![Joe Biden and Kamala Harris named Time Person of the Year - Sakshi](/styles/webp/s3/article_images/2020/12/12/bie.jpg.webp?itok=P2Fw--FW)
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన కమలా హ్యారిస్‌లు టైమ్ మ్యాగజైన్ ఈ ఏటి మేటి వ్యక్తులుగా నిలిచారు. ప్రతీ ఏడాది టైమ్ మ్యాగజైన్ ప్రతిష్టాత్మకంగా ఎంపిక చేసే ‘‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’’లో 2020లో బైడెన్, హ్యారిస్ నిలిచారు. వారిద్దరూ విభజన శక్తుల కంటే సానుభూతి గొప్పదని నిరూపించారని, అమెరికా కథనే మార్చారని టైమ్ మ్యాగజైన్ తన తాజా సంచికలో వారిని కొనియాడింది. ప్రపంచం యావత్తూ ఒక మహమ్మారి చేతిలో చిక్కుకొని విలవిలలాడుతూ ఉంటే దానికి మందు ఎలా వెయ్యాలో దృష్టి పెట్టారని పేర్కొంది.
ఈ ఏడాది పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా తుది జాబితాలో ఫ్రంట్ లైన్ వర్కర్లు, అమెరికా జాతీయ అంటువ్యాధుల సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆంటోనీ ఫౌచి, జాతి వివక్ష పోరాట సంస్థలు, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిలిచారు. వీరందరూ ఇచ్చిన పోటీని తట్టుకొని జో బైడెన్, కమలా హ్యారిస్‌లు ముందుకు దూసుకెళ్లి టైమ్ ముఖచిత్రానికెక్కారు. గత ఏడాది టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైన స్వీడన్ పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్‌బర్గ్ 16 ఏళ్లకే ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టిస్తే, ఈ ఏడాది జో బైడెన్ 78 ఏళ్ల వయసులో అత్యంత పెద్ద వయస్కుడిగా నిలిచారు. టైమ్ మ్యాగజైన్ హీరోస్ ఆఫ్ 2020 జాబితాలో ఇండియన్ అమెరికన్ రాహుల్ దుబేకి చోటు లభించింది. జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు వ్యతిరేకంగా ప్రదర్శనల్లో పాల్గొన్న 70 మందికి పైగా నిరసనకారులకి రాహుల్ తన ఇంట్లో ఆశ్రయం కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment