మెదడులో చిప్‌.. చెస్‌ ఆడించారు | Elon Musk's Neuralink Brain-Chip Uses Patient To Play Chess | Sakshi
Sakshi News home page

పక్షవాతం సోకిన వ్యక్తి మెదడులో చిప్‌.. చెస్‌ ఆడించారు

Published Thu, Mar 21 2024 9:24 AM | Last Updated on Thu, Mar 21 2024 9:53 AM

Elon Musk Neuralink Brain Chip Uses Patient To Play Chess - Sakshi

ఇంతకాలం అసాధ్యం అనుకున్నదానిని సుసాధ్యం చేసినట్లు ప్రపంచ అపర కుబేరుడు ఎలన్‌ మస్క్‌ గర్వంగా ప్రకటించుకున్నారు. పక్షవాతానికి గురైన ఓ వ్యక్తి మైండ్‌ కంట్రోల్‌ చిప్‌ సాయంతో అతనితో చెస్‌ ఆడాడు. తద్వారా చారిత్రాత్మక మైలురాయి చేరుకున్నట్లు మస్క్‌ సంతోషం వ్యక్తం చేశారు.

ఎలన్‌ మస్క్‌కు చెందిన కంపెనీ న్యూరాలింక్‌ కార్పొరేషన్‌ అరుదైన ఫీట్‌ సాధించింది. ఓ వ్యక్తి బ్రెయిన్‌లో చిప్‌ అమర్చి.. అతని మైండ్‌ సాయంతో(Telepathically) ఆన్‌లైన్‌లో చెస్‌ ఆడిస్తూ అదంతా లైవ్‌ స్ట్రీమింగ్‌ చేసింది. క్వాడ్రిప్లెజియా(కాళ్లు చేతులు పక్షవాతానికి గురైన) పేషెంట్‌ అయిన నోలన్‌ అర్బాగ్ (29) అనే వ్యక్తిలో తొలి న్యూరాలింక్‌ చిప్‌ను అమర్చారు. ఈ ప్రాజెక్టులో భాగం కావడం తన అదృష్టమని సంతోషం వ్యక్తం చేశాడు అర్బాగ్‌.

ప్రపంచంలోని మొట్టమొదటి న్యూరాలింక్ చిప్‌ అమర్చిన వ్యక్తి.. కంప్యూటర్‌ను నియంత్రించగలడని, తన ఆలోచనల ద్వారా ద్వారా వీడియో గేమ్‌లు ఆడగలడని ఎలన్ మస్క్ పేర్కొన్నారు. ఈ విజయం ఆరంభం మాత్రమేనని.. ఇక నుంచి పక్షవాతం, ప్రమాదాలతో శరీర భాగాలు పని చేయకుండా మంచానికే పరిమితం అయిన వాళ్లతో న్యూరాలింక్‌ పని చేస్తుందని మస్క్‌ ప్రకటించారు.   

2016లో బ్రెయిన్‌ టెక్నాలజీ స్టార్టప్‌ ‘న్యూరాలింక్‌’ను ఎలన్‌ మస్క్‌ నెలకొల్పిన సంగతి తెలిసిందే. వైకల్యాలున్న వ్యక్తులు ప్రపంచంతో సంభాషించే విధానాన్ని విప్లవాత్మకంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ స్టార్టప్‌. ఈ క్రమంలో న్యూరాలింక్‌ తయారు చేసిన ఈ బ్రెయిన్‌కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ టెక్నాలజీ చిప్‌ను రోగి మెదడులో అమర్చే ప్రయోగాలు మొదలుపెట్టింది. న్యూరాలింక్‌ చిప్‌ను ఇప్పటికే పందులు, కోతుల్లో విజయవంతంగా పరీక్షించింది. మరోవైపు కంప్యూటర్‌తో మానవ మెదడు నేరుగా సమన్వయం చేసుకొనే ‘బ్రెయిన్‌ కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌’ ప్రయోగాలకు అమెరికా ‘ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ’ గత ఏడాది మేలో ఆమోదం తెలిపింది. జనవరి చివరివారంలో ఓ వ్యక్తి బ్రెయిన్‌లో చిప్‌ అమర్చినట్లు.. అతను ఆరోగ్యంగానే ఉన్నట్లు ఎలన్‌ మస్క్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వ్యక్తే ఈ నోలన్‌ అర్బాగ్

ఎలా పనిచేస్తుందంటే..
న్యూరాలింక్‌ బ్రెయిన్‌కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌ లో 8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన ఎన్‌1 అనే చిప్‌ ఉంటుంది. దానికి సన్నటి ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వెంట్రుకతో పోలిస్తే వాటి మందం 20వ వంతు మాత్రమే. పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ ఎన్‌1 సాధనాన్ని అమరుస్తారు. ఈ చిప్‌నకు ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి చొప్పిస్తారు. ఒక చిప్‌లో మూడువేలకుపైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వాటిని మెదడులోని ముఖ్యమైన భాగాలకు చేరువగా ప్రవేశపెడతారు. అవి సుతిమెత్తగా ఎటుపడితే అటు వంగేలా ఉంటాయి. ఎలక్ట్రోడ్లు.. మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమవుతున్న సందేశాలను గుర్తించి చిప్‌నకు పంపుతాయి. ఒక చిప్‌లోని ఎలక్ట్రోడ్లు వెయ్యి న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి. మొత్తం మీద ఒక వ్యక్తిలోకి 10 చిప్‌లను ప్రవేశపెట్టొచ్చు. ఇన్‌స్టాల్‌ అయ్యాక ఈ బీసీఐ.. మెదడు నుంచి విద్యుత్‌ సంకేతాలను పంపడం, అందుకోవడం, ప్రేరేపించడం వంటివి చేస్తుంది. వాటిని కంప్యూటర్లు విశ్లేషించగలిగే అల్గోరిథమ్‌లుగా మారుస్తుంది.

న్యూరాలింక్‌ కంటే ముందే..
ఈ తరహా ప్రయోగాలు న్యూరాలింక్‌తో పాటు మరికన్ని కంపెనీలు కూడా చేస్తున్నాయి. న్యూరాలింక్‌ కంటే ముందే..  ఆస్ట్రేలియాకు చెందిన సింక్రాన్ అనే సంస్థ 2022 జులైలో యూఎస్‌కు చెందిన ఓ వ్యక్తికి ఈ తరహా చిప్‌ను అమర్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement