గాజాను గుప్పిట పట్టిన ఇజ్రాయెల్ సైన్యం .. అక్కడి ప్రజల విషయంలో అత్యంత కఠిన వైఖరిని అవలంభించాలని నిర్ణయించింది. అంతర్జాతీయ సమాజం పిలుపు ఇచ్చినా సరే మానవతా దృక్ఫథంతో వ్యవహరించేది లేదని తేల్చేసింది. బంధీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరుల్ని హమాస్ విడుదల చేసేదాకా.. గాజా పౌరులకు కనీసం మంచి నీళ్లు కూడా అందవని స్పష్టం చేసింది.
మంచి నీరు, కరెంట్ కోతతో గాజా ప్రజలు అల్లలాడిపోతున్నారంటూ గాజా క్షేత్రస్థాయి పరిస్థితులపై కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో.. కనికరించి మానవతా సాయానికి ముందుకు రావాలంటూ రెడ్ క్రాస్ ఇజ్రాయెల్‌ను అభ్యర్థించింది. మరికొన్ని దేశాలు కూడా ఇజ్రాయెల్‌ను ఇదే కోరాయి. అయితే ఈ పిలుపుపై ఇజ్రాయెల్ మంత్రి కాట్జ్ ఎక్స్ వేదికగా స్పందించారు.
‘‘గాజాకు మానవతా సాయమా?.. ఎట్టి పరిస్థితుల్లో అది వీలు పడదు. బంధీలుగా ఉంచిన ఇజ్రాయెల్ పౌరులు సురక్షితంగా ఇంటికి చేరేంత వరకు గాజా ప్రజలకు కరెంట్, మంచి నీళ్లు.. మనుషులకే కాదు ఆఖరికి అక్కడి వాహనాలు కదిలేందుకు కావాల్సిన చమురు కూడా అందదు. మాకు ఎవరూ నీతులు బోధించకండి’’ అని స్పష్టం చేశారాయన.
శనివారం ఇజ్రాయెల్‌పై హమాస్ గ్రూప్ మెరుపుదాడి తర్వాత.. గాజా స్ట్రిప్‌లో మొత్తం 150 మంది ఇజ్రాయెల్ పౌరుల్ని, విదేశీయుల్ని తమ బంధీలుగా ఉంచుకుంది. ఆ తర్వాత జరుగుతున్న పరస్పర దాడులతో భాగంగా.. గాజాను పూర్తిగా తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించుకుంది. ఇందుకు కోసం జరిపిన దాడుల్లో 1200 మందిని చంపింది. 5వేల మందిని గాయపర్చింది. ఇక ఈ ప్రాంతంలో ఉన్న ఏకైక పవర్ ప్లాంట్ ఇంధనం కొరత కారణంగా పని చేయడం ఆగిపోయింది. దీంతో ఆస్పత్రులకు సైతం కరెంట్ సరఫరా నిలిచిపోయి.. పేషెంట్లు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రెడ్‌క్రాస్ సానుకూలంగా స్పందించాలంటూ ఇజ్రాయెల్‌ను కోరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment