Morocco: భూకంప విలయం.. 1000 మంది మృతి | 296 Dead In Powerful Earthquake Hits Morocco: News Updates | Sakshi
Sakshi News home page

Morocco Earthquake: మొరాకోలో భూకంప విలయం.. 1000 మందికి పైగా మృతి

Sep 9 2023 10:40 AM | Updated on Sep 9 2023 7:12 PM

Powerful Earthquake Hits Morocco News News Updates - Sakshi

భారీ భూకంపంతో ఆ దేశం తల్లడిల్లిపోయింది. భవనాలు కుప్పకూలిపోయి.. 

రాబత్: ప్రకృతి విలయంతో ఆఫ్రికా దేశం మొరాకో తల్లడిల్లిపోయింది. శుక్రవారం రాత్రి సమయంలో మొరాకోలో భారీ భూకంపం సంభవించింది. కనీసం 1000 మంది మృతి చెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఎటు చూసినా భవనాలు కుప్పకూలిపోయి.. అయిన వాళ్ల కోసం ఆర్తనాదాలు పెడుతున్న హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని అక్కడి పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. 

శుక్రవారం రాత్రి 11.11 సమయంలో మధ్య మొరాకో మర్రకేచ్ నగరం కేంద్రంగా రిక్టర్‌ స్కేల్‌పై 7.2 త్రీవతతో భూకంపం సంభవించింది. ఉన్నట్లుండి భవనాలు కుప్పకూలిపోయాయి. రోడ్డుల వెంట ఉన్న జనం.. ప్రాణ భయంతో పరుగులు తీశారు. రాత్రంతా రోడ్ల మీదే గడిపారు.  భూకంపం ధాటికి..  వందల సంఖ్యలో మరణించి ఉంటారని మొరాకో ప్రభుత్వం ప్రకటించింది. మరో 300 మందిదాకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే భారీ సంఖ్యలో భవనాలు కుప్పకూలిపోవడంతో మృతుల సంఖ్యపై ఇప్పుడే నిర్ధారణకు రాలేమని ప్రభుత్వం చెబుతోంది. 

మొరాకో భూకంపం దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్స్‌(ట్విటర్‌)లో ఆయన సంతాప సందేశం ఉంచారు. 

యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపిన వివరాల ప్రకారం.. రాత్రి 11.11 గం. ప్రాంతంలో కొన్ని సెకండ్ల పాటు భారీగా భూమి కంపించింది. భూమి ఉపరితలం నుంచి 18 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం నమోదు అయ్యింది.  ఆ తర్వాత.. 19 నిమిషాల తర్వాత 4.9 తీవ్రతతో మరోసారి భూమి కంపించినట్లు వెల్లడించింది. అయితే మొరాకో నేషనల్‌ సెయిస్మిక్‌ మానిటరింగ్‌ అండ్‌ అలర్ట్‌ నెట్‌వర్క్‌ మాత్రం.. తీవ్రత 7గా ఉన్నట్లు చెబుతోంది. అలాగే.. కేవలం 8 కిలోమీటర్ల లోతునే ప్రకంపనల కేంద్రం గుర్తించినట్లు వెల్లడించింది.

మొరాకోలో స్వల్పతీవ్రతతో సంభవించే భూకంపాలకు సైతం తీవ్రమైన ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతూ ఉంటుంది. 1960లో రిక్టర్‌ స్కేల్‌పై 5.8 తీవ్రతతో సంభవించిన భూకంపం.. వేల మందిని బలిగొనడం గమన్హార్హం. 

ఇదిలా ఉంటే.. పోర్చుగల్‌, అల్జీరియాలోనూ భూకంపం సంభవించినా.. అవి స్వల్ఫ ప్రకంపనలే అని, ఎలాంటి నష్టం వాటిల్ల లేదని సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement