NATO Summit: బైడెన్‌.. మళ్లీ తడబడెన్‌! | Joe Biden slip-ups at NATO Summit | Sakshi
Sakshi News home page

NATO Summit: బైడెన్‌.. మళ్లీ తడబడెన్‌!

Published Sat, Jul 13 2024 5:21 AM | Last Updated on Sat, Jul 13 2024 5:21 AM

Joe Biden slip-ups at NATO Summit

‘అమెరికా ఉపాధ్యక్షుడు ట్రంప్‌’ 

‘ఉక్రెయిన్‌ అధ్యక్షుడు పుతిన్‌’  

మీడియా సమావేశంలో నోరుజారిన బైడెన్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పట్టువీడటం లేదు. అధ్యక్ష బరి నుంచి తప్పుకోవాలంటూ ఇంటా బయటా డిమాండ్లు నానాటికీ పెరిగిపోతున్నా ఆ ప్రసక్తే లేదని మరోసారి కుండబద్ధ్దలు కొట్టారు. 81 ఏళ్ల వయసులోనూ రిపబ్లికన్‌ ప్రత్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ను ఓడించి మరోసారి అధ్యక్షునిగా పని చేసే సామర్థ్యం తనలో పుష్కలంగా ఉందని చెప్పుకొచ్చారు. 

నాటో శిఖరాగ్రం ముగింపు సందర్భంగా గురువారం బైడెన్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. తన వయసు, ఫిట్‌నెస్‌పై పెరిగిపోతున్న సందేహాల్లో పస లేదని నిరూపించేందుకు శాయశక్తులా ప్రయతి్నంచారు. అయితే గంటకు పైగా జరిగిన ఈ భేటీలోనూ ఆయన తడబాట్ల పర్వం కొనసాగడం డెమొక్రాట్ల శిబిరంలో ఆందోళనలను మరింత పెంచింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ అనబోయి ట్రంప్‌ అంటూ బైడెన్‌ తికమకపడ్డారు! 

అధ్యక్ష రేసు నుంచి మీరు తప్పుకుంటే ట్రంప్‌ను ఓడించే సత్తా హారిస్‌కు ఉందా అని విలేకరులు ప్రశ్నించగా, ‘‘అధ్యక్షునిగా పని చేయగల అర్హత, సత్తా ట్రంప్‌కు ఉన్నాయి. కనుకనే ఉపాధ్యక్షునిగా ఎన్నుకున్నా’’ అన్నారు. దాంతో అంతా అవాక్కయ్యారు. అయినా బైడెన్‌ తన వ్యాఖ్యలను సరిచేసుకోలేదు. అంతకుముందు నాటో వేదికపై కూడా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని సభ్య దేశాల ప్రతినిధులకు ‘అధ్యక్షుడు పుతిన్‌’ అంటూ పరిచయం చేశారు!! 

జెలెన్‌స్కీ దీన్ని తేలిగ్గా తీసుకుంటూ నవ్వేసినా ప్రతినిధులంతా తెల్లబోయారు. ఈ నేపథ్యంలో బైడెన్‌ మానసిక ఆరోగ్యంపై నెలకొన్న సందేహాలు మరింత పెరిగాయి. అయితే వైద్యులు సూచిస్తే మానసిక పరీక్షలకు సిద్ధమని ఆయన ప్రకటించారు. 

‘‘అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఇప్పటిదాకా మూడుసార్లు న్యూరో పరీక్షలు చేయించుకున్నా. తాజా పరీక్ష గత ఫ్రిబ్రవరిలో జరిగింది. నేను మానసికంగా ఫిట్‌గా ఉన్నాననేందుకు అధ్యక్షునిగా నేను తీసుకుంటున్న రోజువారీ నిర్ణయాలే రుజువు. కానీ నేనెంత చేసినా ఎవరూ సంతృప్తి చెందడం లేదు’’ అంటూ వాపోయారు! అయితే తన అభ్యర్థిత్వంపై సొంత పార్టీ నేతల్లో భయాలను దూరం చేయాల్సిన అవసరముందని అంగీకరించారు. 

బ్రహా్మండంగా పని చేశా 
అధ్యక్ష ఎన్నికల్లో తలపడేందుకు అత్యంత అర్హున్ని తానేనని బైడెన్‌ చెప్పుకున్నారు. ‘‘ట్రంప్‌ను ఓసారి ఓడించా. మళ్లీ ఓడించి తీరతా. అప్పుడే ఏమీ అయిపోలేదు. ప్రచారంలో ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది’’ అన్నారు. నాలుగేళ్లలో అమెరికాను అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చేశానంటూ గణాంకాలు ఏకరువు పెట్టారు. ఆర్థిక రంగంలో తన పనితీరు చాలా బాగుందని ఏకంగా 16 మంది నోబెల్‌ గ్రహీతలైన ఆర్థికవేత్తలు కితాబిచ్చారని చెప్పుకున్నారు. 

రాత్రి 8 గంటల తర్వాత ప్రచారంతో పాటు ఎలాంటి కార్యక్రమాలూ పెట్టుకునేది లేదని తానన్నట్టు వచి్చన వార్తలను బైడెన్‌ ఖండించారు. విదేశీ వ్యవహారాలు తదితరాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. గాజా ఆక్రమణ కూడదంటూ  ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు నెతన్యాహూను, ఉక్రెయిన్‌పై యుద్ధంలో మద్దతివ్వొద్దంటూ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను హెచ్చరించానని చెప్పుకొచ్చారు. రష్యాతో సాన్నిహిత్యానికి చైనా మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. లాడెన్‌ను చంపగానే అఫ్గాన్‌ నుంచి అమెరికా పూర్తిగా వైదొలగాల్సిందన్నారు.

ట్రంప్‌ విసుర్లు 
బైడెన్‌ తనను ఉపాధ్యక్షునిగా పేర్కొనడంపై ట్రంప్‌ వ్యంగ్యా్రస్తాలు విసిరారు. ‘బిగ్‌ బోయ్‌ జో మీడియా భేటీ మొదట్లోనే నన్ను తన ఉపాధ్యక్షునిగా చెప్పుకు న్నారు’’ అని ఎద్దేవా చేస్తూ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

పెరుగుతున్న వ్యతిరేకత 
తనకు వ్యతిరేకంగా గళమెత్తుతున్న సొంత పార్టీ నేతలు, ఎంపీల విశ్వాసాన్ని చూరగొనడమే లక్ష్యంగా తాజా మీడియా సమావేశంలో బైడెన్‌ సర్వశక్తులూ ఒడ్డారు. కానీ ఆ ప్రయత్నంలో ఆయన విఫలమయ్యారని పరిశీలకులు అంటున్నారు. బైడెన్‌ తప్పుకోవాలని సమావేశం ముగియగానే ముగ్గురు ప్రముఖ డెమొక్రాట్‌ ఎంపీలు జిమ్‌ హైమ్స్, స్కాట్‌ పీటర్స్, ఎరిక్‌ సొరెన్సన్‌ పిలుపునిచ్చారు! దాంతో ఆయన వైదొలగాలని డిమాండ్‌ చేస్తున్న సొంత పార్టీ ఎంపీల సంఖ్య 17కు పెరిగింది. 

నిజానికి గత నెల సీఎన్‌ఎన్‌ చానల్లో జరిగిన తొలి అధ్యక్ష డిబేట్‌లో ట్రంప్‌ ముందు బైడెన్‌ పూర్తిగా తేలిపోవడం తెలిసిందే. దానితో పోలిస్తే తాజా మీడియా భేటీలో ఆయన మెరుగ్గానే మాట్లాడారు. తాను తీరిక లేని షెడ్యూల్‌తో బిజీగా గడుపుతుంటే ట్రంప్‌ మాత్రం గోల్ఫ్‌ ఆడుతూ సేదదీరుతున్నారంటూ దుయ్యబట్టారు. ‘‘ట్రంప్‌ నాలుగేళ్ల పాలనలో అస్తవ్యస్తం చేసిననాటో కూటమిని  ఎంతగానో శ్రమించి ఒక్కతాటిపైకి తెచ్చా. నాటో శిఖరాగ్రంలో పాల్గొన్న దేశాధినేతలెవరూ నా ఫిట్‌నెస్‌ను, మానసిక ఆరోగ్యాన్ని సందేహించలేదు. పైపెచ్చు ట్రంప్‌ మళ్లీ రావొద్దని, నేనే గెలవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు’’ అని అన్నారు.

ఒబామా, పెలోసీ కూడా... 
బైడెన్‌ తప్పుకోవాలంటున్న డెమొక్రాటిక్‌ పార్టీ నేతల జాబితాలో మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, ప్రతినిధుల సభ మాజీ స్పీకర్‌ నాన్సీ పెలోసీ కూడా చేరుతున్న సూచనలు కని్పస్తున్నాయి. ట్రంప్‌ను ఓడించడం బైడెన్‌కు తలకు మించిన పనేనని వారిద్దరూ తాజాగా ప్రైవేటు సంభాషణలో అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. నాటో శిఖరాగ్రం అనంతరం బైడెన్‌ మీడియా సమావేశం చూసి వారు మరింతగా పెదవి విరిచినట్టు డెమొక్రటిక్‌ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 ‘‘బైడెన్‌ అధ్యక్ష అభ్యరి్థత్వం దాదాపుగా ముగిసిన కథే. ఆయనకు మనస్తాపం కలగకుండా, పార్టీ అవకాశాలు దెబ్బ తినకుండా దీన్ని ప్రకటించడం ఎలాగన్నది మాత్రమే తేలాల్సిలి ఉంది. బహుశా బైడెన్‌ తనంత తానుగా తప్పుకుంటారని ఒబామా, పెలోసీ భావిస్తున్నారు. లేదంటే ఆయనకు నచ్చజెప్పి తప్పించే బాధ్యత తీసుకోగలిగింది వారిద్దరే’’ అని పేర్కొంటున్నాయి. 

ఈ విషయమై ఉన్నత స్థాయి డెమొక్రాట్‌ నేతలు గురువారం ఉదయం పెలోసీతో సమావేశమైనట్టు అమెరికా మీడియా పేర్కొంది. ‘‘ఇక ట్రంప్‌ను ఓడించడం బైడెన్‌కు శక్తికి మించిన పనేనన్న అభిప్రాయంతో పెలోసీ కూడా ఏకీభవించారు. అయితే నాటో శిఖరాగ్రం జరుగుతున్న నేపథ్యంలో దేశాధినేతల ముందు బైడెన్‌ను ఇబ్బంది పెట్టడం సరికాదని, కనీసం ఒక రోజన్నా ఆగాలని సూచించారు. దాంతో బైడెన్‌ను తప్పించేందుకు ఆమె కూడా సుముఖంగానే ఉన్నట్టు తేలిపోయింది. అందుకే భేటీ తర్వాత పలువురు డెమొక్రాట్‌ ఎంపీలు బైడెన్‌ తప్పుకోవాలని బాహాటంగా డిమాండ్‌ చేశారు’’ అంటూ యూఎస్‌ మీడియాలో జోరుగా కథనాలు వెలువడుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement