వాషింగ్టన్: కేన్సర్‌తో పోరాడి కన్నుమూసిన అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రూత్ బాడర్ గిన్స్‌బర్గ్ స్థానంలో మరో మహిళనే నామినేట్ చేస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఉత్తర కరోలినాలోని ఒక ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ సుప్రీం న్యాయమూర్తిని వచ్చేవారంలో నామినేట్ చేస్తామని మహిళకే ఆ అవకాశం దక్కుతుందన్నారు. ఒక అధ్యక్షుడిగా సుప్రీం జడ్జిని నియమించే అధికారం పూర్తిగా తనకి ఉందన్నారు.
సంప్రదాయ భావ జాలం కలిగిన రిపబ్లికన్ పార్టీ సుప్రీం కోర్టు జడ్జిని నియమించడం ద్వారా న్యాయవ్యవస్థపైనా, ఇతర సామాజిక అంశాలపైనా పట్టు సాధిస్తుందన్న ఆందోళన ఇప్పటికే డెమొక్రాట్లలో ఉంది. అధ్యక్ష ఎన్నికలు దగ్గరకొస్తున్న తరుణంలో తనకి అంది వచ్చిన ఈ అవకాశాన్ని ట్రంప్ వదులుకోవడానికి సిద్ధంగా లేరు. అందుకే అధ్యక్ష ఎన్నికల తర్వాతే సుప్రీం కోర్టు జడ్జి నియామకం జరగాలన్న డెమొక్రాట్ల వాదనని ఆయన పట్టించుకోలేదు. 45 మంది వరకు తమ జాబితాలో ఉన్నారని, త్వరలోనే వారిలో షార్ట్ లిస్ట్ చేసి వచ్చే వారమే నామినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని ట్రంప్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment