ఇజ్మీర్(టర్కీ): టర్కీ, గ్రీస్‌లను అతలాకుతలం చేసిన భూకంపం ఎందరినో నిరాశ్రయులను చేసింది. అనేక మందిని క్షతగాత్రులుగా మిగిలి్చంది. నాలుగు రోజులుగా సహాయక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకెవ్వరూ శిథిలాల కింద మిగిలిఉండరని భావిస్తూన్న తరుణంలో నాలుగు రోజుల అనంతరం కుప్పకూలిపోయిన ఓ అపార్ట్‌మెంట్ శిథిలాల కింద ఓ చిన్నారి పాపాయి ప్రాణాలతో ఉండడం అందర్నీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచేసింది. ప్రాణాలతో ఉన్న మూడేళ్ళ చిన్నారి ఐదా గెజ్‌గిన్‌ని సహాయక బృందాలు వెలికితీసి, ప్రజల హర్షాతిరేకాల మధ్య, హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం భారీ భూకంపం సంభవించినప్పటి నుంచి 91 గంటల పాటు ఈ చిన్నారి శిథిలాల కింద చిక్కుకుపోయింది. ఐదా గెజ్‌గిన్ తల్లి ఈ విపత్తుకి బలయ్యారు.
ఈ భూకంపం సంభవించినప్పుడు ఐదా తండ్రి, సోదరుడు ఆ భవనంలో లేరు. ఎనిమిది అంతస్తుల ఈ భవనం శిథిలాలను తొలగిస్తుండగా ఓ చిన్నారి ఏడుపు వినిపించడంతో అందర్నీ నిశ్శబ్దంగా ఉండమని చెప్పి పాపాయి కోసం వెతగ్గా డిష్‌వాషర్ పక్కన ఈ చిన్నారిని కనుగొన్నట్టు ఈ పాపను కాపాడిన నస్రత్ అక్సోయ్ చెప్పారు. భవనం శిథిలాలను వెలికితీస్తుండగా, చాలా బలహీనంగా ఉన్న ఈ చిన్నారి తాను ఇక్కడ ఉన్నానని చెప్పేందుకు ప్రయత్నించింనట్టు వారు చెప్పారు. చిన్నారి పిలుపు వినగానే శిథిలాలను తొలగించే మెషీన్‌ను ఆపి శబ్దం వచ్చిన వైపు వెళ్ళి చూడగా ‘ఇక్కడ ఉన్నాను’ అని చెప్పడం చూసి ఒంటిపై రోమాలు నిక్కబొడుచుకున్నాయని నస్రత్ తెలిపారు. చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఆ అమ్మాయి తన తల్లి ఏదని అడిగినట్లు వారు తెలిపారు.
మృత్యువును జయించిన పసిపాప
Published Wed, Nov 4 2020 1:56 AM | Last Updated on Wed, Nov 4 2020 8:04 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment