
డొనెట్స్‌క్‌లో అప్రమత్తంగా ఉక్రెయిన్ సైనికుడు
కీవ్: ఉక్రెయిన్–రష్యా యుద్ధం ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో ఎవరికీ తెలియదని నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ చెప్పారు. జర్మనీ వార పత్రికకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇరు దేశాల నడుమ యుద్ధం ఏళ్ల తరబడి కొనసాగే అవకాశం ఉందని, దానికి అందరూ సిద్ధపడాలని చెప్పారు. ప్రపంచదేశాలు ఉక్రెయిన్‌కు వివిధ రూపాల్లో ఇస్తున్న మద్దతును ఇలాగే కొనసాగించాలని సూచించారు. మద్దతును బలహీనపర్చరాదని అన్నారు.
జవాన్లను కలుసుకున్న జెలెన్‌స్కీ
చాలారోజులుగా రాజధాని కీవ్‌కే పరిమితం అవుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తాజాగా మైకోలైవ్, ఒడెసాలో జవాన్లను, ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బందిని కలుసుకున్నారు. స్వయంగా మాట్లాడి, వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. తాజా పరిణామాలపై ఆరా తీశారు. విశేషమైన సేవలందిస్తున్న పలువురికి బహుమతులు ప్రదానం చేశారు. వారి సేవలకు గాను కృతజ్ఞతలు తెలిపారు. మైకోలైవ్‌లో జెలెన్‌స్కీ పర్యటన ముగిసిన కొద్దిసేపటి తర్వాత రష్యా సేనలు విరుచుకుపడ్డాయి. ప్రావ్‌డైని, పొసద్–పొక్రోవ్‌స్క్, బ్లహోదట్నే ఉక్రెయిన్ సైనిక స్థావరాలపై ఫిరంగులతో దాడి చేశాయి. గలిస్టీన్ కమ్యూనిటీలో రష్యా దాడుల్లో ఇద్దరు మరణించారు.
జవాన్లలో అడుగంటుతున్న నైతిక స్థైర్యం!
ఉక్రెయిన్– రష్యా మధ్య నాలుగు నెలలుగా యుద్ధం కొనసాగుతోంది. ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. నెలల తరబడి తమ కుటుంబాలకు దూరంగా ఉంటున్న సైనికుల్లో నైతిక స్థైర్యం సన్నగిల్లుతోంది. తరచూ సహనం కోల్పోతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలను ధిక్కరిస్తున్నారు. ఇరు దేశాల సైన్యంలో ఇదే పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని బ్రిటన్ రక్షణ శాఖ వెల్లడించింది. డోన్బాస్‌లో ఇరు పక్షాల నడుమ భీకర పోరాటం సాగుతోందని, ఆదే సమయంలో జవాన్లు నిరాశలో మునిగిపోతున్నారని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment