కీవ్: ఏడాది క్రితం మొదలైన రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరికొన్నేళ్లు సాగే అవకాశాలున్నాయని ప్రైవేట్ మిలటరీ కాంట్రాక్టర్, వాగ్నర్ గ్రూప్ యజమాని యెవ్‌గెనీ ప్రిగోజిన్ అంటున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ప్రిగోజిన్‌కు చెందిన ప్రైవేట్ సైన్యం రష్యా మిలటరీతో కలిసి ఉక్రెయిన్‌లో యుద్ధం చేస్తోంది. శుక్రవారం ఓ వీడియో ఇంటర్వ్యూలో ప్రిగోజిన్.. కీలక పారిశ్రామిక ప్రాంతం డోన్‌బాస్‌పై పూర్తి స్థాయి ఆధిపత్యం సాధించేందుకు రష్యాకు ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వరకు పట్టొచ్చని అంచనా వేశారు.
నీపర్ నదికి తూర్పు వైపునున్న విస్తార ప్రాంతంపై పట్టు సాధించాలంటే మాత్రం రష్యాకు మూడేళ్ల వరకు సమయం తీసుకుంటుందని అన్నారు. కంచుకోటలాంటి డొనెట్‌స్క్‌లోని బఖ్ముత్‌లో ఉక్రెయిన్ దళాలతో తమ గ్రూప్ శ్రేణులు భీకర పోరాటం సాగిస్తున్నాయని చెప్పారు. తమ ‘స్పెషల్ మిలటరీ ఆపరేషన్’అనుకున్న లక్ష్యాలను సాధించే వరకు కొనసాగుతుందని రష్యా కూడా చెబుతుండటం గమనార్హం. రష్యా అధ్యక్ష భవనమైన క్రెమ్లిన్ కేటరింగ్ కాంట్రాక్టులు చేసే ప్రిగోజిన్‌కు ‘పుతిన్ వంటమనిషి’గా పేరుంది. శనివారం ఒడెసాలో వ్యూహాత్మక రైల్వే వంతెనను రష్యాకు చెందిన సీ డ్రోన్ దాడితో పేల్చేస్తున్న వీడియో ఒకటి రష్యా మిలటరీ బ్లాగర్లు విడుదల చేశారు. దీనిని ఇరు దేశాలు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment