కరోనా ఒక ఉత్పాతం... ఉరుము లేని పిడుగులా ఆకస్మికంగా ప్రపంచం నెత్తిపై పడింది.. ఇదేదో చిన్న క్రిమి కాదు ప్రజల ప్రాణాలని నిర్దాక్షిణ్యంగా తీసే అతి పెద్ద మహమ్మారని త్వరలోనే అర్థమైంది. అయినా దానిని కట్టడి చేయలేకపోతున్నాం ఎన్నో ప్రకృతి విలయాలు, ప్రాణాంతక వ్యాధుల్ని మించి కరోనా చెలరేగిపోతోంది....
సునామీలు, భూకంపాలు, వరదలు, తుపానులు, హరికేన్లు.. ఒకటేమిటి ఎన్నో ప్రకృతి విలయాలు చేసే విధ్వంసాన్ని మనం చూస్తూనే ఉన్నాం. మానవాళి మరెన్నో భయంకరమైన మహమ్మారుల్ని ఎదుర్కొంది. వాటి కంటే కొన్ని ప్రాణాంతక వ్యాధుల్ని మించి కరోనా మనల్ని పీడిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ వచ్చాక జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఏప్రిల్ 17, 2021 నాటికి 219 దేశాల్లో కరోనాతో 30 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మరణాల్లో సగం 7 దేశాల్లోనే నమోదయ్యాయి. 20 ఏళ్లలో సంభవించిన ప్రకృతి విలయాల్లో మరణాల కంటే కరోనాయే ఎక్కువ ఉసురు తీసింది.
►2000–2019 మధ్య సంభవించిన ప్రకృతి విలయాలతో మరణించిన వారు 9.4 లక్షల మంది అని ఐక్యరాజ్యసమితి ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ (యూఎన్‌ఏడీఆర్‌ఆర్) వెల్లడించింది.
►2004లో ఇండియా, ఇండోనేసియా తదితర దేశాలను ముంచిన సునామీ, 2008లో మయన్మార్‌ని ముంచేసిన నర్గీస్ తుపాన్, 2010లో హైతిలో వచ్చిన భూకంపం వంటివి ఉన్నాయి.
►ఇక ప్రపంచవ్యాప్తంగా 2017–2019 మధ్య మూడేళ్లలో అక్వయిర్డ్ ఇమ్యూనో డెఫిసీయన్సీ సిండ్రోమ్ 24 లక్షల మంది ప్రాణాలు తీస్తే, కరోనా 16 నెలల్లోనే 30 లక్షల మంది ప్రాణాలను మింగేసింది.
►క్షయ వ్యాధి రెండేళ్లలో 29 లక్షల ప్రాణాలను తీసింది.
►2000–19 మధ్య కాలంలో భారత్‌లో సంభవించిన 320 ప్రకృతి వైపరీత్యాల్లో 79,732 మంది ప్రాణాలు కోల్పోతే, కరోనాతో ఏడాది కాలంలోనే 1.86 లక్షల మంది మరణించారు. అమెరికాలో వాషింగ్టన్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యూయేషన్ (ఐహెచ్‌ఎంఈ) అంచనాల ప్రకారం ఏప్రిల్ రెండో వారంలో వివిధ రకాల వ్యాధులు విజృంభణలో కోవిడ్–19 మూడో ర్యాంకులో ఉంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా మరణాలు, లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఆకలి మరణాలు అన్నింటినీ తీసుకొని, గత 20 ఏళ్లలో సంభవించిన ప్రకృతి వైపరీత్యాలతో పోల్చి చూసింది. జీవించాల్సిన దాని కంటే ముందుగా ఎంత మంది మరణించారో లెక్కలు వేసింది. గత ఏడాదిలో, ప్రకృతి వైపరీత్యాల కారణంగా మరణించిన వారి కంటే కోవిడ్ బారిన పడి ముందస్తుగా మరణించిన వారు ఆసియాలో మూడు రెట్లు ఎక్కువగా ఉంటే, యూరప్‌లో 30 రెట్లు ఎక్కువగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment