జి–7 భేటీలో పాల్గొన్న దేశాధినేతలు
ఎల్మౌ: ఉక్రెయిన్‌పై దండెత్తుతున్న రష్యాను, అప్పులిచ్చి చిన్న దేశాలను గుప్పిట పడుతున్న డ్రాగన్ దేశం చైనాను అడ్డుకోవడమే లక్ష్యంగా జి–7 శిఖరాగ్ర సదస్సు ఆదివారం జర్మనీలోని బవేరియన్ ఆల్ప్స్‌లో ప్రారంభమయ్యింది. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, అమెరికా దేశాల అధినేతలు పాలుపంచుకుంటున్నారు.
బంగారం దిగుమతులపై నిషేధం సహా రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలను ప్రకటించేందుకు సన్నద్ధమవుతున్నారు. రష్యా నుంచి చమురు, సహజ వాయువు దిగుమతులను భారీగా తగ్గించుకొనేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలపై చర్చలు సాగిస్తున్నారు. చైనా ప్రభావాన్ని అడ్డుకొనేందుకు ఉద్దేశించిన గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్వెస్ట్‌మెంట్ పార్ట్‌నర్‌షిప్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమం కింద 7 దేశాలు కలిసి 2027 నాటికి 600 బిలియన్ డాలర్లు (రూ.46.95 లక్షల కోట్లు) సమీకరిస్తాయి. అంతర్జాతీయంగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ఈ నిధులను ఖర్చు చేస్తాయి. చైనా ప్రభుత్వం మౌలిక సదుపాయాల అభివృద్ధి పేరిట చిన్నదేశాలకు అప్పులిచ్చి, లాభపడుతున్న సంగతి తెలిసిందే. చైనాకు కౌంటర్‌గానే 600 బిలియన్ డాలర్ల నిధిని జి–7 దేశాలు తెరపైకి తీసుకొచ్చాయి.
పుతిన్ జోస్యం ఫలించదు
ఉక్రెయిన్‌లో రష్యా రాక్షసకాండను జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. రష్యా అనాగరిక చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. రష్యా అధినేత పుతిన్‌కు వ్యతిరేకంగా మిత్రదేశాలన్నీ ఒక్కతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. నాటో, జి–7 విచ్ఛిన్నమవుతాయని పుతిన్ జోస్యం చెబుతున్నారని, నిజానికి అలాంటిదేమీ జరగదని స్పష్టం చేశారు. బైడెన్ జర్మన్ చాన్సరల్ ఒలాఫ్ షోల్జ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మిత్రదేశాల నేతలంతా కలిసి ఉంటే అది ఒక గొప్ప సందేశం అవుతుందని షోల్జ్ అభిప్రాయపడ్డారు. తమ ఐక్యతను పుతిన్ ఊహించలేదని చెప్పారు. ఉక్రెయిన్ భద్రత విషయంలో జర్మనీ, అమెరికా కలిసి పని చేస్తాయన్నారు. ప్రపంచ దేశాలన్నీ ఉక్రెయిన్‌కు అండగా నిలవాల్సిన సమయం వచ్చిందని బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ అనుకూల కూటమి విషయంలో విభేదాలకు స్థానం లేదన్నారు
రష్యా బంగారం దిగుమతిపై నిషేధం!
రష్యా నుంచి బంగారం దిగుమతులపై పూర్తిగా నిషేధం విధించాలని జి–7 దేశాలు భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఈ చర్య వల్ల ఆర్థికంగా ప్రపంచంలో రష్యా ఏకాకి అవుతుందన్నారు. చమురు తర్వాత రష్యా నుంచి అత్యధికంగా ఎగుమతి అయ్యేది బంగారమే. 2020లో ప్రపంచం మొత్తం బంగారం ఎగుమతుల్లో రష్యా వాటా 5 శాతం. దీని విలువ 19 బిలియన్ డాలర్లు. దీనిలో 90 శాతం బంగారం జీ7 దేశాలకే వెళ్తోంది.
మన డీఎన్‌ఏలోనే ప్రజాస్వామ్యం ఉంది
మ్యునిచ్: జీ7 సమిట్‌లో పాల్గొనేందుకు ఆదివారం జర్మనీ చేరుకున్న ప్రధాని మ్యునిచ్‌లోని ఆడి డోమ్ స్టేడియంలో భారత సంతతి వారినుద్దేశించి మాట్లాడారు. ‘ప్రతి భారతీయుడి డీఎన్‌ఏలో ప్రజాస్వామ్యం ఉంది. 1975లో ప్రజాస్వామ్యాన్ని అణచివేసేందుకు జరిగిన కుట్రలను ప్రజలు ప్రజాస్వామ్య యుతంగానే తిప్పికొట్టారు. మనం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మన విభిన్న సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుందాం. భారత ప్రజాస్వామ్యం ప్రపంచ ప్రజాస్వామ్యాలకు మాతృక అని సగర్వంగా చాటుదాం’ అని పిలుపునిచ్చారు.
‘గత శతాబ్దంలో సంభవించిన మూడో పారిశ్రామిక విప్లవం నుంచి అమెరికా, యూరప్ లబ్ధిపొందాయి. ఆ సమయంలో భారత్ దాస్య శృంఖలాల్లో ఉంంది. ప్రస్తుత నాలుగో పారిశ్రామిక విప్లవానికి భారత్ నాయకత్వం వహిస్తోంది’ అని అన్నారు. భారతదేశం డిజిటల్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందన్నారు. నూతన సాంకేతికతను అద్భుతమైన రీతిలో ప్రజలు అందిపుచ్చుకుంటున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment