Man Marries Rice Cooker: పెళ్లి కోసం అతగాడికి సంబంధాలు వెతకాల్సిన అవసరం రాలేదు. అమ్మాయి తరపున ఏడు తరాల్ని తిప్పేయలేదు. కనీసం వధువు బ్యాక్‌గ్రౌండ్ కూడా పట్టించుకోలేదు. అందంగా, అణకువగా ఉందని, తనతో ప్రేమగా ఉండడమేకాదు రోజూ వండిపెడుతోందని ఇష్టంగా పెళ్లి చేసుకున్నాడు. కానీ, నాలుగు రోజులకే ఆ పెటాకులైంది. విచిత్రమైన ఈ పెళ్లికానీ పెళ్లి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యింది.
వైట్ డ్రెస్సులో ధగధగ మెరిసిపోతూ వరుడు.. తల మీద ఓ గుడ్డ కప్పిన వధువు సంప్రదాయ పద్దతుల్లో మతపెద్దల మధ్య ఒక్కటయ్యారు. వివాహనంతరం వధువును వరుడు ముద్దాడిన ఫొటోలూ ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. వరుడు సంతోషంగా ఉన్నా.. అదేం చిత్రమే చూసేవాళ్లకే ఆ పెళ్లి కొంచెం విడ్డూరంగా, ఎబ్బెట్టుగా అనిపించింది. కారణం.. అతగాడు పెళ్లి చేసుకుంది ఓ రైస్ కుక్కర్‌ను.
నాలుగు రోజులకే పెటాకులు
మనిషిలా గోల చేయదని, పైగా రోజూ వండిపెడుతోందన్న కారణంతో ప్రేమించి మరీ ఫిలిప్స్ కంపెనీకి చెందిన ఆ రైస్‌కుక్కర్‌ను పెళ్లి చేసుకున్నాడట ఇండోనేషియాకు చెందిన అనమ్ అనే వ్యక్తి. అయితే ఎవరి కళ్లు పడ్డాయో తెలియదుగానీ.. నాలుగు రోజులకే ఆ పెళ్లి పెటాకులు అయ్యింది. కేవలం రైస్ మాత్రమే వండిపెడుతోందని, మిగతావేవీ చేయలేకపోతుందనే ఫ్రస్టేషన్‌తో నాలుగు రోజులకే విడాకులు ఇచ్చేశాడు ఆ నవ వరుడు. దీంతో పెళ్లి-విడాకుల కథ ఇంటర్నెట్ ద్వారా ఇంటర్నేషనల్ మీడియాహౌజ్‌లకు చేరుకుంది. అయితే..
అసలు విషయం ఏంటంటే.. ఇండోనేషియాకు చెందిన ఖోయిరుల్ అనమ్ సోషల్ మీడియా సెలబ్రిటీ. ఫన్నీ కంటెంట్‌ను పోస్ట్ చేయడం అతనికి ముందునుంచి అలవాటే. అందులో భాగంగానే ఇలా ‘రైస్ కుక్కర్ పెళ్లి-విడాకుల’ డ్రామా ఆడాడు. ఆ డమ్మీ పెళ్లిలో ఉంది కూడా మత పెద్దలు కారు.. అతని స్నేహితులే. సో.. ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసమే సరదాగా చేశాడు. సీరియస్‌గా తీస్కోకండి.. సుఖీభవ!
Comments
Please login to add a commentAdd a comment