నిరసన వ్యక్తం చేస్తున్న బాధిత మహిళలు
మాడ్రిడ్: స్పెయిన్‌లోని ఓ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది. మహిళా హక్కుల సంఘాలు ఆ తీర్పును వ్యతిరేకిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. 2019లో సెర్వో పట్టణంలో జరిగిన మారుక్సైన పండగలో పాల్గొన్న సుమారు 80 మంది మహిళలు ఆరుబయట మూత్రవిసర్జన చేశారు. ఈ ఘటనను గుర్తుతెలియని వ్యక్తులు రహస్య కెమెరాల ద్వారా రికార్డు చేసి.. పోర్న్ సైట్లలో అప్‌లోడ్ చేశారు. ఈ ఘటన స్పెయిన్‌లో తీవ్ర దుమారం రేపింది.
తమకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌లు అశ్లీలసైట్లలో ఉన్నాయని తెలుకున్న బాధితులు 2020లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే విధంగా బాధిత మహిళలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయమూర్తి పాబ్లో మునోజ్ వాజ్‌క్వెజ్.. ఆ వీడియోలు బహిరంగ ప్రదేశంలో రికార్డ్ చేసినవని, దీన్ని నేరంగా పరిగణించలేమని కేసును కొట్టివేశారు. మహిళల శారీరక, నైతిక విలువలను ఉల్లంఘించే ఉద్దేశం లేదని కోర్టు పేర్కొంది.
ఉమెన్ ఇన్ ఈక్వాలిటీ జాతీయ అధ్యక్షురాలు సుసానా కమరెరో తీర్పును పున:సమీక్షించాలని ల్యూగో ప్రావిన్షియల్ కోర్టును కోరింది. తీర్పుపై ఓ బాధితురాలు స్పందిస్తూ.. స్నేహితురాలు ద్వారా తన వీడియోలు అశ్లీలసైట్లలో ఉన్నాయని తెలుసుకొని తీవ్రమైన ఆందోళనకు గురయ్యానని అన్నారు. ఆ వీడియోలు చూసిన వెంటనే ఏడుపు ఆపుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తీర్పు కూడా తనకు తీవ్రమైన నిరాశను కలిగించిందని తెలిపారు. దీనిపై మహిళా మంత్రి ఐరీన్ మోంటెరో స్పందిస్తూ.. మహిళల అనుమతి లేకుండా ఆమె ఫోటోలు తీయడం, అశ్లీలసైట్లలోగాని, ఇతరులకుగాని పంపటం లైంగిక హింస అవుతుందని అన్నారు.
ల్యూగో ప్రావిన్షియల్ కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ.. సోషల్ మీడియాలో మహిళలు,యువతులు #Justice Maruxaina పేరుతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. మహిళల హక్కుల సంఘం కార్యకర్త అనా గార్సియా.. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ మహిళల స్వేచ్ఛకు భంగం కలిగేలా ఇలా వీడియోలు తీయటం శిక్షార్హం అని తెలిపారు. భవిష్యత్తులో ఈ తీర్పు వల్ల మహిళ స్వేచ్ఛ మరింత ప్రమాదంలో పడుతుందని అన్నారు. మహిళలను రహస్యంగా వీడియోలు తీసి అశ్లీలసైట్లలో అప్‌లోడ్ చేయటం అధికమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment