అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం( ఐఎస్‌ఎస్) నుంచి మూడు టన్నుల బరువైన తొమ్మిది బ్యాటరీలు నేడు (శనివారం) భూమిపైకి దూసుకురానున్నాయి. 2021లో ఐఎస్‌ఎస్ నుంచి వేరుపడిన ఈ బ్యాటరీలు ఇప్పుడు భూమిపై పడనున్నాయి. దీనిపై పలువురు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అత్యంత బరువైన ఎక్స్‌పోజ్డ్ ప్యాలెట్ 9 (ఈపీ9)ను 2021, మార్చి లో అంతరిక్ష కేంద్రం నుంచి తొలగించారు. దీనిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి పైకి విసిరిన అత్యంత భారీ వస్తువుగా గుర్తించారు. ఉపయోగించిన లేదా అనవసరమైన పరికరాలను ఈ విధంగా పారవేయడం అంతరిక్ష కేంద్రంలో సాధారణంగా జరుగుతుంటుంది. ఇవి భూ వాతావరణంలో ఎటువంటి హాని లేకుండా కాలిపోతాయి.
ఈపీ9 దూసుకువచ్చే ముందు జర్మనీలోని నేషనల్ వార్నింగ్ సెంటర్ పౌర రక్షణ, విపత్తు ఉపశమనం కోసం ఈ సమాచారాన్ని విడుదల చేసింది. ‘మార్చి 8 మధ్యాహ్నం నుంచి, మార్చి 9 మధ్యాహ్నం మధ్య భారీ అంతరిక్ష శకలం భూ వాతావరణంలోకి ప్రవేశించనుంది’ అని తెలిపింది. హార్వర్డ్-స్మిత్సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త జోనాథన్ మెక్‌డోవెల్ చేసిన సోషల్ మీడియా పోస్ట్‌లోని వివరాల ప్రకారం ఈ ఖగోళ వ్యర్థాలు మార్చి 9న ఉదయం 7:30 నుంచి మార్చి 9 ఉదయం 3:30 మధ్య భూ వాతావరణంలోకి ప్రవేశించనున్నాయి.
పలు నివేదికల ప్రకారం ఈ బ్యాటరీలు భూమికి ఎటువంటి హాని కలిగించవు. ఎందుకంటే అవి భూ వాతావరణంలోకి ప్రవేశించగానే, కాలిపోయి బూడిదగా మారతాయి. అయితే వాటిలోని కొన్ని శకలాలు భూమికి చేరవచ్చు. అయితే వీటి వలన భూమికి ఎలాంటి హాని జరగదని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చెబుతోంది.
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంతరిక్షం నుంచి దూసుకు వస్తున్న ఈ బ్యాటరీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. అయితే ఇవి ఎక్కడ, ఎప్పుడు పడతాయనే దానిపై పలు అంచనాలు వేస్తోంది. దీనిపై ఖచ్చితమైన సమాచారం ఏజెన్సీకి ఇంకా అందుబాటులో రాలేదు. వాతావరణం తీరుతెన్నుల కారణంగా ఈ బ్యాటరీలు భూమిపై పడే ప్రాంతాన్ని ఖచ్చితంగా చెప్పడం శాస్త్రవేత్తలకు అసాధ్యంగా మారింది.
అంతరిక్షం నుంచి భూమిపైకి శకలాలు దూసుకు రావడం కొత్తేమీ కాదు. ప్రతిరోజూ ఉపగ్రహాల నుండి వ్యర్థాలు భూమిపై పడుతుంటాయి. కొన్ని వేల సంవత్సరాలుగా ఇలా జరుగుతోంది. అయితే భారీ బ్యాటరీలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి భూమికి దూసుకు వస్తున్నప్పుడు శాస్త్రవేత్తలలోనూ ఆందోళన నెలకొనడం సహజం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఇది అంతరిక్ష శాస్త్రవేత్తల పరిశోధనా కేంద్రం. ఇది అమెరికా, రష్యాతో సహా అనేక దేశాల ఉమ్మడి ప్రాజెక్ట్. శాస్త్రవేత్తల బృందం అంతరిక్ష సంబంధిత ప్రయోగాలను ఇక్కడ నిర్వహిస్తుంటుంది. అంతరిక్షంలో మరో అంతరిక్ష కేంద్రం కూడా ఉంది. దానిని చైనా నిర్మించింది.
Comments
Please login to add a commentAdd a comment