అమెరికాలో భారతీయ విద్యార్థుల హవా | India top source of international students in US after 15-year gap | Sakshi
Sakshi News home page

అమెరికాలో భారతీయ విద్యార్థుల హవా

Published Tue, Nov 19 2024 9:54 AM | Last Updated on Tue, Nov 19 2024 10:26 AM

India top source of international students in US after 15-year gap

2023–24 విద్యా సంవత్సరంలో 3,31,602 మంది విద్యాభ్యాసం  

2022–23 కంటే 23 శాతం అధికం  

చైనాను వెనక్కి నెట్టి తొలి స్థానంలోకి..  

ఓపెన్‌ డోర్స్‌–2024 నివేదిక వెల్లడి   

ఉన్నత చదువులకు ఆకర్షణీయమైన గమ్యస్థానం అమెరికా. అగ్రరాజ్యంలో చదువుకోవడం, అక్కడే ఉద్యోగం సంపాదించుకోవడం ప్రపంచవ్యాప్తంగా యువత కల. అమెరికాకు విద్యార్థులను పంపించడంలో చైనా ముందంజలో ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని భారత్‌ దక్కించుకుంది. అమెరికాలో ప్రస్తుతం 3.3 లక్షల మందికిపైగా భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. అమెరికాకు విద్యార్థులను పంపిస్తున్న దేశాల జాబితాలో భారత్‌ తొలిస్థానంలో నిలవడం గత 15 ఏళ్లలో ఇదే మొదటిసారి. ఈ విషయాన్ని ‘ఓపెన్‌ డోర్స్‌’సోమవారం తమ నివేదికలో వెల్లడించింది. 2022–23 విద్యా సంవత్సరంలో అమెరికాలో చైనా విద్యార్థులే అధికంగా ఉండేవారు. ఆ తర్వాతి స్థానం భారతీయ విద్యార్థులది. సంవత్సరం తిరిగేకల్లా పరిస్థితి మారిపోయింది. 2023–24 విద్యా సంవత్సరంలో మొదటి స్థానంలో భారతీయ విద్యార్థులు, రెండో స్థానంలో చైనా విద్యార్థులు ఉన్నారు.  


2023–24లో అమెరికాలో 3,31,602 మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. 2022–23లో 2,68,923 మంది ఉన్నారు. విద్యార్థుల సంఖ్య ఈసారి ఏకంగా 23 శాతం పెరిగింది.  

అమెరికాలోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో భారతీయుల వాటా 29 శాతం కావడం గమనార్హం.  

ఇండియా తర్వాత చైనా, దక్షిణ కొరియా, కెనడా, తైవాన్‌ దేశాలున్నాయి.  

చైనా విద్యార్థులు 2.77 లక్షలు, దక్షిణ కొరియా విద్యార్థులు 43,149, కెనడా విద్యార్థులు 28,998, తైవాన్‌ విద్యార్థులు 23,157 మంది ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు.  

2008/2009లో అమెరికాలోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అత్యధికంగా ఉండేవారు. 15 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ పరిస్థితి పునరావృతమైంది.  

 ఒక విద్యా సంవత్సరంలో 3,31,602 మంది అమెరికాలో చదువుకుంటుండడం ఇదే మొదటిసారి.  
అంతర్జాతీయ గ్రాడ్యుయేట్‌(మాస్టర్స్, పీహెచ్‌డీ) విద్యార్థులను అమెరికాకు పంపుతున్న దేశాల జాబితాలో ఇండియా వరుసగా రెండో ఏడాది తొలిస్థానంలో నిలుస్తోంది. ఇండియన్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది 19 శాతం పెరిగి 1,96,567కు చేరుకుంది.  
ఇండియన్‌ అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థుల సంఖ్య 13 శాతం పెరిగి 36,053కు చేరింది. ఇండియన్‌ నాన్‌–డిగ్రీ విద్యార్థుల సంఖ్య 28 శాతం తగ్గిపోయి 1,426కు పరిమితమైంది.  

ఓపెన్‌ డోర్స్‌ రిపోర్టును ఇనిస్టిట్యూట్‌ 
ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌(ఐఐఈ) ప్రచురించింది. ఈ సంస్థను 1919లో స్థాపించారు. అమెరికాలోని విదేశీ విద్యార్థులపై ప్రతిఏటా సర్వే నిర్వహిస్తోంది. వారి వాస్త వ సంఖ్యను బహిర్గతం చేస్తోంది. 1972 నుంచి యూఎస్‌ డిపార్టుమెంట్‌ ఆఫ్‌ స్టేట్స్‌ బ్యూరో ఆఫ్‌ ఎడ్యుకేషన్, కల్చరల్‌ అఫైర్స్‌ కూడా సహకారం అందిస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement