషిగా తేల్చి మరణశిక్ష విధించారు. అప్పటి నుంచి రజాయి షహర్ జైలులో జీవితం గడుపుతున్న ఆమెను, ఉరితీసేందుకు రంగం సిద్ధం చేశారు.
ఈ నేపథ్యంలో ఉరిశిక్ష అమలుకు కాసేపటి ముందే గుండెపోటుతో ఆమె మరణించింది. ఈ విషయం గురించి జరా తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ‘‘16 మంది పురుషుల తర్వాత జరాను ఉరి తీసేందుకు నిశ్చయించారు. తన ముందే వారందరూ విలవిల్లాడుతూ మరణించడం ఆమె కళ్లారా చూసింది. గుండె పగిలి కుప్పకూలిపోయింది. అయినప్పటికీ తన మృతదేహాన్ని ఉరికంబం ఎక్కించారు. జరా నిర్జీవ శరీరాన్ని వేలాడదీసి, ఆమె కాళ్ల కింది కుర్చీని తన అత్తగారు తన్నేశారు.
ఇది నిజంగా దారుణం’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక జరా మరణ ధ్రువీకరణ పత్రంలో గుండెపోటు కారణంగానే ఆమె మరణించినట్లు పేర్కొన్నట్లు న్యాయవాది వెల్లడించారు. కాగా ఉరిశిక్షల అమలును మానవ హక్కుల కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆటవిక సంస్కృతికి చరమగీతం పాడాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచ నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చి ఉరిశిక్షలను రద్దు చేసేలా చట్టాలు తీసుకురావాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment