సియోల్: రాజధాని సియోల్‌లో శనివారం రాత్రి చోటుచేసుకున్న దుర్ఘటనకు తమ వైఫల్యమే కారణమని దేశ పోలీస్ చీఫ్ యూన్ హీ క్యూన్ అంగీకరించారు. హాలోవిన్ ఉత్సవాల్లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 156 మంది చనిపోగా, మరో 151 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 26 మంది పరిస్థితి విషమంగా ఉంది. ‘జరగబోయే ప్రమాదం గురించి ఘటనకు ముందు అందిన అత్యవసర ఫోన్‌కాల్స్‌పై మా అధికారులు సరిగా స్పందించలేదని తేలింది. వెంటనే చర్యలు తీసుకుని ఉంటే విషాదం నివారించగలిగే వారం. ప్రభుత్వ విభాగం అధిపతిగా ఈ దుర్ఘటనకు నాదే బాధ్యత’ అని యూన్ చెప్పారు.
ఈ దుర్ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రభుత్వంపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. మృతి చెందిన 156 మందిలో 101 మంది మహిళలుండగా వీరిలో ఎక్కువ మంది టీనేజర్లని ప్రభుత్వం తెలిపింది. పురుషులతో పోలిస్తే వీరు తక్కువ ఎత్తు ఉండటం, శారీరకంగా తక్కువ బలవంతులు కావడంతో తోపులాటలో ఛాతీ ఎక్కువ ఒత్తిడికి గురై ఊపిరాడక చనిపోయారని పేర్కొంది. హాలోవీన్ ఉత్సవాల కోసం 137 మంది అధికారులను కేటాయించామని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. వీరికి డ్రగ్స్ వాడకాన్ని నివారించే బాధ్యతలే తప్ప, బందోబస్తు విధులను కేటాయించలేదన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా లక్ష మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం, నిర్వాహకులెవరూ లేకపోవడం కూడా ప్రమాదానికి కారణమని భావిస్తున్నామన్నారు. మృతుల్లో అమెరికా, చైనా, రష్యా, ఇరాన్ తదితర దేశాలకు చెందిన పౌరులు కూడా ఉన్నారు.
చదవండి: ఎవరెస్ట్ నేర్పే పాఠం ఎలాంటిదంటే..
Comments
Please login to add a commentAdd a comment