Rishi Sunak:‘నేను ఎన్నికైతే చైనాకు చుక్కలే’ | Rishi Sunak Pledges Tougher Stand On China If Elected | Sakshi
Sakshi News home page

చైనాపై రిషి సునాక్‌ సంచలన వ్యాఖ్యలు.. ఎన్నికైతే చుక్కలేనటా!

Published Mon, Jul 25 2022 9:21 AM | Last Updated on Mon, Jul 25 2022 9:46 AM

Rishi Sunak Pledges Tougher Stand On China If Elected - Sakshi

లండన్‌: బ్రిటన్‌ ప్రధాని అభ్యర్థి, భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌ చైనాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైతే చైనా పట్ల కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. దేశీయ, అంతర్జాతీయ భద్రతకు చైనా నెంబర్‌ వన్‌ ప్రమాదకారి అని అభివర్ణించారు. చైనా, రష్యా పట్ల రిషి సునాక్‌ బలహీనుడిగా ప్రత్యర్థి లిజ్‌ ట్రస్‌ ఆరోపణలు చేసిన క్రమంలో ఈ మేరకు మాట్లాడారు మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌. మరోవైపు.. యూకే-చైనా సంబంధాల అభివృద్ధికి రిషి సునాక్‌ సరైన వ్యక్తి అని డ్రాగన్‌ అధికారిక మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ ఇటీవల పేర్కొనటం గమనార్హం. 

చైనాను తరిమి కొడతాం..
తాను ప్రధాని పదవి చేపడితే చైనాతో వ్యవహరించే తీరుపై వివరించారు సునాక్‌. బ్రిటన్‌లోని 30 ఇన్‌స్టిట్యూట్లను మూసివేస్తామని, దాని ద్వారా సంస్కృతి, భాషా కార్యక్రమాల ద్వారా చైనా వ్యాప్తి చేస్తున్న సాఫ్ట్‌ పవర్‌ ప్రభావాన్ని అడ్డుకుంటామన్నారు. ‘మన యూనివర్సిటీల నుంచి చైనా కమ్యూనిస్ట్‌ పార్టీని తరిమికొడతాం. చైనా గూఢచర్యాన్ని అడ్డుకునేందుకు బ్రిటన్‌ డొమెస్టిక్‌ స్పై ఏజెన్సీ ఎంఐ5ని ఉపయోగిస్తాం. చైనా సైబర్‌ దాడులను అరికట్టేందుకు నాటో తరహా అంతర్జాతీయ సహకారాన్ని నిర్మిస్తాం. చైనా స్వదేశంలో మన సాంకేతికతను దొంగిలించి, మన విశ్వవిద్యాలయాలలోకి చొచ్చుకుపోతోంది. రష్యన్ చమురును కొనుగోలు చేయడం ద్వారా విదేశాలలో వ్లాదిమిర్ పుతిన్‌కు మద్దతుగా నిలుస్తోంది. తైవాన్‌తో సహా పొరుగువారిని బెదిరించే ప్రయత్నం చేస్తోంది.’ అని పేర్కొన్నారు. 

అప్పులు ఆశ చూపి అభివృద్ధి చెందుతున్న దేశాలను తన అధీనంలోకి తెచ్చుకుంటున్న చైనా బెల్ట్‌ అండ్‌ రోడ్‌ పథకంపై తీవ్ర విమర్శలు చేశారు రిషి సునాక్‌. అలాగే.. జింజియాంగ్‌, హాంకాంగ్‌లలో తన సొంత ప్రజలను వేధించటం, అరెస్టులు చేస్తూ మానవ హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. వారి కరెన్సీని తగ్గిస్తూ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని తీవ్రంగా ఖండించారు రిషి. ‘జరిగింది చాలు. చాలా కాలంగా బ్రిటన్‌తో పాటు పశ్చిమ ప్రాంతంలోని రాజకీయ నాయకులు చైనాకు ఎర్ర తివాచీ పరిచారు. చైనా కుటిల బద్ధిపై గుడ్డిగా వ్యవహరించారు. దానిని ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజునే మారుస్తా.’ అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: రిషి సనాన్ తగ్గేదేలే.. సర్వేలపై పరోక్షంగా పంచ్‌లు.. ప్రధాని రేసులో అండర్‌డాగ్‌


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement