వాషింగ్టన్: రష్యా- ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక‍్రెయిన్ సరిహద్దుల్లో రష్యా బలగాలను మోహరించి సైనిక విన్యాసాలు చేస్తోంది. ఈ క్రమంలో రష్యా వ్యవహార శైలిపై ప్రపంచ దేశాలు ఆందోళనతో పాటుగా ఆగ్రహం సైతం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అగ్ర రాజ్యం అమెరికా.. రష్యాను హెచ్చరిస్తూ ఆర్థిక ఆంక్షలు విధించింది. మంగళవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శ్వేతసౌథంలో జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా రష్యాను కబ్జాదారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి నుంచి రష్యా చర్యకు ప్రతి చర్య ఉంటుందని హెచ్చరించారు. రష్యాకు చెందిన రెండు అతిపెద్ద ఆర్థిక సంస్థలు వెబ్, సైనిక బ్యాంకుపై ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నట్టు బైడెన్ తెలిపారు.
రష్యాలోని ప్రముఖులపై కూడా ఆంక్షలు విధిస్తాం. నార్డ్ స్ట్రీమ్ 2 పైపులైన్ ప్రాజెక్టును వెంటనే నిలిపివేసేందుకు జర్మనికి సహకరిస్తామని వెల్లడించారు. పశ్చిమ దేశాలతో రష్యాకు ఉన్న వ్యాపార, వాణిజ్య సంబంధాలను కూడా నిలిపివేస్తున్నట్టు పేర్కొన్నారు. ఉక్రెయిన్లోని భూభాగాలను స్వాధీనం చేసుకునేందుకు పుతిన్ ప్రయత్నిస్తున్నాడని బైడెన్ మండిపడ్డారు. రష్యా అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా.. జెనీవా వేదికగా రష్యా విదేశాంగ మంత్రితో జరుగనున్న సమావేశాన్ని రద్దు చేస్తున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ తెలిపారు. ఉక్రెయిన్-రష్యా ఉద్రిక్తతల నేపథ్యంలో దౌత్యపరమైన అంశాలను రష్యా సీరియస్‌గా తీసుకోవడంలేదని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య చర్చలను రద్దు చేస్తున్నట్టు బ్లింకెన్ పేర్కొన్నారు.
(ఇది చదవండి: ఉక్రెయిన్‌లో టెన్షన్.. భారతీయులకు కీలక సూచనలు చేసిన ప్రభుత్వం)
Comments
Please login to add a commentAdd a comment