
తిబ్లిస్: జార్జియా ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఒక బిల్లు రణరంగానికి దారితీసింది. ఆ బిల్లుని వ్యతిరేకిస్తూ నిరసనకారులు రాజధాని తిబ్లిస్‌లోని పార్లమెంటు భవనాన్ని ముట్టడించారు. నిరసనకారుల్ని అడ్డుకోవడానికి పోలీసులు వాటర్ కెనాన్లు ప్రయోగించడంతో పరిస్థితులు అదుపు తప్పాయి. పోలీసులకు, నిరసనకారులకి మధ్య జరిగిన ఘర్షణలో 50 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు.
ప్రతిపక్ష నాయకుడు జురాబ్ జపారిడ్జ్ సహా 66 మందిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. జురాబ్‌ను బాగా కొట్టినట్టుగా కూడా వార్తలు వెలువడ్డాయి. జార్జియా ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ బిల్లుపై స్వదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీని ప్రకారం 20 శాతానికి పైగా విదేశీ నిధులు కలిగిన స్వచ్ఛంద సంస్థలు, మీడియా సంస్థలు తమని తాము విదేశీ ఏజెంట్లుగా ప్రకటించుకోవాల్సి ఉంటుంది. అలా ప్రకటించుకోకపోతే జైలు శిక్షతో పాటుగా భారీగా జరిమానాలు విధిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment