వాషింగ్టన్: ప్రఖ్యాత భారత్–అమెరికన్ గణిత శాస్త్రవేత్త, గణాంకశాస్త్ర(స్టాటిస్టిక్స్) నిపుణుడు కల్యంపూడి రాధాకృష్ణారావు(102)ను ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారం వరించింది. స్టాటిస్టిక్స్ రంగంలో నోబెల్ బహుమతితో సమానమైన ‘ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్’ను 2023 సంవత్సరానికి గాను రాధాకృష్ణారావుకు అందజేయనున్నట్లు ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
స్టాటిస్టిక్స్‌లో 75 ఏళ్ల క్రితం ఆయన చేసిన కృషి సైన్స్‌పై ఇప్పటికీ అమిత ప్రభావం చూపిస్తోందని ప్రశంసించింది. కెనడాలోని ఒట్టావాలో ఈ ఏడాది జూలైలో జరిగే ఇంటర్నేషనల్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ వరల్డ్ స్టాటిస్టిక్స్ కాంగ్రెస్‌లో అవార్డును ప్రదానం చేయనున్నారు.
ఈ బహుమతి కింద 80,000 డాలర్లు అందజేస్తారు. ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్‌ను ప్రతి రెండేళ్లకోసారి ప్రదానం చేస్తారు. 2017లో తొలిసారిగా ఈ అవార్డును డేవిర్ ఆర్ కాక్స్ అందుకున్నారు. 2019లో బ్రాడ్జీ ఎఫ్రాన్, 2021లో నాన్ లాయిర్డ్ స్వీకరించారు.
ఏపీలో విద్యాభ్యాసం
కల్యంపూడి రాధాకృష్ణారావు కర్ణాటకలోని హడగళిలో తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు, నూజివీడు, నందిగామ, విశాఖపట్నంలో విద్యాభ్యాసం సాగింది. ఆంధ్రా విశ్వావిద్యాలయం నుంచి గణితశాస్త్రంలో ఎంఎస్సీ చేశారు. 1943లో కలకత్తా యూనివర్సిటీ నుంచి స్టాటిస్టిక్స్‌లో ఎంఏ డిగ్రీ అందుకున్నారు.
ఇంగ్ల్లండ్‌లో కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన కింగ్స్ కాలేజీలో పీహెచ్‌డీ చేశారు. 1965లో కేంబ్రిడ్జి వర్సిటీ నుంచి డీఎస్సీ డిగ్రీ స్వీకరించారు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్, తర్వాత కేంబ్రిడ్జిలోని ఆంత్రోపాలాజికల్ మ్యూజియంలో సేవలందించారు. పలు భారత, విదేశీ వర్సిటీల్లో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1968లో పద్మభూషణ్, 2001లో పద్మవిభూషణ్ అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment