
జపాన్ మాజీ ప్రధాని మృతికి గల కారణాలను వెల్లడించిన పోలీస్ ఉన్నతాధికారి. అబే భద్రతకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు.
Shinzo Abe's Security Had Flaws: జపాన్ మాజీ ప్రదాని షింజే అబే దారుణ హత్యకు సంబంధించి స్థానిక పోలీస్ ఉన్నతాధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన భద్రతా విషయాలకు సంబంధించి కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. ఈ మేరకు జపాన్ పోలీస్ ఉన్నతాధికారి మాట్లాడుతూ.....మాజీ ప్రధాని షింజో అబే భద్రతకు సంబంధించి కాదనలేని లోపాలు ఉన్నాయని అన్నారు. ఒక దుండగుడు ఆయనకు సమీపంలోకి వచ్చి మరీ కాల్పులు జరపగలిగాడంటే ఆయనకు ఎటువంటి పటిష్టమైన భద్రత ఉందో తెలుస్తోందని చెప్పారు.
హింసాత్మక నేరాలు తక్కువ సంఖ్యలో నమోదయ్యే జపాన్‌లో ఇలాంటి హత్య జరిగిందంటే నమ్మశక్యంగా లేదన్నారు. పైగా కఠినమైన తుపాకి చట్టాలు ఉన్న జపాన్ దేశంలో ఈ ఘటన చోటుచేసుకోవడం బాధకరం అన్నారు. అంతేకాదు జపాన్‌లో స్థానిక ప్రచార కార్యక్రమాల్లో భద్రత సాపేక్షంగా సడలించబడుతుందని చెప్పారు. ఏదీ ఏమైన ఆయనకు పటిష్టమైన భద్రత లేదని స్పష్టమవుతోందని అన్నారు.
తన 27 ఏళ్ల కెరియర్‌లో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొలేదని, ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహిస్తానని చెప్పారు. అంతేకాదు మాజీ ప్రధాని అబే రక్షణకు సంబంధించి భద్రతా చర్యల్లో చాలా లోపాలు ఉన్నాయని, ఇది కాదనలేని వాస్తవమని జపాన్ పోలీస్ ఉన్నతాధికారి టోమోకి ఒనిజుకా భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. ఈ దురదృష్టకరమైన ఘటన చోటుచేసుకున్న ప్రాంతంలో కఠినమైన చర్యలు తీసుకోవడమే గాక పూర్తి స్తాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.