ఇంతవరకూ పాలస్తానాలోని గాజాకు మాత్రమే పరిమితమైన ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న యుధ్దం ఇప్పుడు లెబనాన్‌కూ పాకింది. ఇది తీవ్రరూపం దాల్చకుండా ఉండేందుకు అమెరికా తన ప్రయత్నాలను ప్రారంభించింది.
ఇజ్రాయెల్ ఆక్రమిత గోలన్ హైట్స్‌పై జరిగిన రాకెట్ దాడిలో 12 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పుడు ఇజ్రాయెల్- లెబనాన్ మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. దీనిని నిరోధించేందుకు యునైటెడ్ స్టేట్స్ రంగంలోకి దిగింది. ఇరాన్ మద్దతు కలిగిన హిజ్బుల్లా గ్రూపు ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడింది. ఈ నేపధ్యంలో దీనికి ప్రతీకారంగా లెబనాన్‌లోని బీరుట్ లేదా ఇతర లెబనీస్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ ప్రతీకార దాడులకు తెగబడకుండా ఉండేందుకు అమెరికా తన దౌత్యపరమైన ప్రయత్నాలను ప్రారంభించిందని రాయిటర్స్ పేర్కొంది.
అమెరికాకు చెందిన ఇద్దరు దౌత్య అధికారులు రాయిటర్స్‌తో మాట్లాడుతూ ఇజ్రాయెల్ తాజాగా లెబనాన్‌పై సైనిక చర్యకు సిద్ధమవుతోందని, ఇది బహుశా చాలా రోజుల పాటు కొనసాగవచ్చని అన్నారు. అయితే తాము ఇజ్రాయెల్‌ను పరిమిత ప్రతీకార చర్యలకు ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. లెబనాన్‌లోని బీరుట్‌తో పాటు హిజ్బుల్లా ఆధిపత్యం కలిగిన దక్షిణ శివారు ప్రాంతాలు, కీలక మౌలిక సదుపాయాలు, జనసాంద్రత కలిగిన ప్రాంతాలపై దాడులకు దిగవద్దని ఇజ్రాయెల్‌ను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నామని తెలిపారు.
లెబనాన్ విదేశాంగ మంత్రి అబ్దల్లా బౌ హబీబ్, డిప్యూటీ పార్లమెంట్ స్పీకర్ ఎలియాస్ బౌ సాబ్‌తో సహా లెబనీస్ అధికారులు యుద్ధం విషయంలో సంయమనం పాటించాలని వారు విజ్ఞప్తి చేశారు. పౌర నివాసిత ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటే ఇజ్రాయెల్ తగిన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని అమెరికా హెచ్చరించింది.
లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ పరిస్థితులను అదుపు చేసేందుకు అమెరికా, లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య దౌత్యపరమైన చర్చలకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ.. లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ ప్రమాదాన్ని తగ్గించేందుకు నడుంబిగించారు.
Comments
Please login to add a commentAdd a comment