
ప్రతి ఏటా వరదల కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్ల ఆస్తి నష్టం వాటిల్లుతోంది. అందులో ప్రధానంగా ఇల్లు కూలిపోవడం వంటివి జరుగుతాయనేది కాదనలేని నిజం. అయితే ఎప్పటినుంచో ప్రజలను పట్టి పీడిస్తున్న ఈ సమస్యకు ఓ పరిష్కారం దొరికిందనే అంటున్నారు జపనీస్ హౌసింగ్ డెవలపర్ ఇంజనీర్లు. ప్రజల ఇళ్లను వరదలు ముంచెత్తకుండా అలాగే వరదల వల్ల కొట్టుకుపోకుండా ఉండేందుకు ఒక సమాధానాన్ని కనుగొన్నట్లు చెప్తున్నారు. జపాన్‌కు సంబంధించిన టీబీఎస్ టీవీ చానెల్‌లో దీనికి సంబంధించి ప్రసారం చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
అసలేముంది ఆ వీడియోలో.. ఓ ఇల్లు సాధారణంగా కనిపిస్తుంది. అయితే దాని చుట్టూ నీరు పెరగడంతో ఒక్కసారిగా అది నేలనుంచి కొన్ని అంగుళాలు తేలుతూ కనిపిస్తుంది. అదేంటి ఇల్లు తేలియాడటం ఏంటని చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. అసలు మ్యాటర్ ఏంటంటే జపనీస్ హౌసింగ్ డెవలపర్ సంస్ధ వరద ధాటికి ఇల్లు కొట్టుకుపోకుండా అందుకు అనుగుణంగా ఉండే ఇళ్లను నిర్మించారు. దానికి సంబంధించి వీడియో డెమోనే అది. ఆ ఇంటిని చాలా మందపాటి ఇనుప కడ్డీలను నిర్మాణంలో ఉపయోగించడం మూలాన అవి నీరు ప్రవహిస్తున్నప్పుడు తేలుతూ అలాగే ఉండేలా చేస్తుంది.
నీరు తగ్గినప్పుడు ఆ ఇల్లు తిరిగి దాని అసలు స్థితికి చేరుకుంటుంది. దీంతో వరదల్లో ఇంటికి అయ్యే డ్యామేజ్ కాకుండా వరద ధాటికి కూలిపోవడం లాంటి సమస్యకు చెక్ పెట్టవచ్చని ఆ సంస్ధ ప్రతినిధులు చెప్తున్నారు. ప్లంబింగ్‌లో ప్రత్యేక వాల్వ్ అమరిక కూడా ఉండడంతో, ఇవి ఇంటిలోకి నీరు రాకుండా అడ్డుకుంటాయి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పటికీ దీని నిర్మాణానికి పెద్దగా ఖర్చు కూడా కాదంటున్నారు సంస్ధ ప్రతినిధులు.
Comments
Please login to add a commentAdd a comment