
కూక్‌టౌన్(ఆ్రస్టేలియా): మొసలి పలుమార్లు దాడి చేసి, నోట కరుచుకుని నీటి అడుగుకు లాక్కెళ్లిన తర్వాత కూడా ఓ వ్యక్తి చాకచక్యంగా వ్యవహరించి, ప్రాణాలతో బయటపడ్డాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన శనివారం ఆ్రస్టేలియాలోని క్వీన్స్‌లాండ్ రాష్ట్రం కూక్‌టౌన్‌లో చోటుచేసుకుంది. నలభయ్యేళ్ల ఓ వ్యక్తి సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో నాలుగున్నర మీటర్ల పొడవుండే ఓ మొసలి అతడి వైపుగా వచ్చింది. ప్రమాదాన్ని పసిగట్టి తప్పించుకునేందుకు యత్నించాడు.
తన వద్ద ఉన్న స్పియర్ గన్‌ను పేల్చేందుకు ప్రయత్నించాడు. మొసలి అతడిపై మూడుసార్లు దాడి చేసి తల, భుజాలు, కాళ్లను గాయపరిచి, నోట కరుచుకుని నీటి అడుగుకు లాక్కెళ్లింది. ధైర్యం కోల్పోని ఆ వ్యక్తి తన చేతి వేళ్లతో మొసలి కళ్లలోకి బలంగా గుచ్చాడు. బాధతో అది పట్టు సడలించడంతో సురక్షితంగా బయటపడ్డాడు. గాయాలపాలైన అతడిని అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు.