
ఎలన్ మస్క్.. ఈ వ్యక్తి మీద రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు. కొంతమంది ఈయన్ని తిక్కలోడుగా భావిస్తుంటే.. ఎక్కువ మంది మాత్రం ఆయన్నొక మేధావిగా భావిస్తుంటారు. అయితే యువతకు మాత్రం ఆయనొక ఫేవరెట్ ఐకాన్. ఎవరేమీ అనుకున్నా.. తాను చేసేది తాను చేసుకుంటూ పోవడం ఆయన నైజం. ఈ క్రమంలో ఆయన వ్యక్తిత్వం మీద పలువురికి అనుమానాలు కలగవచ్చు.
అయితే అందరిలా తనకూ భావోద్వేగాలు ఉంటాయని అంటున్నారు ఎలన్ మస్క్. ట్విటర్‌ను సొంతం చేసుకున్నాక తొలిసారి ఎలన్ మస్క్ జనం మధ్యకు వచ్చాడు. న్యూయార్క్‌లో జరిగిన మెట్ గాలా వార్షికోత్సవానికి ఈ అపర కుబేరుడు తన తల్లిని వెంటపెట్టుకుని వచ్చాడు. అయితే తనపై వచ్చే విమర్శలను భరించేంత గుణం తనలో లేదని వ్యాఖ్యానించాడాయన. మీడియా, ఇంటర్నెట్‌లో నా మీద వ్యతిరేకత విపరీతంగా కనిపిస్తుంటుంది. కానీ..
నాకూ ఫీలింగ్స్ ఉంటాయి. నేనేం రోబోను కాను.. అందరిలా మనిషినే అంటూ భావోద్వేగంగా చెప్పుకొచ్చాడు ఆయన. ఆ టైంలో నాకూ బాధ అనిపిస్తుంటుంది. కానీ, వాటిని తేలికగా తీసుకునే ప్రయత్నం చేస్తానని, ప్రత్యేకించి ఆన్‌లైన్ ట్రోల్స్ విషయంలో అని ఆయన అన్నారు. అన్నట్లు.. ప్రపంచంలో అత్యధిక మంది లైక్ చేసిన ట్వీట్.. చాడ్విక్ బోస్‌మాన్ నివాళి ట్వీట్ కాగా, రెండో స్థానంలో నిలిచింది ఎలన్ మస్క్ ఈ మధ్య ‘కోకా-కోలా’ను కొనుగోలు చేస్తానని ప్రకటిస్తూ చేసిన ట్వీట్.