
ఉక్రెయిన్ సంక్షోభంలో ఫేక్ వార్తల కట్టడికి రష్యా తెచ్చిన చట్టం.. కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది.
పాశ్చాత్య దేశాల ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఆర్థికంగా కుదేలు అవుతున్న రష్యాపై ఇంకా దెబ్బలు పడుతూనే ఉన్నాయి. తాజాగా నెట్‌ఫ్లిక్స్, టిక్‌టాక్‌లు రష్యాలో పూర్తిగా తమ తమ సేవలు నిలిపివేసినట్లు ప్రకటించాయి.
ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో రష్యాతో మా బంధం తెంపేసుకుంటున్నాం. ఆంక్షల్లో భాగంగానే ఈ నిర్ణయం. రష్యా తెచ్చిన ఫేక్ చట్టాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం అంటూ ఆదివారం ఒక ప్రకటన రిలీజ్ చేసింది నెట్‌ఫ్లిక్స్. రష్యాలో నెట్‌ఫ్లిక్స్‌కు పది లక్షలకు పైగా యూజర్లు ఉన్నారు. కొత్త యూజర్లకు అనుమతులు ఉండబోవన్న నెట్‌ఫ్లిక్స్.. ఆల్రెడీ ఉన్న యూజర్ల సంగతి ఏంటన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు.
ఇక టిక్‌టాక్ రష్యాలో లైవ్ స్ట్రీమింగ్, ఇతర సేవలను నిలిపివేసినట్లు ప్రకటించింది టిక్‌టాక్. ఉక్రెయిన్ ఆక్రమణ సందర్భంలో ఫేక్ వార్తల కట్టడి పేరిట బలవంతపు చట్టం, కఠిన శిక్షలు తీసుకొచ్చింది రష్యా. దీనికి నిరసనగానే టిక్‌టాక్ ఈ నిర్ణయం తీసుకుంది.