
బెర్లిన్: నరకానికి నకళ్ల లాంటి నాజీ క్యాంప్ పేరు చెబితే ఇప్పటికి జర్మన్ ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు. యూదుల మీద కోపంతో నియంత అడాల్ఫ్ హిట్లర్ వారిని ఊచకోత కోయడం కోసం ఏర్పాటు చేసిన ఈ క్యాంపుల్లో ఎందరో బలయ్యారు. అయితే నాటి కాలానికి సంబంధించిన నేరాల గురించి నేటికి జర్మనీలో విచారణ జరుగుతుంది. ఈ క్రమంలో చివరి కేసులో జర్మన్ కోర్టు గురువారం తీర్పు వెల్లడించింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ కాన్సంట్రేషన్ క్యాంప్‌లో సుమారు 5,232 మంది ఖైదీలను, అనేక మంది యూదులను హత్య చేయడానికి సాయం చేసిన 93 ఏళ్ల బ్రూనో డి అనే వ్యక్తిని హాంబర్గ్ కోర్టు దోషిగా తేల్చింది. నాటి నేరాలకు గాను అతడికి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం పోలాండ్‌లోని గ్డాన్స్క్‌కు సమీపంలోని స్టుతోఫ్ కాన్సంట్రేషన్ క్యాంప్‌లో ఎస్ఎస్ బ్రూనో డి గార్డుగా పని చేసేవాడు. ఈ క్రమంలో 1944 ఏప్రిల్ 1945 మధ్య జరిగిన ఈ హత్యలకు బ్రూనో డి సహకరించినట్లు హాంబర్గ్ కోర్టు గురువారం తెలిపింది.
ఈ నేరం జరిగినప్పుడు బ్రూనో డి వయసు కేవలం 17, 18 సంవత్సరాలు కావడంతో అతడికి యువత శిక్షా మార్గదర్శకాలకు లోబడి శిక్ష విధించినట్లు కోర్టు తెలిపింది. ఈ క్రమంలో బ్రూనో డి ఆ సమయంలో తాను అక్కడ విధులు నిర్వహిస్తున్నట్లు అంగీకరించాడు. అయితే హత్యలకు సహకరించాల్సి వచ్చిందని.. దానిలో తన తప్పమే లేదని తెలిపాడు. అంతేకాక నాటి నరకంలో ప్రాణాలు కోల్పోయిన వారికి, వారి కుటుంబ సభ్యులకు, మిత్రులకు క్షమాపణ తెలిపాడు. స్టుతోఫ్‌లో దాదాపు 65 వేల మందిని హత్య చేశారని మ్యూజియం వెబ్‌సైట్ వెల్లడిస్తుంది. వీరిలో యూదులతో పాటు ఇతరులు కూడా ఉన్నట్లు వెబ్‌సైట్‌లో ఉంది. వీరిలో కొందరిని తల వెనక భాగంలో కాల్చి చంపగా.. మరి కొందరి మీద ప్రాణాంతకమైన జైక్లాన్ బీ వాయువు ప్రయోగించి చంపినట్లు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment