వాషింగ్టన్: గుజరాత్‌లోని పోర్‌బందర్ సమీపంలో అరేబియా సముద్రంలో వాణిజ్య నౌకపై జరిగిన డ్రోన్ దాడి సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడికి కారణమైన డ్రోన్ ఇరాన్ నుంచి ప్రయోగించారని అమెరికా రక్షణశాఖ ముఖ్య కార్యాలయం పెంటగాన్ తెలిపింది. ఈ మేరకు పెంటగాన్ ఒక ప్రకటన విడుదల చేసింది.
‘జపాన్‌కు చెందిన కెమికల్ ట్యాంకర్ నౌక కెమ్ ప్లూటో మంగళూరు వెళుతోంది. ఈ నౌకపై భారత తీరానికి 200 నాటికల్ మైళ్ల దూరంలో డ్రోన్ దాడి జరిగింది. డ్రోన్ దాడితో చెలరేగిన మంటలను నౌకలోని సిబ్బంది ఆర్పివేశారు. నౌకపై దాడి చేసిన డ్రోన్‌ను ఇరాన్ నుంచి ప్రయోగించారు. వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడి చేయడం 2021 నుంచి ఇది ఏడోసారి’అని పెంటగాన్ అధికార ప్రతినిధి ఓ వార్తా సంస్థకు తెలిపారు. దీనిపై ఇరాన్ ఇంత వరకు స్పందించలేదు.
ఓ పక్క ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హతీ రెబెల్స్ దాడి చేస్తుండగా భారత సమీపంలో నౌకపై ఇరాన్ డ్రోన్ దాడి చేయడంతో అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అయితే డ్రోన్ దాడి తామే చేశామని ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. డ్రోన్ దాడికి గురైన కెమ్‌ప్లూటోకు భారత కోస్ట్‌గార్డ్ అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment