మిన్‌స్క్: ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న వేళ ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. బెలారస్‌లోని ఫ్యాఫిట్ వేదికగా రెండు దేశాల ప్రతినిధుల మధ్య జరిగిన కీలక చర్చలు సమస్య పరిష్కారం కాకుండానే ముగిసినట్టు సమాచారం.
అయితే, శాంతి చర్చల కోసం ఉక్రెయిన్ తరఫున ఆ దేశ రక్షణశాఖ మంత్రితో కూడిన ఆరుగురు సభ్యులు బృందంతో రష్యాకు చెందిన ఐదుగురు ప్రతినిధుల బృందం చర్చలు జరిపింది. సుమారు 4 గంటల పాటు రెండు దేశాల ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ భేటీపై ఎంతో ఉత్కంఠ నెలకొనగా చివరకు చర్చలు సఫలం కాకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది.
కాగా, శాంతి చర్చల్లో యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని, క్రిమియా నుంచి కూడా బలగాలను తొలగించాలని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తుండగా.. నాటోలో చేరబోమని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని రష్యా పట్టుబట్టినట్టు తెలుస్తోంది. ఇరు పక్షాలు తమ పంతం నెగ్గించుకోవడానికే ప‍్రయత్నించడంతో చర్చలు విఫలమైనట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. దీంతో ఎలాంటి తీర్మానాలు లేకుండానే చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి.
రష్యా కౌంటర్ అటాక్..
ఇదిలా ఉండగా.. ఈయూ దేశాల ఆంక్షలపై రష్యా కౌంటర్ ఇచ్చింది. బ్రిటన్, జర్మనీ, కెనడా, స్పెయిన్ తదితర 36 దేశాలకు చెందిన విమానాలను రష్యా నిషేధిస్తున్నట్టు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే, ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో యూరోపియన్ యూనియన్‌లోని దేశాలు రష్యా గగనతలంపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీంతో రష్యా ఈ నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment