ఆర్థిక సంక్షోభం, సమస్యల సుడిగుండంలో విలవిల
2006లో ఇజ్రాయెల్‌తో యుద్ధంలో అపార నష్టం
నాలుగైదు రోజుల నాటి ముచ్చట. లెబనాన్‌లోని హెజ్‌బొల్లా మిలిటెంట్లు ఇటీవల ఇజ్రాయెల్‌పై భారీ దాడికి సిద్ధపడ్డారు. కానీ దీన్ని ఇజ్రాయెల్ ముందే పసిగట్టింది. వాళ్లు కాలూచేయీ కూడదీసుకోకముందే వందలాది యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై మెరుపుదాడి చేసింది.
అనంతర అందుకు ప్రతిగా హెజ్బొల్లా కూడా వందలాది క్షిపణులతో విరుచుకుపడ్డా ఆ దాడులను సమర్థంగా కాచుకుంది. ఈ ఉదంతం పశి్చమాసియాలో ఇప్పటికే చెలరేగుతున్న యుద్ధ జ్వాలలను మరింతగా ఎగదోసింది. ఇజ్రాయెల్‌పై పూర్తిస్థాయి యుద్ధానికి లెబనాన్ సిద్ధపడుతోందంటూ జోరుగా వార్తలొస్తున్నాయి. కానీ ఇజ్రాయెల్ వంటి అజేయ సైనిక శక్తిని ఓడించే సత్తా లెబనాన్‌కు ఉందా? దేశ ఆర్థిక పరిస్థితి అందుకు సహకరిస్తుందా...?!
లెబనాన్ చాన్నాళ్లుగా పెను రాజకీయ, ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటోంది. అప్పుల కుప్ప కొండంత పెరిగిపోయింది. దేశంలో సరైన విద్యుత్ సరఫరా వ్యవస్థకే దిక్కు లేదు. బ్యాంకింగ్ వ్యవస్థ సరేసరి. పేదరికం విజృంభిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌పై యుద్ధానికి దిగి నెగ్గుకు రావడం లెబనాన్ సాధ్యపడే పని కాదంటున్నారు. 18 ఏళ్ల క్రితం ఇరు దేశాలు నెల పాటు భీకరంగా తలపడ్డాయి. చివరికది అర్ధంతరంగా ముగిసినా లెబనాన్‌కు తీరని నష్టాలే మిగిల్చింది.
దశాబ్దాల అవినీతి, రాజకీయ అస్థిరత
లెబనాన్‌లో చాన్నాళ్లుగా రాజకీయ అస్థిరత నెలకొంది. అవినీతి పెచ్చరిల్లింది. అభివృద్ధి పూర్తిగా కుంటువడింది. ఆధునీకరణకు నోచుకోక బ్యాంకింగ్ వ్యవస్థ అధ్వాన్నంగా తయారైంది. విద్యుత్ రంగం పూర్తిగా ప్రైవేట్ డీజిల్ జనరేటర్ ఆపరేటర్లు, చమురు సంస్థల చేతుల్లో చిక్కుకుపోయింది. ప్రభుత్వ సంస్థలు కూడా అంతర్జాతీయ రుణదాతల దయాదాక్షిణ్యాలపై నెట్టుకొస్తున్న పరిస్థితి! ఆర్థిక సాయానికీ, ఆహారానికీ విదేశాల మీదే ఆధారపడుతోంది. కోవిడ్ సంక్షోభం దెబ్బకు 2020 నుంచి లెబనాన్ పరిస్థితి పెనంనుంచి పొయ్యిలోకి చందంగా మారింది. బీరూట్ నౌకాశ్రయంలో రసాయన నిల్వల భారీ పేలుడు దెబ్బకు వాణిజ్య రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. అంతో ఇంతో ఆదుకుంటున్న పర్యాటక రంగమూ ఇజ్రాయెల్ దాడులతో నేల చూపులు చూస్తోంది.
నిల్వలు 3 నెలలకు మించవ్!
2022లో ఇజ్రాయెల్ దాడుల్లో ధాన్యాగారాలు చాలావరకు ధ్వంసం కావడంతో లెబనాన్ ఆహార నిల్వ సామర్థ్యం దారుణంగా పడిపోయింది. దాంతో విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతూ నెట్టుకొస్తోంది. ‘‘ఆహార, చమురు నిల్వలు దాదాపు నిండుకున్నాయి. రెండు మూడు నెలలకు మించి లేవు. అవీ అయిపోతే పరిస్థితి తలచుకుంటేనే భయంగా ఉంది’’ అని అంతర్జాతీయ సహాయ సంస్థ మెర్సీ కార్ప్స్ ఆందోళన వ్యక్తం చేసింది. రన్‌వేల పాక్షిక పునరుద్ధరణ తర్వాత ఎయిర్‌పోర్ట్ కాస్త అందుబాటులో వచి్చంది.
శరణార్థుల బెడద
లెబనాన్‌కు ఉన్న ఏకైక విమానాశ్రయాన్ని 2006లో ఇజ్రాయెల్ పూర్తిగా ధ్వంసం చేసింది. దాంతో సరుకు వాయు రవాణాను పూర్తిగా బ్రేకులు పడ్డాయి. నాటి దాడుల్లో మౌలిక వసతులన్నీ ధ్వంసమై లెబనాన్‌కు ఏకంగా రూ.26 లక్షల కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని ప్రపంచబ్యాంక్ అంచనా వేసింది! ఇజ్రాయెల్ గనక ఇప్పుడు మళ్లీ పూర్తిస్థాయి దాడికి దిగితే లెబనాన్‌ఇంకెంతటి నష్టం చవిచూడాల్సి ఉంటుం దో అనూహ్యమే.
పైగా 2006 యుద్ధమప్పుడు శరణార్థుల బాధ లేదు. సిరియాలో అంతర్యుద్ధం దెబ్బకు ఇటీవల కోటి మందికి పైగా లెబనాన్‌కు పోటెత్తారు. ఈ శరణార్థులకు అందుతున్న అంతర్జాతీయ సాయం కూడా ఆగి ఆర్థిక భారం మరీ పెరిగింది.
ఐరాస పెదవి విరుపు
డ్రోన్ల వాడకంతో ఇప్పుడు ఆధునిక యుద్ధరీతులు సమూలంగా మారిన నేపథ్యంలో ఈసారి ఇజ్రాయెల్‌తో యుద్ధమంటూ వస్తే మరింత భీకరంగా ఉండొచ్చు. అందుకు కావాల్సిన సన్నద్ధత లెబనాన్‌కు ఏమాత్రమూ లేదని ఐరాస, లెబనాన్ సంయుక్త ముసాయిదా పత్రమే పరోక్షంగా తేల్చేయడం విశేషం. అదేం చెప్పిందంటే...
→ గాయపడే సైనికులు, పౌరుల కోసం ఆస్పత్రుల్లో ఔషదాలు, అత్యవసర చికిత్స, సదుపాయాలను భారీగా సమకూర్చుకోవాలి.
→ 2006లో మాదిరి చిన్నపాటి యుద్దమైనా కనీసం 2.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.
→ వారికి కనీస సదుపాయాల కల్పనకు నెలకు కనీసం రూ.420 కోట్లు కావాలి.
→ అదే పూర్తిస్థాయి భీకర యుద్ధమైతే కోటి మందికి పైగా శాశ్వతంగా నిర్వాసితులైపోతారు.
→ అప్పుడు వారి బాగోగులకు ఎంత లేదన్నా నెలకు రూ.838 కోట్లు కావాలి.
→ కొన్ని నెలలుగా ఇజ్రాయెల్–హెజ్‌బొల్లా పరస్పర దాడుల దెబ్బకు సరిహద్దు ప్రాంతాల్లోని లక్ష మంది ఇప్పటికే వేరే చోట్లకు తరలారు. వారి బాగోగులకు నెలకు రూ.209 కోట్ల కోసమే లెబనాన్ నానా ఆపసోపాలు పడుతోంది.
తలకు మించిన నానారకాల సమస్యలతో లెబనాన్ ఇప్పటికే తీవ్రంగా సతమతమవుతోంది. ఇంట గెలవలేని ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌తో యుద్ధానికి దిగి నెలా నెగ్గుకురాగలదు? చైనా, రష్యా, ఇరాన్ నుంచి సమీకరించిన ఆయుధ సంపత్తి భారీగానే ఉన్నా ఇజ్రాయెల్ దాడులను హెజ్బొల్లా మిలిటెంట్లు తట్టుకుని నిలవడం దుస్సాధ్యమే’’
– అంతర్జాతీయ పరిశీలకులు
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment