అంతర్జాతీయ సంజ్ఞా భాష (సైన్ లాంగ్వేజ్) దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23న జరుపుకుంటారు. వినికిడి లోపం కలిగినవారికి సంజ్ఞా భాష అవగాహన పెంచేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే ఈ దినోత్సవం నిర్వహణ వెనుక సుదీర్ఘ చరిత్ర, ఎంతో ప్రాముఖ్యత ఉన్నాయి.
సంజ్ఞా భాష అనేది వినికిడి లోపం కలిగినవారు ఒకరితో ఒకరు సంభాషించడానికి ఉపయోగించే దృశ్య భాష. ఇది ఒక సహజ భాష, దానికి సొంత వ్యాకరణం, వాక్య నిర్మాణం, పదజాలం ఉన్నాయి. సంకేత భాషలో ప్రధానంగా చేతులు, ముఖ కవళికలు, శరీర కదలికలను ప్రదర్శిస్తారు.
సంజ్ఞా భాష ఎంతో పురాతనమైనది. మొదట్లో ఈ భాషను చులకనగా చూసేవారట. అలాగే కొన్ని చోట్ల సంకేత భాషను ఉపయోగించకుండా నిరోధించారని కూడా చెబుతారు. అయితే కాలక్రమేణా సంజ్ఞా భాష అభివృద్ధి చెందిన భాషగా గుర్తింపు పొందింది. బధిరుల హక్కుల సాధన కోసం జరిగే పోరాటంలో ఉపయుక్తమయ్యింది.
సామాన్యులలో సంజ్ఞా భాషపై అవగాహన పెంచడానికి ఈ దినోత్సవం దోహదపడుతుంది. సంజ్ఞా భాష అనేది ఒక కమ్యూనికేషన్ మాధ్యమం. దీనిని ఉపయోగించే వారి విషయంలో ఉండే వివక్షను తొలగించాలనే విషయాన్ని ఈ ప్రత్యేక దినోత్సవం గుర్తు చేస్తుంది. సంకేత భాష అనేది వక్రీకరణ కాదు, సహజమైన, అందమైన భాష అని గుర్తెరగాలని నిపుణులు చెబుతుంటారు.
సంజ్ఞా భాషలు ప్రపంచవ్యాప్తంగా విభిన్నంగా ఉంటాయి. బధిరులకు విద్య, వైద్యం, ఇతర సేవలను ఇతరులతో సమానంగా అందించేందుకు ఈ సైన్ లాంగ్వేజ్ ఉపయోగపడుతుంది. ఇతర భాషల మాదిరిగానే సంకేత భాషలు కూడా నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయి. కొత్త పదాలు, చిహ్నాలు, కొత్త ఆలోచనలు, సాంకేతికతలకు అనుగుణంగా అవి కొత్త రూపం తీసుకుంటున్నాయి. సంజ్ఞా భాష అనేది ఆలోచనలను వ్యక్తీకరించడానికి మాత్రమే కాకుండా భావోద్వేగాలను వ్యక్తీకరించడానికి కూడా ఉపయోగపడుతుంది.
ఇది కూడా చదవండి: నిద్రలో నడుస్తూ అడవిలోకి...!
Comments
Please login to add a commentAdd a comment