Radioactive Tsunami: North Korea Claimed Tests New Nuclear-Capable Underwater Drone - Sakshi
Sakshi News home page

ప్రకంపనలు రేపుతున్న ఉత్తర కొరియా ప్రకటన.. సునామీని పుట్టించే..

Published Sat, Mar 25 2023 4:26 AM | Last Updated on Sat, Mar 25 2023 10:50 AM

North Korea on Friday claimed to have tested an underwater drone - Sakshi

సునామీని పుట్టించే అణు సామర్థ్యమున్న అండర్‌ వాటర్‌ డ్రోన్‌ ‘హెయిల్‌’ను విజయవంతంగా పరీక్షించినట్టు ఉత్తర కొరియా చేసిన ప్రకటన ప్రకంపనలు రేపుతోంది. దీని సాయంతో భారీ సునామీలు పుట్టించి తీరంలో నౌకాశ్రయాలనూ, సముద్ర మధ్యంలో శత్రు నౌకలను నాశనం చేయగల సామర్థ్యం తమకు సమకూరిందని అది చెబుతోంది. అదే నిజమైతే రష్యా తర్వాత ఈ సామర్థ్యమున్న రెండో దేశమవుతుంది. ఇలాంటి డ్రోన్లను ప్రయోగిస్తే సముద్ర మట్టం అనూహ్యంగా పెరిగి పరిసర ప్రాంతాలను పూర్తిగా ముంచెత్తుతుంది.

దీనితో సముద్ర మధ్యంలో అయితే శత్రు నౌకలను నీట ముంచవచ్చు. అదే తీర ప్రాంతంలో ప్రయోగిస్తే సమీప నౌకాశ్రయాలతో పాటు నగరాలు, జనావాసాలు కూడా నామరూపాల్లేకుండా పోయే ప్రమాదముంది! కాకపోతే హెయిల్‌ను రష్యా అండర్‌ వాటర్‌ డ్రోన్‌ పొసెయ్‌డాన్‌తో ఏ మాత్రమూ పోల్చలేం. ఎందుకంటే అత్యాధునిక హంగులతో కూడిన పొసెయ్‌డాన్‌ను జలాంతర్గాముల నుంచీ ప్రయోగించవచ్చు. స్వయంచాలిత న్యూక్లియర్‌ ప్రొపెల్షన్‌ వ్యవస్థ సాయంతో ఎంతకాలమైనా ప్రయాణం చేయగల సత్తా దాని సొంతం. హెయిల్‌కు అంత సీన్‌ లేదని నిపుణులు చెబుతున్నారు. అమెరికాతో సంయుక్త సైనిక విన్యాసాలు చేస్తున్న దక్షిణ కొరియాను బెదిరించేందుకే ఇలాంటి ప్రకటన చేసి ఉండఉండవచ్చన్నది వారి విశ్లేషణ.
 
అణు డ్రోన్‌ను పరీక్షించాం: ఉత్తర కొరియా
భారీ రేడియో ధార్మిక సునామీని పుట్టించగల అణుసామర్థ్యంతో కూడిన అండర్‌ వాటర్‌ డ్రోన్‌ ‘హెయిల్‌’ను విజ యవంతంగా పరీక్షించినట్టు ఉత్తర కొరియా ప్రకటించింది! ఈ ఆందోళనకర పరిణామం కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. ‘‘ఈ డ్రోన్‌ను తీరం వద్ద మోహరించవచ్చు. నౌకలపై సముద్రం లోపలికి తీసుకెళ్లీ ప్రయోగించవచ్చు. నీటి లోపల ఇది సృష్టించే పేలుడు దెబ్బకు పుట్టుకొచ్చే రేడియో ధార్మిక సునామీ నౌకాశ్రయాలతో పాటు నడి సముద్రంలో శత్రు యుద్ధ నౌకలను కూడా తుత్తునియలు చేయగలదు’’అని ఉత్తర కొరియా అధికార వార్తా సంస్థ కేసీఎన్‌ఏ చెప్పుకొచ్చింది.

‘‘ఈ దిశగా మూడు రోజులుగా సాగుతున్న ప్రయోగాలను అధ్యక్షుడు కిమ్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు’’అని తెలిపింది. టోర్పెడో వంటి పరికరం పక్కన కిమ్‌ నవ్వుతున్న ఫొటోను ఉత్తరకొరియా పత్రిక రొండొంగ్‌ సిన్మున్‌ ప్రచురించింది. ఆ పరికరమేమిటనేది వివరించలేదు. సముద్ర జలాలు ఉవ్వెత్తున లేచి పడుతున్న ఫొటోలను కూడా ముద్రించింది. ‘‘ఈ అలలు డ్రోన్‌ మోసుకెళ్లిన అణ్వాయుధం పేలుడు ఫలితం. మంగళవారం ప్రయోగించిన ఈ డ్రోన్‌ నీటి అడుగున 60 గంటల పాటు ప్రయాణించి, 150మీటర్ల లోతులో లక్ష్యాన్ని ఛేదించింది’’అని పేర్కొంది.

2012 నుంచి అభివృద్ధి చేస్తున్న ఈ డ్రోన్‌ను గత రెండేళ్లలో 50 సార్లకు పైగా పరీక్షించి చూసినట్లు తెలి పింది. అయితే ఉత్తర కొరియా ప్రకటనలో విశ్వసనీయ తపై నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హెయిల్‌ అంటే కొరియా భాషలో సునామీ. ఈ డ్రోన్‌ గురించి ఉత్తర కొరియా అధికారికంగా వెల్లడించడం ఇదే తొలిసారి! ఉత్తర కొరియా దుందుడుకు చర్యలకు మూల్యం తప్పదంటూ దక్షిణ కొరియా అధ్యక్షుడు హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఈ పరీక్ష గురించిన ప్రకటన వెలువడింది!   కొరియా సముద్ర జలాల్లో విమానవాహక నౌకలను మోహరిస్తామని అమెరికా ప్రకటించడం తెలిసిందే.  

పొసెయ్‌డాన్‌.. రష్యా డ్రోన్‌..
► ఇది అణు సామర్థ్యమున్న సూపర్‌ టోర్పెడో. చరిత్రలో అతిపెద్ద టోర్పెడో కూడా ఇదే! నాటో దళాలు దీన్ని కాన్యాన్‌గా పిలిచే పొసెయ్‌డాన్‌ను టోర్పెడో, డ్రోన్‌ రెండింటి క్రాస్‌ బ్రీడ్‌గా చెప్పవచ్చు. తొలి జత పొసెయ్‌డాన్‌ టోర్పెడోలను విజయవంతంగా ఉత్పత్తి చేసినట్టు గత జనవరిలో రష్యా స్వయంగా ప్రకటించింది. వీటిని బెల్‌ గొరోడ్‌ అణు జలాంతర్గామిలో మోహరిస్తామని పేర్కొంది. అయి తే పొసెయ్‌డాన్‌ తయారీ గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ 2018లోనే ప్రకటన చేశారు. ‘‘దీని రేంజ్‌ అపరిమితం. అంతేగాక సముద్రాల్లో అత్యంత అట్టడుగుల్లోకీ వెళ్లి దాడులు చేయ గల సత్తా దీని సొంతం. పైగా ప్రస్తుతమున్న అన్ని టోర్పెడోల కంటే కొన్ని రెట్లు ఎక్కువ వేగంతో, అదే సమయంలో ఏమా త్రం శబ్దం చేయకుండా దూసుకెళ్తుంది. తనంతతానుగా ప్రమాదాన్ని గుర్తించి ప్రయాణ మార్గాన్ని మార్చేసుకోగ లేదు. కనుక దీన్ని శత్రువు నాశనం చేయడం దాదాపుగా అసాధ్యం. సముద్రంలో దీన్ని ఎదుర్కోగల ఆయుధమే లేదు’’అని ధీమాగా పేర్కొన్నారు. రష్యాతో పాటు చైనా కూడా ఇలాంటివి తయారు చేసే పనిలో ఉందని అమెరికా అనుమానిస్తోంది. అయితే అమెరికా వద్ద ఇలాంటివి ఎప్పటినుంచో ఉన్నట్టు రక్షణ నిపుణులు చెబుతున్నారు!
► స్టేటస్‌–6 ఓషియానిక్‌ మల్టీపర్పస్‌ సిస్టంగా కూడా పిలిచే పొసెయ్‌డాన్‌ గురించి తెలిసింది చాలా తక్కువ.
► దాదాపు ఆరడుగుల వ్యాసార్థ్యం, 24 మీటర్ల పొడవు, 2 లక్షల పౌండ్ల బరువుండే దీన్ని అణు జలాంతర్గామి నుంచి ప్రయోగించవచ్చు.
► ఈ డ్రోన్లు ఎంత పెద్దవంటే అంతటి జలాంతర్గామిలో కేవలం ఆరంటే ఆరు మాత్రమే పడతాయట!
► ఇది అణు, సంప్రదాయ ఆయుధాలు రెండింటినీ మోసుకెళ్లగలదు.
► ఇందులో ఏకంగా ఓ అణు రియాక్టరే ఉంటుంది. దాని సాయంతో ఇది స్వయం చాలితంగా పని చేస్తుంది.
► పొసెయ్‌డాన్‌ శత్రు యుద్ధ నౌకలను, తీర ప్రాంతాల్లోని లక్ష్యాలను నాశనం చేస్తున్నట్టున్న దృశ్యాలతో కూడిన వీడియోలను రష్యా రక్షణ శాఖ విడుదల చేసింది.
► అమెరికాలోని దాదాపు అన్ని తీర ప్రాంత నగరాలూ దీని పరిధిలోకి వస్తాయని రష్యా చెబుతోంది!


ఏమిటీ అండర్‌ వాటర్‌ డ్రోన్‌?
► వీటిని ఒకరకంగా చిన్నపాటి మానవరహితజలాంతర్గాములుగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా సముద్ర గర్భంలో వరుస పేలుళ్ల ద్వారా అతి పెద్ద రాకాసి అలల్ని పుట్టించి పరిసర ప్రాంతాలను నీట ముంచేస్తాయి. ఇవి స్వయంచాలితాలు. యుద్ధనౌకలు, లేదా ఇతర ప్రాంతాల నుంచి కంప్యూటర్లు, సెన్సర్ల ద్వారా వీటిని నియంత్రిస్తుంటారు. ఇలాంటి అండర్‌వాటర్‌ డ్రోన్లు 1950ల నుంచే ఉనికిలో ఉన్నట్టు్ట్ట బార్డ్‌ సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ ద డ్రోన్‌ చెబుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 250కి పైగా ఇలాంటి డ్రోన్లు వినియోగంలో ఉన్నట్టు అంచనా. మిలిటరీ డాట్‌కామ్‌ వివరాల మేరకు వీటిని జలాంతర్గాముల ద్వారా అమెరికా నేవీ 2015లో తొలిసారిగా మోహరించింది. ‘‘ఇది ప్రమాదకరమైన పనులెన్నింటినో అండర్‌వాటర్‌ డ్రోన్‌ గుట్టు గా చక్కబెట్టగలదు. ఒకవైపు వీటిని ప్రయోగించి శత్రు లక్ష్యాలను ఛేదించవచ్చు. శత్రువు దృష్టిని అటువైపు మళ్లించి ప్రధాన జలాంతర్గామి తన ప్రధాన లక్ష్యం మీద మరింత మెరుగ్గా దృష్టి సారించవచ్చు. అంటే రెట్టింపు ప్రయోజనమన్నమాట’’అని రక్షణ రంగ నిపుణులు            చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement