గెలుపెవరిది..? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ వర్సెస్‌ ట్రంప్‌ | Joe Biden And Donald Trump Race On President Role | Sakshi
Sakshi News home page

గెలుపెవరిది..? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ వర్సెస్‌ ట్రంప్‌

Published Sat, Jun 15 2024 6:58 PM | Last Updated on Sat, Jun 15 2024 7:33 PM

Joe Biden And Donald Trump Race On President Role

జో బైడెన్‌. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు. డోనాల్డ్‌ ట్రంప్‌. అమెరికా మాజీ అధ్యక్షుడు. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి అధ్యక్ష పదవి కోసం తలపబడుతున్నారు. వైట్‌ హౌస్‌ రేసులో ఢీ అంటే ఢీ అంటున్నారు. జో బైడెన్‌ వృద్ధాప్యంతో ఇబ్బంది పడుతున్నారు. స్ట్రాంగ్‌ లీడర్‌ అన్న భావన కలిగించలేకపోతున్నారు. ఇక నాలుగేళ్లు ట్రంప్‌ పాలన ఎలా సాగిందో ప్రపంచమంతా చూసింది. డెమోక్రాట్స్‌ బైడెన్‌కి, రిపబ్లికన్స్‌ ట్రంప్‌కి జై కొట్టేశారు. ఇంత వరకు బానే ఉంది. కానీ...గత అధ్యక్షులతో పోల్చితే...సమర్థ నాయకత్వం అందించే భరోసాని వీరిద్దరూ అమెరికాకి ఇవ్వగలరా అన్న ప్రశ్న మాత్రం సజీవంగానే ఉంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే...కేవలం ఆ దేశంలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా అందరి అటెన్షన్‌ అటే ఉంటుంది. ఇప్పుడు కూడా అక్కడి ఎన్నికల కేంద్రంగా జరగుతోంది అదే. కాకపోతే ఆ అటెన్షన్‌ కేవలం ఎన్నికల సమరం మీద మాత్రమే కాదు. బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల నాయకత్వ లక్షణాల కేంద్రంగా, ఇద్దరు అభ్యర్థులను చుట్టుముట్టిన వివాదాల కేంద్రంగా..వరల్డ్‌ వైడ్‌గా చర్చ సాగుతోంది.

నిజానికి జో బైడెన్‌, డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా ప్రజలకి కొత్త కాదు. ప్రపంచ ప్రజలకు కొత్త కాదు. ఇద్దరి పాలనని అమెరికన్స్‌తో పాటు ప్రపంచ ప్రజలంతా చూశారు.అదే సమయంలో ఇద్దరు ఎదుర్కొంటోన్న అనేక సమస్యలను కూడా వరల్డ్‌ అంతా చూస్తోంది. వృద్ధాప్యం వల్ల వచ్చే అనేక ఆరోగ్య సమస్యలు...జో బైడెన్‌ నాయకత్వాన్ని సవాల్‌ చేస్తోంది. అలానే కుమారుడి మీద కేసులు కూడా ఆయన్ను ఇరుకున పెడుతున్నాయి. ఇక ట్రంప్‌ సంగతి సరే. ఇద్దరు అభ్యర్థులు వివాదాల కేంద్రంగానే తమ ఉనికిని చాటుకుంటున్నారు.

అమెరికా రాజకీయాల్లో వృద్ధులు పదవులు చేపట్టడంపై చాలా కాలం నుంచి చర్చ సాగుతోంది. అమెరికా పౌరుల పదవీ విరమణ వయస్సు 67 ఏళ్లు. కానీ రాజకీయాల్లో రిటైర్మెంట్‌ వయసంటూ లేదు. బైడెన్‌ వయస్సు 81. ట్రంప్‌ వయస్సు 78. ఆ వయస్సు అమెరికాకి నాయకత్వం వహించే స్థాయిలో శారీరిక, మానసిక ఆరోగ్యం సహకరిస్తుందా అన్న చర్చ ఒకవైపు సాగుతోంది. మరోవైపు బైడన్‌ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక సార్లు ఆయన వయస్సు కేంద్రంగా చర్చ సాగుతూ వచ్చింది. తాజాగా జీ-7 దేశాల సదస్సులో బైడెన్‌ వింతగా ప్రవర్తించడంతో...మరోసారి ఈ చర్చ తెరపైకి వచ్చింది.

అది.. ఇటలీ తీరప్రాంత నగరం అపూలియా. జీ7 సదస్సు ఆరంభం కావడానికి ముందు అపూలియా తీర ప్రాంతాన్ని ఆయా దేశాల నేతలు సందర్శించారు. అక్కడ ఉన్న వాటర్ స్పోర్ట్స్‌ను వీక్షించారు. పారా గైడ్లింగ్‌ చేస్తున్న వారిని పలకరించారు. కానీ.. అదే సమయంలో జో బైడెన్ మాత్రం వింతగా ప్రవర్తించారు. తీర ప్రాంతం వద్ద రిషి సునాక్, జస్టిన్ ట్రూడో, మెలోనీ, ఉర్సులా వాన్ డెర్.. ఒకవైపు ఉండి వాటర్ స్పోర్ట్స్‌ను తిలకిస్తుండగా.. జో బైడెన్ మాత్రం వారికి దూరంగా వెళ్లి దిక్కులు చూస్తూ నిలబడిపోయారు. అక్కడ ఎవరూ లేకపోయినా ఎవరితోనో ఆయన మాట్లాడుతున్నట్టు సైగలు చేశారు. కుడి చెయ్యి పైకి ఎత్తి పలకరించడం కనిపించింది. ఈ సమయంలో బైడెన్‌ను గమనించిన మెలోని ఆయన దగ్గరకు వెళ్లి చెయ్యి పట్టుకుని వెనక్కి తీసుకువచ్చారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అయితే.. బైడెన్‌ ఇలా వింతగా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు పలు సందర్భాల్లో కూడా ఆయన ఇలాగే చేశారు. అమెరికాకు సంబంధించి చిప్స్ అండ్ సైన్స్ చట్టంపై సంతకం చేసే కార్యక్రమంలో సెనేట్‌ మెజార్టీ లీడన్‌ చక్‌ షూమర్‌ అందరికీ షేక్‌ హ్యాండ్‌ ఇచ్చారు. పొడియం వద్దకు వచ్చిరాగానే ముందుగా బైడెన్‌కు షేక్‌హ్యాండ్‌ ఇచ్చి, ఆ తర్వాత అక్కడే ఉన్న మిగితా వారికి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చారు. అప్పటికి తను షేక్‌హ్యాండ్ ఇచ్చిన విషయం మర్చిపోయిన బైడెన్.. మరోసారి షేక్ హ్యాండ్ కోసం చేతిని ముందుకు తీసుకెళ్లారు. కాసేపు అలాగే షేక్‌ హ్యాండ్‌ పొజిషన్‌లో ఉంచి షాక్‌తో మళ్లి చేతిని కిందకు దించాడు బైడెన్‌.

కొన్నాళ్ల క్రితం వైట్‌హౌస్‌లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో అధ్యక్షుడి ప్రవర్తన ఇలాగే ఉంది. ఆయన చుట్టూ ఉన్నవారంతా అక్కడ వినిపిస్తున్న సంగీతానికి తగ్గట్టుగా కాలుకదుపుతుంటే.. బైడెన్ మాత్రం కొంతసేపు అలాగే నిల్చుండి పోయారు. ఏం జరుగుతుందో అర్ధం కానట్లు చూస్తుండిపోయారు. కొన్ని సెకన్లపాటు అలాగే ఉండిపోయిన బైడెన్‌ ఆ తర్వాత తేరుకున్నారు.

ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలోనూ బైడెన్‌ దొరికిపోయారు. మీడియాతో మాట్లాడే క్రమంలో రష్యా దేశం, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ పేరు సైతం మర్చిపోయారు.  తనతోపాటు పక్కనే ఉన్న అమెరికా ఉపాధ్యక్షురాలను ప్రథమ మహిళ అని సంబోధించి చాలా గందరగోళానికి గురయ్యారు. ఇప్పుడు బైడెన్‌ తీరు అధికార డెమొక్రాటిక్‌ పార్టీకి ఇబ్బందిగా మారింది. ఇప్పటికే బైడెన్‌ ప్రవర్తనని...రిపబ్లికన్‌ పార్టీ పదే పదే ప్రస్తావిస్తోంది. ఇకపై ప్రచారంలో దీన్ని ఒక కీలక అస్త్రంగా మార్చుకోవచ్చు అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో బైడెన్‌ కుమారుడు హంటర్‌ బైడెన్‌ని...

గన్‌ కొనుకోలు కేసులో మొత్తం మూడు ఆరోపణల్లోనూ కోర్టు దోషిగా తేల్చింది. అటు ట్రంప్‌ మీద ఉన్న ఆరోపణల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆరోపణలు మాత్రమే కాదు. హష్‌ మనీ కేసులో ఆయన దోషిగా తేలారు. త్వరలోనే శిక్ష ఏంటన్నది న్యాయస్థానం ప్రకటించనుంది. ట్రంప్‌ వయస్సు కూడా 78 ఏళ్లు కావడంతో...వృద్ధాప్యం కోణంలో ఆయన నాయకత్వం మీదా చర్చ జరుగుతోంది. ఇలా అధ్యక్ష పదవి రేసులో ఉన్న ఇద్దరూ సమర్థ నాయకత్వం అందించగలరా అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్‌ పాయింట్‌గా మారింది.

క్రిమినల్‌ కేసులో దోషిగా తేలిన కుమారుడిని కలిగి ఉన్న తొలి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌. క్రిమినల్‌ కేసులో దోషిగా తేలిన తొలి అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌. వైట్‌ హౌస్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి... తన ప్రవర్తనతో చర్చనీయాంశంగా మారిన అధ్యక్షుడు బైడెన్‌. అమెరికాలో చరిత్రలోనే అత్యంత వివాదాస్పద అధ్యక్షుడుగా ట్రంప్‌కి అద్భుతమైన రికార్డు ఉండనే ఉంది. ఇప్పుడు ఇద్దరి వయస్సు కేంద్రంగా కూడా వాడి వేడి చర్చ సాగుతోంది. ఇలా అనేక కోణాల్లో బైడెన్‌, ట్రంప్‌ మధ్య నెగిటివ్‌ వైబ్రేషన్స్‌ బలంగా హల్‌చల్‌ చేస్తున్నాయి. అదే సమయంలో ఇద్దరి మధ్య వాడి వేడి సమరం తప్పదని ఎన్నికల సాగుతోన్న తీరు చెప్పకనే చెబుతోంది. 

అమెరికా అధ్యక్ష రేసులో బైడెన్‌ కన్నా ట్రంప్‌ ముందున్నారు. ట్రంప్‌ ట్రాక్‌ రికార్డ్‌ అంతా వివాదాలు, ఆరోపణల మయమే. అయినా సరే...ప్రచారంలో ట్రంప్‌ దూకుడుని బైడెన్‌ అందుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్‌కి మరో సమస్య వచ్చి పడింది. ఆయన కుమారుడు హంటర్‌ బైడెన్‌...క్రిమినల్‌ కేసులో దోషిగా తేలడంతో...బైడెన్‌ కేంద్రంగా నెగిటివిటీ పెరుగుతోంది. తుపాకీ కొనుగోలు సందర్భంగా తప్పుడు సమాచారం ఇచ్చిన కేసులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కుమారుడు హంటర్‌ బైడెన్‌ దోషిగా తేలారు. ఆయనపై మోపిన 3 అభియోగాల్లోనూ నేర నిర్ధారణ జరిగింది. డెలావెర్‌లోని విల్మింగ్టన్‌ కోర్టు జడ్జి మేరీఎల్లెన్‌ నోరీకా... హంటర్‌ నేరాన్ని నిర్ధారించారు. అయితే శిక్షా కాలాన్ని వెల్లడించలేదు. కానీ ఈ తరహా కేసుల్లో 25 ఏళ్ల వరకూ శిక్ష పడుతుంది. అదే సమయంలో తొలిసారి నేరానికి పాల్పడినందు వల్ల అంత శిక్ష పడక పోవచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది. నేరాన్ని నిర్ధారించిన జడ్జి.. ఎంత కాలం శిక్ష వేయనున్నారనేది వెల్లడించలేదు. ఎప్పటి నుంచి శిక్షను అమలు చేసేదీ చెప్పలేదు. 

2018లో తుపాకీ కొనుగోలు సందర్భంగా ఆయుధ డీలరుకు ఇచ్చిన దరఖాస్తు ఫారంలో హంటర్‌ తప్పుడు సమాచారం ఇచ్చారు. తాను అక్రమంగా డ్రగ్స్‌ కొనుగోలు చేయలేదని, వాటికి బానిస కాలేదని, తనవద్ద అక్రమంగా ఆయుధం లేదని వెల్లడించారు. అయితే అది తప్పని తేలింది. అప్పటికే హంటర్‌ డ్రగ్స్‌ అక్రమంగా కొనుగోలు చేశారు. వాటికి బానిసగా మారారు. 11 రోజులపాటు అక్రమంగా ఆయుధం కలిగి ఉన్నారు. హంటర్‌పై మరో కేసు ఉంది. కాలిఫోర్నియాలో 1.4 మిలియన్‌ డాలర్ల పన్ను ఎగవేత కేసులో ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు. కాలిఫోర్నియా కోర్టులో సెప్టెంబరులో ఇది విచారణకు రానుంది.

బైడెన్‌ కుమారుడు హంటర్‌ బైడెన్‌ క్రిమినల్‌ కేసులో దోషిగా తేలడానికి కొద్ది రోజుల ముందే...డోనాల్డ్‌ ట్రంప్‌ని హష్‌ మనీ కేసులో దోషిగా తేల్చింది మన్‌హట్టన్‌ కోర్టు. శృంగార తార స్టార్మీ డానియల్స్‌తో ట్రంప్‌ గతంలో ఏకాంతంగా గడిపారనే ఆరోపణలు ఉన్నాయి. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో దీనిపై ఆమె నోరు విప్పకుండా ఉండేందుకు... ట్రంప్‌ తన న్యాయవాది ద్వారా ఆమెకు 1.30 లక్షల డాలర్ల హష్‌మనీని ఇప్పించారన్నది ఆరోపణ. ప్రచార కార్యక్రమాల కోసం అందిన విరాళాల నుంచి ఆ మొత్తాన్ని ఖర్చు చేశార ని, అందుకోసం రికార్డులన్నింటినీ తారుమారు చేశారన్నది ప్రధాన అభియోగం. ఇలా మొత్తం 34 అంశాల్లో ఆయనపై నేరారోపణలు నమోదయ్యాయి. ఆరు వారాల విచారణ అనంతరం ట్రంప్‌పై మోపిన అభియోగాలన్నీ నిజమేనని 12 మంది జడ్జీలతో కూడిన ధర్మాసనం ఏకాభిప్రాయంతో తీర్పు వెలువరించింది. ట్రంప్‌తో ఏకాంతంగా గడిపిన మాట వాస్తవమేనని స్టార్మీ డానియల్స్‌ స్వయంగా కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఆమెతో సహా మొత్తం 22 మంది సాక్షులను కోర్టు విచారించింది.

45 ఏళ్ళ డేనియల్స్ అసలు పేరు స్టెఫానీ క్లిఫర్డ్. ఆమె లూసియనాలో జన్మించారు. శృంగార చిత్రాల నటి, దర్శకురాలు డేనియల్స్. సినీ రంగంలో ఆమె ప్రతిభకు గాను అనేక అవార్డులు గెలుచుకున్నారు. 2006 జులై లో ఒక చారిటీ గోల్ఫ్‌ ట్రోర్నమెంట్‌లో ట్రంప్‌ని ఒక చారిటీ గోల్ఫ్‌ టోర్నమెంట్‌లో కలిసినట్టుగా డేనియల్స్‌ చెబుతున్నారు. లేక్ తాహో వద్ద నున్న హోటల్ గదిలో తాము ఇద్దరం పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొనట్టు ఆమె తెలిపారు.

2016 ఎన్నికల ముందు...ట్రంప్‌ లాయర్‌ కోహెన్‌...తనకు హష్‌ మనీ కింద ఒక లక్షా 30 వేల డాలర్లు ఇచ్చినట్టు డేనియర్స్‌ తెలిపారు. అమెరికాలో రహస్య ఒప్పందం కింద ఒకరికి నష్టపరిహారం చెల్లించడం చట్టవిరుద్ధం కాదు. కానీ ట్రంప్ ఖాతాల్లో ఈ చెల్లింపులను లీగల్ ఫీజులుగా పేర్కొనడం ద్వారా వ్యాపార రికార్డులను తారుమారు చేశారని ట్రంప్ పై అభియోగాలు నమోదయ్యాయి. హానికారక సమాచారం ప్రజలకు తెలియకుండా ఉండేందుకు నేరాలను కప్పిపుచ్చేందుకు ట్రంప్ ప్రయత్నించారని... డిస్ట్రిక్ట్ అటార్నీ అల్విన్ బ్రాగ్ ఆరోపించారు. 2018 ఆగస్టులో పన్నుల ఎగవేత, డేనియల్స్‌కు చెల్లింపుల విషయంలో ప్రచార ఆర్థిక నిబంధనలను అతిక్రమించిన కేసులో దోషిగా తేలడంతో... ట్రంప్ మాజీ లాయర్ కోహెన్ జైలు పాలయ్యారు. అయితే ఈ చెల్లింపులతో ట్రంప్‌కు ఎలాంటి సంబంధం లేదని తొలుత కోహెన్ చెప్పారు. కానీ తరువాత ట్రంపే 1,30,000 డాలర్ల హుష్ చెల్లింపులు చేయాల్సిందిగా ఆదేశించారని అంగీకరించారు. ఈ డబ్బును ట్రంప్ లెక్కల్లో ఎలాగోలా సెట్ చేశారని కూడా చెప్పారు.

దోషిగా తేలడంతో ట్రంప్‌ జైలుకెళ్లాల్సిందేనా అనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. దీనికి కచ్చితమైన సమాధానం చెప్పలే మని నిపుణులు అంటున్నారు. బిజినెస్‌ రికార్డులు తారుమారు అనేది న్యూయార్క్‌లో తక్కువ తీవ్రత ఉన్న నేరంగా పరిగణిస్తారు. గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. దీనిపై పూర్తి విచక్షణాధికారం న్యాయమూర్తిదే. అయితే, కచ్చితంగా జైలు శిక్ష విధిస్తారా, జరిమానాతో సరిపుచ్చుతారా అనేది చెప్పలేమని న్యాయ నిపుణులు వెల్లడించారు. ఇంత కంటే తీవ్రమైన మరో మూడు కేసుల్లోనూ ట్రంప్‌ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అవేవీ ఎన్నికల ముందు విచారణకు వచ్చే అవకాశం లేదని ట్రంప్‌ న్యాయవాదుల బృందం ధీమాగా ఉంది. మరోవైపు రిపబ్లికన్‌ పార్టీ ఈ విషయంలో ట్రంప్‌కి గట్టిగానే మద్దతు తెలుపుతోంది.

ట్రంప్‌ మద్దతుదారులు ఈ కేసును బైడెన్‌ రాజకీయ కుట్ర అంటారు, ట్రంప్‌ వ్యతిరేకులు ఆయనకు శిక్షపడినందుకు సంతోషిస్తారు. రాజకీయాన్ని అటుంచితే, మరోసారి దేశాధ్యక్షుడు కావాలనుకుంటున్న ఓ మాజీ అధ్యక్షుడు ఇలా వరుస కేసులు ఎదుర్కోవడం, నేరస్థుడిగా ముద్రపడటం అమెరికా పరువు ప్రతిష్ఠలకు భంగకరమే అంటున్నారు పరిశీలకులు. అయితే...ఈ తరహా వివాదాలు, కేసులు, ట్రంప్‌కి కొత్త కాదు. ట్రంప్‌ని ఈ కోణంలో చూడటం అమెరికన్స్‌కి కొత్త కాదు. దీంతో...కోర్టు విధించే శిక్ష ఏంటి ? ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో అటు బైడెన్‌ కుమారుడు క్రిమినల్‌ కేసులో దోషిగా తేలడంతో...బైడెన్‌ మీద ఆప్రభావం ఎంత వరకు పడుతుందన్నది చర్చనీయాంశంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement