వాషింగ్టన్: మాజీ అధ్యక్షుడు తెచ్చిన హెచ్1బీ వీసా నిషేధాన్ని కొనసాగించకూడదని ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ భావిస్తున్నారు. ఈ క్రమంలో ట్రంప్ తెచ్చిన నిషేధ కాలవ్యవధి బుధవారం ముగుస్తుండగా, దీన్ని పొడిగించకూడదని బైడెన్ భావించినట్లు తెలిసింది. ఈ నిషేధం కారణంగా పలు టెక్ కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. తాజాగా నిషేధం తొలగిపోవడం, నిషేధాన్ని బైడెన్ వద్దనుకోవడం.. టెక్ కంపెనీలకు మంచిదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
అయితే ఈ విషయమై ఇంకా వైట్‌హౌస్ అధికారిక ప్రకటన చేయలేదు. కొందరు అధికారులు మాత్రం నిషేధాన్ని వెంటనే ఎత్తివేస్తే అమెరికా కంపెనీలకు మంచిది కాదని, అందువల్ల నెమ్మదిగా తొలగించాలని భావిస్తున్నారు. కరోనా కారణంగా కొత్త గ్రీన్ కార్డులు జారీ చేయకూడదన్న ట్రంప్ నిర్ణయాన్ని బైడెన్ రద్దుచేయడం తెల్సిందే. ఈ నిర్ణయాలు అమెరికాకు, ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలమని బైడెన్ వ్యాఖ్యానించారు. వీసాపై నిషేధాన్ని అమెరికాలో లేబర్ యూనియన్లు స్వాగతించాయి.
హెచ్1బీ ప్రాథమిక ఈ–రిజిస్ట్రేషన్ ఎంపిక పూర్తి
రాబోయే ఆర్థిక సంవత్సరానికి హెచ్1బీ విదేశీ వర్కర్ వీసాల పరిమితి పూర్తయినట్లు అమెరికా ప్రకటించింది. ఇందుకు సంబంధించి ప్రాథమిక రిజిస్ట్రేషన్ íపీరియడ్‌లో సరిపడ్డా ఈ– అప్లికేషన్లు వచ్చాయని, 2022 ఆర్థిక సంవత్సరానికి హెచ్1బీ వీసాలకు సంబంధించి ప్రాథమిక ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ఎంపిక ప్రక్రియను పూర్తి చేశామని తెలిపింది.
అమెరికాలో ఉద్యోగానికి వెళ్లే భారతీయ ఐటీ నిపుణులకు ఈ వీసాలు ఎంతో కీలకం. ఈ వీసాల కోసం సరైన ఆధారాలతో సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి లాటరీ విధానం ద్వారా ఎంపిక చేస్తామని అమెరికా పౌరసత్వం మరియు వలసదారుల సేవా కేంద్రం (యూఎస్‌సీఐఎస్) పేర్కొంది. అమెరికా కంపెనీల్లో పనిచేయాలంటే విదేశీ వృత్తి నిపుణులకు హెచ్1బీ వీసాలు తప్పనిసరి. వీటికి కేవలం భారత్ నుంచే కాక పలు దేశాల నుంచి గట్టి పోటీ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment