ఎస్.రాజమహేంద్రారెడ్డి:
నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) సభ్య దేశాల సమావేశం ఉక్రెయిన్ ఆశలపై నీళ్లు చల్లింది. నాటో.. నాటో అంటూ కలవరించిన ఉక్రెయిన్ ఇప్పుడు నాటు.. నాటు అనక తప్పడం లేదు. గతేడాది మాడ్రిడ్‌లో జరిగిన సమావేశం అనంతరం స్వీడన్, ఫిన్లండ్‌లను కూటమిలో చేర్చుకుంటున్నట్టు నాటో ప్రకటించింది. ఆ రెండు దేశాలు జూలై 11, 12 తేదీల్లో లిథువేనియాలో జరిగిన సమావేశాలకు కూడా హాజరయ్యాయి.
ఇదే బాటలో నాటో కూటమి తమను కూడా అక్కున చేర్చుకుంటుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆశించారు. కానీ ఆయన అనుకున్నదొకటైతే జరిగింది మరొకటి! ఉక్రెయిన్ భవిష్యత్తు తమతోనే ముడిపడి ఉంటుందని సమావేశం చివరి రోజు నాటో పేరుకు ఒక ప్రకటన చేసినా, ఆ భవిష్యత్తు ఎప్పుడు ఆరంభమవుతుందో మాత్రం స్పష్టం చేయలేదు.
దాదాపు 500 రోజులకు పైగా రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు పశి్చమ దేశాలు ఆయుధ సామగ్రితో పాటు యుద్ధ ట్యాంకులు, ఫైటర్ జెట్‌లను సమకూరుస్తూ అండగా ఉన్నప్పటికీ, ఆ సాయం వెనక ఆయా దేశాల ఊగిసలాట ధోరణి జెలెన్‌స్కీని కలవరపరుస్తూనే వస్తోంది. ప్రతిదానికీ చేతులు జోడించి ఎదురు చూడాల్సి రావడం ఆయనకు మింగుడు పడటం లేదు.
నాటో కూటమిలోకి ప్రవేశం దక్కితే ఈ అవస్థ ఉండదన్నది జెలెన్‌స్కీ ఆలోచన. నిజానికి నాటోలో చేరితే ఉక్రెయిన్ రక్షణ బాధ్యతను కూటమి దేశాలన్నీ సంయుక్తంగా మోయాల్సి ఉంటుంది. ఉక్రెయిన్ భవితవ్యాన్ని, రష్యాతో జరుగుతున్న యుద్ధ గమనాన్ని శాసించే నాటో సభ్యత్వ వ్యవహారంలో నిజానికి ఏం జరిగింది? ఉక్రెయిన్‌కు సభ్యత్వమిచ్చేందుకు ఎందుకు నాటో పచ్చజెండా ఊపలేదు? అసలు జెలెన్‌స్కీ ఆశించిందేమిటి? వివరాల్లోకి వెళ్దాం...
అనుకున్నదొక్కటి...
జెలెన్‌స్కీ ఏం ఆశిస్తున్నదీ సుస్పష్టం. గత సెపె్టంబరుకు ముందు ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ, నాటోలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం కావాలన్న తన అభ్యర్థనను 2023 జూలైలో లిథువేనియాలో జరిగే కూటమి సమావేశంలో వ్యక్తం చేస్తానని అన్నారు. కానీ ఈ వ్యాఖ్యల్లో మొక్కుబడితనమే తప్ప గాఢమైన కోరికేమీ ధ్వనించలేదు. ఉక్రెయిన్ ప్రాంతాలైన లుహాన్‌స్‌్క, డొనెట్‌స్‌్క, ఖెర్సన్, జపోరిజియాలను తమ భూభాగాలుగా గుర్తిస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ గత సెపె్టంబరులో ప్రకటించగానే జెలెన్‌స్కీ స్వరం మారిపోయింది.
నాటోలో తమకు పూర్తి సభ్యత్వమిచ్చే అంశాన్ని ఆగమేఘాల మీద పరిశీలించాల్సిందిగా జెలెన్‌స్కీ అభ్యరి్థంచడం మొదలెట్టారు. అంటే నాటో సభ్యత్వాన్ని ఉక్రెయిన్ సీరియస్‌గా ఆశిస్తున్నది కేవలం ఏడాది క్రితం నుంచేనని సుస్పష్టం. నాటో మార్గదర్శకాల ప్రకారం యూరప్‌లోని ఏ దేశమైనా సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పన్నెండు దేశాల కూటమిగా మొదలైన నాటో సభ్య దేశాల సంఖ్య ఇప్పుడు 32కు పెరిగింది. లిథువేనియాలోని విలి్నయస్‌లో జరిగిన నాటో భేటీకి హాజరైన జెలెన్‌స్కీ పనిలో పనిగా లుకిస్కస్ స్క్వేర్‌లో జరిగిన ఓ సభలో తమ అభీష్టాన్ని అక్కడి జనాలతో పంచుకున్నారు. సభా వేదికపై ‘ఉక్రెయిన్–నాటో 33’ నినాదాన్ని కూడా ప్రదర్శించడం విశేషం.
నాటో నేతలకే ఇష్టం లేదు...!
లుకిస్కస్ స్క్వేర్ సభా వేదికపై ప్రదర్శితమైన ‘ఉక్రెయిన్–నాటో 33’ బ్యానర్ అక్కడివారి మది దోచినా, ఉక్రెయిన్ మెడలో ఇప్పటికిప్పుడే ‘నాటో–33’ గుర్తింపు కార్డు పడటం మాత్రం నాటో నేతల్లోనే చాలామందికి అసలు ఇష్టం లేదు. అందుకే ‘అప్పుడే కాదం’టూ ఉక్రెయిన్ అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించారు. ఒకవైపు యుద్ధం కొనసాగుతుండగా మరోవైపు ఉక్రెయిన్‌కు సభ్యత్వాన్ని మంజూరు చేస్తే నాటో దేశాలన్నీ రష్యాపై ప్రత్యక్షంగా యుద్ధ బరిలోకి దిగాల్సి వస్తుంది.
నాటో నిబంధనల ప్రకారం ఏ సభ్య దేశంపై దాడి జరిగినా కూటమిలోని దేశాలన్నీ సంయుక్తంగా ఎదురు దాడి చేయాల్సి ఉంటుంది. నాటో నిబంధనల్లోని ఆరి్టకల్–5 ఈ విషయాన్ని స్పష్టంగా నిర్దేశించింది. నాటో చరిత్రలో ఇప్పటిదాకా ఒకే ఒక్కసారి, అమెరికాపై 9/11 ఉగ్ర దాడులు జరిగినప్పుడు ఈ నిబంధన అమలైంది. ఒకవేళ ఇప్పుడు గనక ఉక్రెయిన్‌కు సభ్యత్వమిస్తే కూటమిలోని మిగతా 32 దేశాలూ రష్యాపై యుద్ధానికి దిగాల్సి వస్తుంది.
‘నాటో దేశాల భూభాగంలో ఒక్క అంగుళం కూడా వదులుకోవడానికి మేం సిద్ధంగా లేం. ఇప్పుడు యుద్ధం నడిమధ్యలో ఉంటే తలపడటానికి సిద్ధంగా ఉన్నాం. అసలు ఆ మాటకొస్తే ఇప్పుడు మేమంతా రష్యాతో యుద్ధం చేస్తున్నట్టే లెక్క’ అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించడం గమనార్హం. నాటో కూటమి తమ సభ్య దేశాల పట్ల ఎంతటి అంకితభావంతో ఉంటుందో బైడెన్ ఈ వ్యాఖ్యలతో ప్రపంచానికి చాటారు. అయితే బైడెన్ వ్యాఖ్య వెనక అసలు ఉద్దేశాన్ని బ్రిటన్ రక్షణ మంత్రి జెన్ వాలెస్ కుండబద్దలు కొట్టారు.
‘ప్రస్తుతం యుద్ధం మధ్యలో ఉన్న దేశాన్ని ఇప్పటికిప్పుడు కూటమిలోకి ఆహా్వనించలేం. అలా చేయడం మొత్తం కూటమినీ యుద్ధభూమిలోకి లాగడమే అవుతుంది’’ అంటూ అసలు విషయం చెప్పకనే చెప్పారు. యుద్ధం ముగిశాక గెలుపోటములతో నిమిత్తం లేకుండా వీలైనంత త్వరగా ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చుకుంటామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ సభ్యత్వానికి నాటో ఇలా సూత్రప్రాయంగా అంగీకరించినా అధికార ముద్ర ఎప్పుడు పడుతుందో చెప్పలేం. యుద్ధం ముగిసేదాకా ఉక్రెయిన్‌కు నాటో మోక్షం లేదని స్పష్టంగా తెలిసిపోతున్నా, యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనేది మాత్రం అస్పష్టం!
జెలెన్‌స్కీకీ ముందే తెలుసు...!
యుద్ధం జరుగుతుండగా నాటో సభ్యత్వం రావడం కల్లేనని జెలెన్‌స్కీకీ తెలుసు. అయితే రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ఆయన పదేపదే నాటో సభ్యత్వం కోసం డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ‘యుద్ధం జరుగుతుండగా నాటో సభ్యత్వం మాటే ఉండదు. మాకది ఇష్టం లేక కాదు, కానీ అసాధ్యం’ అని జెలెన్‌స్కీ ఐదారు నెలల క్రితం కీవ్‌లో తన మనసులో మాటను సుస్పష్టంగా చెప్పారు.
అయితే యుద్ధం ముగిసిన వెంటనే నాటో సభ్యత్వం లభించేలా ఓ రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేసుకోవడానికే పదేపదే ఇలా సభ్యత్వం కోసం డిమాండ్ చేస్తూ వస్తున్నారు. సభ్యత్వంపై ఎటూ తేల్చని నాటో కనీసం ఆ దిశగా ఎలాంటి కార్యాచరణనూ ప్రకటించకపోవడం ఉక్రెయిన్ అధ్యక్షుడిని నిరాశకు గురి చేసింది. ఇది ఒకరకంగా ఉక్రెయిన్‌ను ఆగమ్యగోచరమైన పరిస్థితిలోకి నెట్టిందనే భావించాలి.
ఉక్రెయిన్ ఉక్రెయిన్‌గా నిలవాలంటే యుద్ధాన్ని గెలవాలి, లేదా రష్యాతో సంధి కుదుర్చుకోవాలి. ఈ రెండు పరిస్థితుల్లోనే ఉక్రెయిన్ నాటోలో చేరగలుగుతుంది. ఓడిపోతే ఉక్రెయిన్ రష్యాలో అంతర్భాగంగా మారిపోతుంది. అప్పుడిక దానికి నాటో ప్రస్తావన అవసరమే లేకుండా పోతుంది. గెలుపోటములను కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఇప్పటిదాకా ‘అయితే గియితే’లో ఉన్న నాటో సభ్యత్వ అంశం ‘ఆ సుదినం ఎప్పుడు’ అనేదాకా అయితే వచి్చంది. ప్రస్తుతానికి ఉక్రెయిన్‌కు ఊరటనిచ్చే విషయం ఇదొక్కటే. యుద్ధం త్వరలో ఓ కొలిక్కి వచ్చి ఉక్రెయిన్‌కు నాటో తలుపులు తెరుకోవాలని కోరుకుందాం! తెరుచుకుంటాయనే ఆశిద్దాం!!
Comments
Please login to add a commentAdd a comment