వణుకు పుట్టిస్తున్న ఇరాన్‌ ప్రకటన.. ఇజ్రాయెల్‌, అమెరికా ప్లానేంటి? | Joe Biden Says He Expects Iran Will Attack Israel, Sooner Than Later - Sakshi
Sakshi News home page

Iran vs Israel: భీకర యుద్ధం అంచున ప్రపంచం.. బాంబుల మోత తప్పదా?

Published Sat, Apr 13 2024 7:51 AM | Last Updated on Sat, Apr 13 2024 1:40 PM

Joe Biden Says He Expects Iran Will Attack Israel - Sakshi

టెల్‌ అవీవ్‌/వాషింగ్టన్‌: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ప్రపంచ దేశాలు మరో మారణహోమం​ చూడాల్సిందేనా? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌పై దాడులు చేసేందుకు ఇరాన్‌ ఉరకలేస్తోంది. ఏ క్షణంలోనైనా ఇరాన్‌ దాడులు చేసే అవకాశముందని అమెరికా నిఘా వర్గాలు సైతం హెచ్చరించడం తీవ్ర కలకలం సృష్టించింది. యుద్ధ ప్రకటన కారణంగా ప్రపంచ దేశాల్లో ఆందోళన నెలకొంది. 

రానున్న 24 నుంచి 48 గంటల్లోపు దాదాపు 100కు పైగా డ్రోన్లు, 150కు పైగా క్షిపణులతో ఇజ్రాయిల్‌లోని టెల్‌ అవీవ్‌పై విరుచుకుపడేందుకు ఇరాన్‌ సిద్ధమైందన్నట్టు అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ కూడా తాము ఇరాన్‌ చేయబోయే ఎలాంటి దాడినైనా ఎదుర్కొవడానికి రెడీ అయినట్టు ప్రకటించింది. మరోవైపు.. ఇరాన్‌ దాడులు చేస్తుందన్న కారణంగా ఇజ్రాయెల్‌కు అమెరికా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇరాన్‌ను ఎదుర్కొవడానికి ఇజ్రాయెల్‌, అమెరికా సన్నద్ధమవుతున్నాయి. 

ఇదిలా ఉండగా.. ఇరాన్‌ దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సైతం స్పందించారు. బైడెన్‌ మాట్లాడుతూ..‘మేము అనుకున్న సమయం కంటే ముందే ఇరాన్‌ దాడులు చేసేందుకు ప్లాన్‌ చేస్తోంది. మేము ఇజ్రాయెల్‌ రక్షణకు సిద్ధంగా ఉన్నాము. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ఇస్తోంది. ఇజ్రాయెల్‌ను రక్షించడంలో మా వంతు పాత్ర పోషిస్తాము. ఈ యుద్ధంలో ఇరాన్‌ విజయం సాధించబోదు’ అని అన్నారు.

మరోవైపు, టెల్‌ అవీవ్‌ చేరుకున్న అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ జనరల్‌ మైకెల్‌ ఎరిక్‌ కొరిల్లా ఇజ్రాయెల్‌ యుద్ధ సన్నద్ధతను సమీక్షించారు. ఆ దేశ రక్షణ మంత్రి యోయావ్‌ గాలాంట్‌తో కలిసి హెట్జోర్‌ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. "ఇజ్రాయెల్‌, అమెరికాలను ఓడించగలమని మా శత్రువులు భావిస్తున్నారు. కానీ జరిగేది అందుకు వ్యతిరేకం. వారు మమ్మల్ని మరింత దగ్గరకు చేరుస్తున్నారు. మా బంధాన్ని బలోపేతం చేస్తున్నారని" తెలిపారు. 

చెతులెత్తేసిన అరబ్‌ దేశాలు.. 
ఇజ్రాయెల్‌కు అండగా ఇరాన్‌పై అమెరికా దాడి చేస్తే తాము సహకరించబోమని కొన్ని అరబ్‌ దేశాలు పేర్కొంటున్నాయి. ఖతార్‌, కువైట్‌ ఈ మేరకు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. ఇరాన్‌పై దాడికి తమ దేశ గగనతలాన్ని గానీ.. స్థావరాలను గానీ.. అమెరికా వినియోగించుకోవడానికి అనుమతి ఇవ్వబోమని స్పష్టంచేశాయి. సౌదీ అరేబియా సహా మిగతా అరబ్‌ దేశాలూ అదే బాట పట్టే అవకాశం ఉంది. దీంతో, ఇరాన్‌పై అమెరికా దాడులు ఎలా చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

ఏప్రిల్‌ ఒకటోతేదీన ఇజ్రాయెల్‌ దాడిలో ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ ఇద్దరు సైనిక జనరళ్లు సహా ఏడుగురు అధికారుల మరణమే ఈ ఉద్రిక్తతలకు ఆజ్యం పోసింది. యుద్ధవాతావరణం నెలకొనడంతో ఇజ్రాయెల్, ఇరాన్, లెబనాన్‌కు వెళ్లొద్దని తమ పౌరులకు అమెరికా, ఫ్రాన్స్‌ దేశాలు హెచ్చరికలు జారీచేశాయి. ఉద్రిక్తతను మరింత పెంచొద్దని ఇరాన్‌కు నచ్చజెప్పాలని టర్కీ, చైనా, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రులతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ఫోన్‌లో కోరారు.  

ఇజ్రాయెల్, ఇరాన్‌లకు వెళ్లకండి: భారత సర్కార్‌ ఆదేశం
తాము చెప్పే వరకూ ఇజ్రాయెల్, ఇరాన్‌లకు ప్రయాణాల పెట్టుకోవద్దని పౌరులకు భారత విదేశాంగ శాఖ సూచించింది. ఈ మేరకు శుక్రవారం అడ్వైజరీని విడుదలచేసింది. ఇప్పటికే ఆ దేశాల్లో ఉంటే భారతీయ ఎంబసీల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించింది. నిర్మాణరంగంలో కార్మికులుగా భారత్‌ నుంచి ఇకపై ఎవరినీ ఇజ్రాయెల్‌కు పంపబోమని భారత్‌ స్పష్టం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement