హెజ్‌బొల్లా పౌరవిభాగం సభ్యులు సహా తొమ్మిది మంది మృతి
దక్షిణ లెబనాన్ వద్ద కొనసాగుతున్న పరస్పర దాడులు
బీరుట్/జెరూసలేం: హెజ్‌బొల్లా చీఫ్‌ను అంతం చేసి దాడులను ఉధృతంచేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు ఏకంగా లెబనాన్ దేశ రాజధాని నడిబొడ్డున దాడికి తెగబడింది. బీరుట్ నగరంలో దేశ పార్లమెంట్, ప్రధాన మంత్రి కార్యాలయం, ఐక్యరాజ్యసమితి లెబనాన్ ప్రధాన కార్యాలయాలకు కూతవేటు దూరంలో ఉన్న ప్రాంతంపై దాడి చేసింది. గురువారం తెల్లవారుజామున సెంట్రల్ బీరుట్‌లోని బషౌరా జిల్లాలోని ఒక అపార్ట్‌మెంట్‌పై జరిగిన దాడిలో 9 మంది మృతిచెందారు.
దీంతో భవంతిలోని హెజ్‌బొల్లా హెల్త్‌సెంటర్ దెబ్బతింది. చనిపోయిన వారిలో హెజ్‌బొల్లా ఆరోగ్యకేంద్రంలో పనిచేసే ఏడుగురు సభ్యులున్నట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ ధృవీకరించింది. మవాద్ ప్రాంతంలోని హెజ్‌బొల్లా మీడియా సంబంధాల భవనం మీదా దాడులు జరిగాయి. బింట్ జిబేయిల్ పట్టణంలోని ఆర్మీ పోస్ట్‌పై జరిగిన శతఘ్ని దాడిలో ఒక లెబనాన్ సైనికుడు చనిపోయారు.
రెడ్‌క్రాస్ సిబ్బంది దుర్మరణం
దక్షిణ లెబనాన్‌లో గాయపడిన పౌరులను తరలిస్తున్న రెడ్‌క్రాస్ సిబ్బంది వాహనంపై దాడి జరిగింది. తయ్యబే గ్రామ సమీపంలో జరిగిన ఈ దాడిలో నలుగురు పారామెడికల్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ‘‘ ఐరాస శాంతిపరిరక్షక దళాల సమన్వయంతో ముందస్తు సమాచారంతోనే వైద్యసిబ్బంది వెళ్తున్నారు. అయినాసరే వారిపై దాడి జరిగింది. ఇది ముమ్మాటికీ అంతర్జాతీయ చట్టాలు, ఒడంబడికలను ఉల్లంఘించడమే.
వాళ్ల వద్ద ఆయుధాలు ఉన్నాయని ఎలా ఓ నిర్ణయానికొస్తారు? సొంత నిర్ణయాలు తీసుకుని దాడులు చేసే అధికారం ఇజ్రాయెల్‌కు ఎవరిచ్చారు?’’ అని లెబనాన్ ఆరోగ్య మంత్రి ఫిరాస్ అబియద్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మరోవైపు దక్షిణ లెబనాన్ భూభాగాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించడం మొదలెట్టింది. ఆక్రమణను ప్రతిఘటిస్తూ లెబనాన్ సైన్యం జరిపిన దాడిలో ఇజ్రాయెల్‌కు చెందిన ఎనిమిది మంది సైనికులు చనిపోయారు.
తరలిపోతున్న విదేశీయులు
సంక్షోభం నేపథ్యంలో తమ పౌరులను స్వదేశానికి తరలించేందుకు స్పెయిన్ రంగంలోకి దిగింది. బీరుట్ ఎయిర్‌పోర్ట్‌కు రెండు విమానాలను హుటాహుటిన పంపించింది. ఐరాస శాంతి కార్యక్రమాల్లో భాగంగా బీరుట్‌లో ఉన్న 676 మంది తమ సైనికులు తదుపరి ఆదేశాలు వచ్చేదాకా అక్కడే ఉంటారని స్పెయిన్ పేర్కొంది.
ట్రిపోలీ నౌకాశ్రయం నుంచి 300కుపైగా తుర్కియే దేశస్తులు స్వదేశం పయనమయ్యారు. బ్రిటన్, ఆ్రస్టేలియా, జపాన్, ఇటలీ దేశస్తులు సైతం లెబనాన్ వీడుతున్నారు. గత 24 గంటల్లో 28 మంది హెల్త్‌వర్కర్లు చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. ఇరాన్, లెబనాన్‌లపై ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అసహనం వ్యక్తంచేశారు.
హమాస్ నేతను చంపేశాం
ఇజ్రాయెల్ ప్రకటన
మూడు నెలల క్రితమే గాజా స్ట్రిప్‌లో హమాస్ సీనియర్ నేత రావీ ముష్తాహాను చంపేశామని ఇజ్రాయెల్ గురువారం ప్రకటించింది. కమాండర్లు సమీ సిరాజ్, సమీ ఔదేహ్‌లనూ చంపేశామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అయితే వీరి మరణవార్తపై హమాస్ స్పందించలేదు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పైకి హమాస్ చేసిన దాడి వెనుక సూత్రధారి, హమాస్ టాప్ కమాండర్ యాహ్యా సిన్వర్‌కు ముష్తాహా అత్యంత సన్నిహిత నేత. సిన్వర్ ఇంకా గాజాలోనే రహస్య ప్రదేశంలో దాక్కున్నాడని ఇజ్రాయెల్ సైన్యం భావిస్తోంది.
సిరియాలో ఆయుధాగారంపై దాడులు
తమకు ముప్పుగా పరిణమించొచ్చు అని అనుమానించిన ప్రతి లక్ష్యంపై ఇజ్రాయెల్ గురిపెడుతోంది. ఇందులోభాగంగా గురువారం సిరియా పశి్చమతీరంలోని లటాకియా ప్రావిన్స్‌లోని రష్యా ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఖమేమిన్ ఆయుధాగారంపై ఇజ్రాయెల్ మెరుపుదాడులు చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. గురువారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో 30 క్షిపణులను ఇజ్రాయెల్ ప్రయోగించింది.
హెజ్‌బొల్లాకు అధునాతన ఆయుధాలు ఇక్కడి నుంచి సరఫరా అవుతాయని, వీటిని ధ్వంసంచేసి హెజ్‌బొల్లాకు ఆయుధాల కొరత సృష్టించడమే ఈ దాడుల అసలు లక్ష్యమని తెలుస్తోంది. గత షెడ్యూల్ ప్రకారం ఖాసిమ్ ఫార్స్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన సరకు రవాణా విమానం ద్వారా ఇక్కడి ఆయుధాలను ఇరాన్‌కు చేరవేయాల్సిఉంది. ఈలోపే ఇజ్రాయెల్ దాడి చేసింది.
100 మంది నవజాత శిశువులకు నస్రల్లా పేరు
హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా పట్ల ఇరాక్ ప్రజలు తమ అభిమానాన్ని ఘనంగా చాటుకున్నారు. నస్రల్లా మరణం ఇరాక్‌లో మరీ ముఖ్యంగా మెజారిటీ షియా జనాభాలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఆయనకు నివాళిగా దేశంలోని సుమారు 100 మంది నవజాత శిశువులకు ‘నస్రల్లా’ పేరు పెట్టుకున్నారు.
దేశవ్యాప్తంగా సుమారు 100 మంది శిశువులు ఆ పేరుతో నమోదు అయ్యారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది షియా సమాజం ఆయనను ఎంతగా ఆరాధిస్తోందో ఇట్టే అర్థమవుతోంది. షియాలు ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా, ప్రతిఘటనకు చిహ్నంగా నస్రల్లాను చూస్తారు. షియా వర్గాల్లో నస్రల్లాకు గణనీయమైన ఫాలోయింగ్ ఉంది.
నస్రల్లాను ఇరాక్ ప్రధాని మొహమ్మద్ షియా అల్ సుడానీ అమరుడిగా అభివర్ణించారు. ఇరాక్‌తో నస్రల్లాకు మతపరంగానేకాకుండా రాజకీయ భావజాలపరంగా లోతైన అనుబంధం ఉంది. 2003 ఇరాక్‌ను అమెరికా ఆక్రమించడాన్ని నస్రల్లా బహిరంగంగానే విమర్శించి అక్కడి షియాలకు ఆరాధ్యుడయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment