![A Hoard Of Old Gold Coins Has Been Unearthed In Israel - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/24/GOLD-COINS.jpg.webp?itok=tpTiAatv)
జెరూసలేం : వేయి సంవత్సరాల కిందట మట్టి పాత్రలో దాచిన వందలకొద్దీ బంగారు నాణేలను ఇజ్రాయెల్ యువకులు గుర్తించారు. ఈనెల 18న ఈ నిధిని కనుగొన్నారని ఇజ్రాయెల్ పురాతన సంపద అథారిటీ సోమవారం వెల్లడించింది. మధ్య ఇజ్రాయెల్‌లో జరుగుతున్న తవ్వకాల వద్ద ఈ నిధి టీనేజ్ వాలంటీర్ల కంటపడిందని అధికారులు తెలిపారు. దాదాపు 1100 సంవత్సరాల కిందట ఈ బంగారు నాణేలను భూమిలో పాతిపెట్టిన వ్యక్తి వాటిని తిరిగి తీసుకువెళ్లాలని ఆశించాడని, అందుకు ఆ ప్రాంతంలో ఓడను కూడా సిద్ధం చేశాడని ఇజ్రాయెల్ అధికారి లియత్ నదవ్‌జివ్ వెల్లడించారు. ఈ సంపదను తిరిగి తీసుకువెళ్లకుండా అతడిని నిరోధించింది ఏమటనేదే మనం అంచనా వేయగలిగిందని చెప్పారు.
అమూల్య సంపదను దాచిన సమయంలో ఆ ప్రాంతంలో వర్క్‌షాపులు ఉండేవని, వాటి యజమాని ఎవరనేది ఇప్పటికీ అంతుబట్టని విషయమని అన్నారు. పురాతన బంగారు నాణేలను కనుగొన్న వాలంటీర్లలో ఒకరైన ఒజ్ కొహెన్ ఇవి అద్భుతంగా ఉన్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తవ్వకాల్లో భాగంగా భూమిని తవ్వుతున్న క్రమంలో తాను ఈ బంగారు నాణేలను చూశానని, ఇలాంటి ప్రత్యేక పురాతన సంపదను కనుగొనడం ఉద్వేగంతో కూడిన అనుభవమని చెప్పారు. తొమ్మిదో శతాబ్ధంలో అబ్బాసిద్ కాలిఫేట్ హయాంకు చెందిన 425 నాణ్యమైన 24 క్యారెట్ బంగారు నాణేలు అప్పట్లో చాలా విలువైనవని పురాతన సంపద అథారిటీకి చెందిన నాణేల నిపుణులు రాబర్ట్ కూల్ అన్నారు. ఆ నాణేల విలువతో అప్పట్లో ఓ వ్యక్తి ఈజిప్ట్‌లో అత్యంత విలాసవంతమైన నగరంలో లగ్జరీ హౌస్‌ను కొనుగోలు చేయవచ్చని కూల్ అంచనా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment