రోజు రోజుకు ప్రపంచం మారిపోతోంది. దాంతో పాటే మన పరిసరాలు కూడా ఎంతో మారిపోతున్నాయి. ఒక రోజు చూసినట్లుగా మరో రోజు ఉండటం లేదు. మనకు బాగా తెలిసిన ప్రాంతం అయినా.. ఓ ఏడాదో, రెండోళ్ల తర్వాతో మనం అక్కడకి వెళితే గుర్తుపట్టలేనంతగా మార్పులు వస్తున్నాయి. విశాలమైన రోడ్లు, ఎత్తైన భవంతులు కనబడుతున్నాయి. కొత్త రకం రవాణా వాహనాలు, మెట్రో రైళ్లు, పడవల్లాంటి కార్లు.. ఇలా ఒకటేమిటి ఎన్నో మార్పులు తక్కువ సమయంలోనే రావడం చూసి మనమే ఆశ్చర్యపోతున్నాం. అలాంటిది ఓ వ్యక్తి 68 ఏళ్ల పాటు జైల్లో ఉండి బయటకు వస్తే ఎలా ఉంటుంది. తన చిన్నప్పటి పరిస్థితులు, ఇప్పటి పరిసరాలు చూసి ఆశ్చర్యపోకుండా ఉండగలడా? ఇలాగే అమెరికాకు చెందిన జోసఫ్ లిగాన్ కూడా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు.
ఆకాశ హార్మ్యాలను చూసి..
లిగాన్ జైలుకెళ్లినప్పుడు తాను చూసిన సాధారణ నగరం ఫిలడెల్ఫియాను.. ఆకాశ హార్మ్యాలతో విరాజిల్లుతున్న ఇప్పటి ఫిలడెల్ఫియాను చూసి ఆశ్చర్యపోయాడు. జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఎత్తైన భవనాలను చూస్తూ.. ఇదంతా నాకు కొత్తగా ఉంది. అప్పట్లో ఇవన్నీ లేవు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కొత్త కొత్తగా మారిపోయిన వీధులను ఆసక్తిగా చూస్తున్నాడు. సరికొత్త పరిస్థితులను మెల్లగా అలవాటుపడుతున్నాడు. స్వెట్లర్లు, సాక్సులు, ఇతర ఆధునిక అవసర వస్తువులు కొనుక్కొని జీవితంలోని మరో అంకంలోకి అడుగుపెడుతున్నాడు. కాగా, అమెరికాలో జువనైల్ ఖైదీగా జైల్లోకి వెళ్లి అక్కడే ఎక్కువ కాలం ఉన్న రెండో వ్యక్తిగా లిగాన్ రికార్డుల్లోకి ఎక్కాడు. పాల్ గిడేల్ జూనియర్ లిగాన్ కంటే 213 రోజులు ఎక్కువగా జైల్లో ఉన్నాడు.
15 ఏళ్ల వయసులో..
అమెరికాలోని ఫిలడెల్ఫియాకు చెందిన లిగాన్ 15వ ఏట అంటే 1953లో జీవిత ఖైదీగా జువనైల్ జైలులో అడుగుపెట్టాడు. తన గ్యాంగుతో కలసి మందు కొడుతూ.. దోపిడీలు, దౌర్జన్యాలు చేస్తూ జల్సా చేసుకునేవాడు. అదే సమయంలో ఇద్దరిని హత్య చేసిన ఘటనలో అతను దోషిగా తేలాడు. దీంతో అతన్ని జైలుకు పంపారు. అయితే తాను వ్యక్తిగతంగా ఎవరినీ చంపలేదని చెపుతూ వచ్చాడు. అయినా అతన్ని వదల్లేదు. ఎట్టకేలకు అతని లాయర్ కృషితో దాదాపు 7 దశాబ్దాల జైలు జీవితం తర్వాత ఫిబ్రవరి 11న విడుదలయ్యాడు. నూనూగు మీసాల వయసులో జైల్లోకి వెళ్లిన లిగాన్.. 83వ ఏట నెరిసిన జుట్టు, బోసి నోరుతో బయటకు వచ్చాడు. తన బంధువులు, స్నేహితుల్లో చాలా మంది ఇప్పుడు లేరు. అతనికి ఓ స్వచ్ఛంద సంస్థ ఆసరాగా నిలిచి అన్ని అవసరాలు తీరుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment