Missing Titanic sub search continues as banging sounds heard - Sakshi
Sakshi News home page

టిక్‌.. టిక్‌.. టిక్‌.. సస్పెన్స్‌ థ్రిల్లర్‌లా టైటాన్‌ రెస్క్యూ ఆపరేషన్‌

Published Thu, Jun 22 2023 7:13 AM | Last Updated on Thu, Jun 22 2023 8:52 AM

Missing Titanic sub search continues as banging sounds heard - Sakshi

బోస్టన్‌:  ఉత్తర అట్లాంటిక్‌ మహా సముద్రంలో టైటానిక్‌ ఓడ సందర్శన కోసం వెళ్లి గల్లంతయిన జలాంతర్గామి ‘టైటాన్‌’ జాడ ఇంకా తెలియరాలేదు. టైటాన్‌లోని ఐదుగురు సందర్శకుల పరిస్థితి ఏమిటన్న దానిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వారి ఆచూకీ గుర్తించేందుకు అమెరికా కోస్ట్‌ గార్డ్‌ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

బుధవారం ఉదయం నుంచి తమ కార్యాచరణను ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా, సముద్ర అంతర్భాగం నుంచి శబ్దాలు వెలువడుతున్నట్లు కెనడా సైనిక నిఘా విమానం కనిపెట్టడం ఆశలు రేకెత్తిస్తోంది. టైటాన్‌ గల్లంతయినట్లు భావిస్తున్న ప్రాంతం నుంచి ప్రతి 30 నిమిషాలకోసారి బిగ్గరగా శబ్దాలు వెలువడుతున్నట్లు సమాచారం. అయితే, ఈ శబ్దాలు టైటాన్‌కు సంబంధించినవేనా? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. టైటాన్‌లో కొంత ప్రాణవాయువు ఇంకా మిగిలే ఉందని, సందర్శకుల ప్రాణాలకు ఇప్పటికిప్పుడు అపాయం వాటిల్లకపోవచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి.  

గురువారం ఉదయానికల్లా ఆక్సిజన్‌ మాయం!  
టైటాన్‌ ఆచూకీ కోసం జాన్‌ కాబోట్, స్కాండీ విన్‌ల్యాండ్, అట్లాంటక్‌ మెర్లిన్‌ అనే మూడు పడవలను అమెరికా కోస్ట్‌ గార్డ్‌ సిబ్బంది రంగంలోకి దించారు. టైటాన్‌ జలాంతర్గామి ప్రస్తుతం సముద్ర ఉపరితలం నుంచి 12,500 అడుగుల(3,800 మీటర్లు) లోతున ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇది సామాన్యమైన లోతు కాదు. అక్కడిదాకా సురక్షితంగా చేరుకోవడం కష్టమైన పని అని చెబుతున్నారు. అండర్‌వాటర్‌ రోబోను పంపించినట్లు తెలుస్తోంది. సహాయక చర్యల కోసం అమెరికా సైన్యానికి చెందిన మూడు సి–17 రవాణా విమానాలను పంపించినట్లు యూఎస్‌ ఎయిర్‌ మొబిలిటీ కమాండ్‌ అధికార ప్రతినిధి చెప్పారు.

ఒక పెట్రోలింగ్‌ విమానం, రెండు ఓడలతో గాలింపు చర్యలు చేపడుతున్నామని కెనడా సైన్యం ప్రకటించింది. గురువారం ఉదయానికల్లా టైటాన్‌లో మొత్తం ఆక్సిజన్‌ ఖర్చయిపోతుంది. అప్పటిలోగా దాని జాడ తెలియకపోతే అందులోని సందర్శకులు ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఆదివారం ఉదయం 6 గంటలకు ఈ జలాంతర్గామి టైటానిక్‌ దిశగా తన ప్రయాణం ప్రారంభించింది. సరిగ్గా నాలుగు రోజులకు సరిపడా ఆక్సిజన్‌ మాత్రమే అందులో ఉంది. టైటాన్‌లో రెండు రకాల కమ్యూనికేషన్‌ వ్యవస్థలు ఉన్నాయి. నీటిలోకి వెళ్లిన 1.45 గంటల లోపే అవి పనిచేయడం ఆగిపోయింది.   

క్షేమంగా రావాలంటూ..
టైటాన్‌ గల్లంతు కావడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఐదుగురు సందర్శకులు క్షేమంగా తిరిగిరావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు వివిధ దేశాల అధినేతలు పేర్కొన్నారు. సందర్శకుల క్షేమాన్ని కోరుతూ నెటిజన్లు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. టైటాన్‌లో ఓషియన్‌గేట్‌ కార్పొరేషన్‌ వ్యవస్థాపకుడు స్టాక్‌టన్‌ రష్, బ్రిటిష్‌ వ్యాపారవేత్త హమిష్‌ హర్డింగ్, పాకిస్తాన్‌కు చెందిన తండ్రీకొడుకులు షహజాదా, సులేమాన్‌ దావూద్, ఫ్రెంచ్‌ నావికాదళం మాజీ అధికారి పాల్‌–హెన్రీ నార్జియోలెట్‌ ఉన్నారు. వీరంతా 1912లో అట్లాంటిక్‌ సముద్రంలో మునిగిపోయిన టైటానిక్‌ ఓడ శిథిలాలను సందర్శించడానికి టైటాన్‌ జలాంతర్గామిలో వెళ్లారు. ఆదివారం రాత్రి కెనడా తీరానికి 700 కిలోమీటర్ల దూరంలో అట్లాంటిక్‌ సముద్రంలో టైటాన్‌ గల్లంతయ్యింది.    

ఇదీ చదవండి: సాహస వీరుడు.. మహాసాగరంలో ఇరుక్కుని..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement